పవన్ కల్యాణ్ కల నెరవేరుతుందా..?

మొన్నటివరకు సిద్ధాంతాలంటూ కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్, నేరుగా వెళ్లి బీజేపీతో చేతులు కలిపారు. ఇకపై భారతీయ జనతా పార్టీతోనే ప్రయాణమని తేల్చేశారు. మొన్నటివరకు తెరచాటు వ్యవహారంగా ఉన్న ఈ పొత్తు ఇప్పుడు అధికారికమైపోయింది. అయితే ఈ పొత్తుతో పవన్ కల్యాణ్, ఏపీకి ముఖ్యమంత్రి అవ్వగలరా? ఆ సంగతి పక్కనపెడితే 2024 వరకు బీజేపీతో ఆయన పొత్తు కొనసాగించగలరా?

పవన్ కు ముఖ్యమంత్రి పీఠం అంటే ఎంతో ఇష్టం. పార్టీ పెట్టడంతోనే ఆయన ముఖ్యమంత్రి స్థానంపై కన్నేశారు. 2014లో బీజేపీ-టీడీపీకి మద్దతు ఇవ్వడంతో అది సాధ్యం కాలేదు. గత ఎన్నికల్లో మాత్రం తానే కాబోయే ముఖ్యమంత్రినని ఎప్పటికప్పుడు ప్రకటించుకున్నారు. ఒకవేళ మెజారిటీ రాకపోయినా, కర్నాటక తరహాలో తక్కువ సీట్లు వచ్చినా సీఎం అయిపోతానని భావించారు. సభల్లో సీఎం సీఎం అంటూ జనసైనికులు అరుస్తుంటే, చెవులారా విని ఆత్మతృప్తి పొందేవారు. కట్ చేస్తే, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుతో భూస్థాపితం అయ్యారు.

ఎన్నికల తర్వాత తన పరిస్థితి, పార్టీ పరిస్థితిని బాగా అర్థంచేసుకున్నారు పవన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో జట్టు కట్టడమంటే మునిగే నావ ఎక్కడమే. ఇక వైసీపీని ఎప్పుడూ శత్రువుగానే చూస్తున్నారు పవన్. కమ్యూనిస్టులతో కథ ఎప్పుడో కంచికి చేరింది. సో.. మిగిలిన ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీజేపీ. అందుకే ఆ పార్టీతో చేతులు కలిపారు. 

అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం అతడికి రాజకీయంగా ఎలాంటి మైలేజీ ఇవ్వకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. మరీ ముఖ్యంగా అతడు కలగంటున్న ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు పూర్తిగా తక్కువ. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ రెండు పార్టీల మధ్య మాత్రమే పోరు ఉంటుంది. ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ త్రిముఖపోటీ కనిపించలేదు. చివరికి 2019లో కూడా పోటీ టీడీపీ-వైసీపీ మధ్య జరిగింది తప్ప.. జనసేన ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో 2024లో కూడా క్యాడర్ పరంగా వైసీపీ-టీడీపీ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. 

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఓటు బ్యాంక్. జనసేన-బీజేపీ కలయికతో ఓటు బ్యాంక్ కూడా చీలే అవకాశం లేదు. ఎందుకంటే.. భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలో ఓటు బ్యాంక్ లేదు. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఓట్లు బీజేపీకి పడే అవకాశమే లేదు. ఎందుకంటే.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని బీజేపీ నెరవేర్చలేదు. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల్ని నిలువునా మోసం చేసింది. పోయిపోయి అలాంటి పార్టీతో వెళ్లి కలిశారు పవన్. 

కాస్త సింబాలిక్ గా చెప్పుకుంటే.. చుట్టూతిరిగి టీ మాస్టర్ (మోడీ) దగ్గరకే గ్లాస్ (జనసేన గుర్తు) వెళ్లింది. అంతకుమించి ఈ పొత్తుతో ఎలాంటి పెనుమార్పులు సంభవించవు. పైపెచ్చు జనసేన పార్టీకే నష్టం.

తెర తొలిగింది

Show comments