ఎమ్బీయస్‌: పౌరసత్వం ఇచ్చేందుకా? తీసేయడానికా?

సిఏఏ తెచ్చినది పౌరసత్వం యివ్వడానికే తప్ప, తీసేయడానికి కాదని మోదీ ప్రకటించారు. పొరుగున ఉన్న మూడు ముస్లిం దేశాల మైనారిటీలకు లాభం చేస్తుంది తప్ప యితరులకు హాని చేయదని హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అంటున్నారు. వాళ్లు చెప్పనిదేమిటంటే పౌరసత్వం యిచ్చే వర్గాలు వేరు. పౌరసత్వం లాక్కుంటాడని భయపడే వర్గాలు వేరు. అసలైన భారతీయులెవరికీ పౌరసత్వమూ పోదు అని ప్రభుత్వం హామీలు గుప్పిస్తున్నా, ప్రజలకు భయం వేయడానికి కారణమేమిటంటే ఎవరు అసలో, ఎవరు నకిలీయో తేల్చడంలో పొరబాటు జరుగుతుందని! 'నువ్వు అసలైన భారతీయుడివి కావు' అని ప్రభుత్వాధికారి అనేస్తే నువ్వు ఏమీ చేయలేవు. 'వీడు అసలైన భారతీయుడు కాడు కాబట్టి తరిమివేస్తున్నా, డిటెన్షన్‌ క్యాంప్‌లో నిర్బంధిస్తున్నా' అని ప్రభుత్వం తక్కిన ప్రజలకు చెపితే ఎవడూ నీ తరఫున మాట్లాడను కూడా మాట్లాడడు. అలా అనర్హుడిగా ముద్ర పడే ప్రమాదం కేవలం ముస్లిములకే కాదు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఏ వ్యక్తికైనా ఉంటుంది.

ఇది నిర్హేతుకమైన ఆలోచన అని కొట్టి పారేసేముందు అసాంలో ఏం జరిగిందో చూడండి. ఎన్నార్సీ అత్యంత అవసరమైన రాష్ట్రం అది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు దశాబ్దాలపాటు వాయిదా వేస్తూ పోతూ ఉంటే చివరకి సుప్రీం కోర్టు కలగజేసుకుని తన ఆధ్వర్యంలో ఎన్నార్సీ నిర్వహింపచేసింది. 50 వేల మంది ప్రభుత్వోద్యోగులు పాల్గొన్నారు. రూ. 1220 కోట్లు ఖర్చయ్యాయి. 4 సంవత్సరాలు పట్టింది. జాబితా తయారు కావడానికి అనేక వాయిదాలు అడిగారు. చివరకు ఓ ఫైనలాతి ఫైనల్‌ జాబితా ముందుకు వచ్చింది. (ఇదంతా 3.20 కోట్ల మంది జనాభాను లెక్కించడానికి జరిగిన ప్రక్రియ. మరి దేశం మొత్తంగా ఉన్న 137 కోట్ల జనాభాకు ఎన్నార్సీ నిర్వహిస్తే ఎంత ఖర్చో, ఎంత శ్రమో, ఎన్నేళ్లు పడుతుందో ఆలోచించండి) అసామీయులు తమ రాష్ట్రంలో కనీసం 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నారని చెప్తూ వచ్చారు. కానీ యీ జాబితా 19 లక్షల మందినే పేర్కొంది. అధికారుల అవకతవకల వలన అసలైన వాళ్లను అనర్హులుగా ప్రకటించి, అక్రమంగా వచ్చినవారిని పౌరులుగా చూపారని స్థానికులు వాపోతున్నారు. 

మాజీ సైనికులను, మాజీ ముఖ్యమంత్రి బంధువులను కూడా యీ దేశపు పౌరులు కాదని చూపారు. ఈ దెబ్బతో ముస్లిములందరూ అక్రమ వలసదారులుగా ముద్రపడతారని ఆశించినవారికి ఆశాభంగం కలిగేట్లా ఈ 19 లక్షల్లో 60% మంది ముస్లిమేతరులని కొన్ని వార్తలు వచ్చాయి. 19 లక్షల్లో 5.5 లక్షల మంది మాత్రమే హిందువులని అసాం బిజెపి నాయకుడు శర్మ అన్నాడు. కాదు, 9 లక్షలని కొందరన్నారు. ''ఇండియా టుడే'' తన జనవరి 20 సంచికలో 14 లక్షల మంది హిందువులే అంది. మోదీ ప్రభుత్వం అన్ని రకాల గణాంకాలను దాచేస్తూంటుంది కాబట్టి, సరైన అంకెలు బయటకు రాక, ఎవరికి తోచినది వారు చెప్పేయడానికి ఆస్కార మిస్తోంది. ఒకటి మాత్రం నిజం - బిజెపి అనుకున్న దాని కంటె ఎక్కువ సంఖ్యలో హిందువులు అనర్హులుగా తేలారు. అందువలన ఆ ఎన్నార్సీని రద్దు చేసి, మళ్లీ నిర్వహిస్తామంటున్నారు. అంటే 1220 కోట్లు, 4 ఏళ్ల శ్రమ బూడిదలో పోసినట్లే నన్నమాట.

సిఏఏకు వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. కేవలం ముస్లిములే ఆందోళన చెంది, ఆందోళన చేస్తున్నారని అనుకునేవాళ్లు ఈశాన్య భారతం ఎందుకు రగులుతోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సిఏఏ చట్టం గురించి తెలుసుకున్న కొద్దీ దాని అసమగ్రత, తర్కరాహిత్యం అవగతమౌతుంది. దానికి ఎన్నార్సీకి, ఎన్నార్సీకి ఎన్పీయార్‌కి లింకులేమిటి అనేదానిపై కూడా స్పష్టత తెచ్చుకోవాలి. అప్పుడే దీని వెనుక బిజెపి ఎజెండా ఉందని కొందరు ఎందుకు అనుమానిస్తున్నారో అర్థమవుతుంది. విషయాన్ని అన్ని కోణాల్లోంచి పరిశీలించకుండా హిందువులు అనగానే గంగవెర్రులు ఎత్తిపోయేవాళ్లకు యివేమీ పట్టవు. పాపం ఆ దేశాల్లో హిందువులు కష్టపడిపోతున్నారు అనుకుని వాళ్ల కోసం ఏదో ఒకటి చేస్తే నేరమా? అని వాదిస్తున్నారు.

హిందువులు అనగానే వాటేసుకోవాలి అని వాదించే వీరు, కులతత్వం ప్రదర్శించినపుడు ఆశ్చర్యం వేయదా? సాటి హిందువే అయినా పరకులస్తుణ్ని శత్రువుగా ఎందుకు పరిగణిస్తున్నారు? కులఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? కులం గురించనే కాదు, రాజకీయ విభేదాలు ఉన్నా తలలెందుకు పగలకొట్టుకుంటున్నారు? తమలో తాము ఎందుకు తిట్టుకుంటున్నారు? అంతెందుకు, నేను కొన్ని అంశాలపై నా అభిప్రాయాలివి అని తెలియపరుస్తూ కబుర్లు చెపుతున్నాను. వాటితో ఏకీభవించమని ఎవరిపైనా ఒత్తిడి తేవటం లేదు. అయినా నాతో విభేదించేవారిలో కొందరు దారుణమైన భాషలో దాడి చేస్తూంటారు. వ్యక్తిగతంగా వెళ్లి నా వయసు గురించి, అనారోగ్యం గురించి హేయమైన వ్యాఖ్యలు చేస్తూంటారు - వాళ్లు ఎల్లప్పటికీ త్రిదశులుగానే ఉంటారనీ, అనారోగ్యం వారి గుమ్మం వరకు కూడా రాదని వాళ్ల నమ్మకం కాబోలు! అలా చేయడానికి వారికి హైందవ సంస్కారం అడ్డు రాదు. సాటి హిందువు కదాని నన్ను మన్నించి వదిలేయరు.

హరిజనులు ఎల్లకాలం హిందువులుగానే మిగలాలని, యితర మతాల ప్రలోభాలకు లొంగకూడదని హిందువులందరూ ప్రబోధిస్తారు. అయినా వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే అర్థమేమిటి? అణగదొక్కడానికి, అత్యాచారం చేయడానికి హిందూమతం అడ్డు రావటం లేదు. అప్పుడు అతను సాటి హిందువని గుర్తుకు రాదు. ఈనాడు పాపం హిందువులు కదా, అక్రమ వలసదారులనీ రానిద్దాం అనేవారు రేపు వాళ్లు తమ అవకాశాలకు అడ్డు వచ్చినపుడు 'అసలు ఎవడు రానిచ్చాడండి వీళ్లని?' అంటూ ఎగురుతారు. నేను అనేకమందిని చూశాను - 'పాపం ఎస్సీ, ఎస్టీలకు ఏదైనా చేయాలండీ' అంటూంటారు. కానీ ఆఫీసులో తన కంటె తక్కువ సీనియారిటీ ఉన్న వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కోటాలో ప్రమోషన్‌ యిచ్చి తన నెత్తిమీద కూర్చోబెట్టినపుడు మండిపడతారు - 'ఇంకా ఎంతకాలమండీ యీ రిజర్వేషన్లు? ప్రతీసారీ పెంచుకుంటూ పోతారు? ఒక్క పార్టీ కూడా మన గురించి ఆలోచించదు, వాళ్ల ఓట్ల గురించే వాళ్లకు చింత. మనకు ఎవడో డిక్టేటరు వచ్చి యీ రిజర్వేషన్లన్నీ పీకి పారేయాలండీ..' అంటూ. 

అసాం హిందువులే, బంగ్లాదేశ్‌ హిందువులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలి. అక్కడ హిందూ-ముస్లిం గొడవ కాదు, అసామీ-బెంగాలీ గొడవ కాదు, భారతీయుడు-బంగ్లాదేశీ గొడవ మాత్రమే. అక్రమంగా చొరబడినవాడు హిందువా, క్రైస్తవుడా, ముస్లిమా అన్నది వాళ్లకు అనవసరం. వాణ్ని తరిమివేయాలి అంతే! అక్రమ వలసదారుల తాకిడి మన రాష్ట్రాలకు తగలలేదు కాబట్టి మనం ఔదార్యం ఒలకబోస్తాం. తగిలినపుడు యింకోలా మాట్లాడతాం. ఆంధ్రులు తమ అవకాశాలు దోచేశారని తెలంగాణ వాదులు ఉద్యమించారు. అప్పుడు హిందూత్వం, తెలుగుతనం ఏవీ గుర్తుకు రాలేదు. 

కొందరంటున్నారు - వాళ్లు వచ్చి నీ ఆస్తి తీసుకుంటున్నారా? అని. నాకు వ్యక్తిగతమైన ఆస్తితో బాటు, జాతీయపరమైన ఆస్తి కూడా ఉంది. నిజానికి పేదలకు రెండోదే వుంది, మొదటిది లేదు. ఈ దేశంలో యిన్ని రోడ్లు ఉన్నాయంటే, యిన్ని నౌకాశ్రయాలు, యిన్ని విమానాశ్రయాలు, యిన్ని స్కూళ్లు, యిన్ని హాస్పటల్స్‌... ఉన్నాయంటే అవన్నీ మనమంతా (పూర్వ తరాలతో సహా) కలిసి నిర్మించుకున్నది. అంతేకాదు, యీ ప్రజాస్వామిక వ్యవస్థ కూడా. విదేశీ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే యీ జాతీయసంపద చూసే! నీదీ, నాదీ వ్యక్తిగత సంపత్తి చూసి కాదు. 

ఇప్పుడు సిఏఏ ద్వారా పౌరుడు అయ్యేవాడు యీ సంపదలో వాటా అడుగుతున్నాడు. అది గుర్తించాలి మనం. వాడికి ఏ అర్హత ఉంది? ఒకసారి పౌరుడయ్యాడంటే వాడికీ ఆరోగ్యశ్రీ ఉంటుంది, చంద్రన్న పసుపు-కుంకుమ ఉంటుంది, వైయస్సార్‌ అమ్మ ఒడి వుంటుంది, కెసియార్‌ కిట్‌ వస్తుంది. పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పేదల కంటూ పెట్టే సంక్షేమ పథకాలతో సగటు పౌరుడు యిప్పటికే కృంగుతున్నాడు. నానా రకాల రిజర్వేషన్ల కారణంగా అతనికి ఆదాయం వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు వీళ్ల భారం కూడా మోయాల్సి వస్తుంది. అదీ బాధ. 

పొరుగు దేశాలు మన భారతభూభాగంలో అంగుళం హరించినా మనం ప్రతిఘటిస్తాం. యుద్ధాలు చేస్తాం. అలాటిది ఆ దేశపు పౌరులను తీసుకుని వచ్చి మన దేశంలో ఎంత భూభాగం కట్టబెడుతున్నామో లెక్క వేయండి! అంటే వాళ్ల పేర భూమి రాసిచ్చేస్తామని కాదు. వాళ్లు జనాభా లెక్క ఎంతో కరక్టుగా తెలియదు కానీ, కొన్ని రాష్ట్రాలతో సమానంగా ఉంటుంది. అసాంలో తేలినవారే గోవా జనాభా కంటె ఎక్కువున్నారు. దేశం మొత్తం మీద ఏ 30 లక్షలో తేలితే సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ కలిపినంత! విడిగా నాగాలాండ్‌, మేఘాలయ, మణిపూర్‌ల కంటె ఎక్కువ! వీళ్లు ఆక్యుపై చేసే స్థలం అంత ఉంటుందన్నమాట. ఆ మేరకు మనం కోల్పోయినట్లేగా!

పౌరసత్వం కోరేవాళ్లు తాము అణచివేతకు గురయ్యారని రుజువులు చూపనక్కర లేదని అనడం పొరబాటు కదా అని నేను రాస్తే, పాకిస్తాన్‌లో హిందూ క్రికెటర్‌ ధనీశ్‌ కనేరియా అవమానాల పాలు కాలేదా? అంటూ కొందరు రాశారు. ప్రాణభీతితో దేశం వదిలి పారిపోవలసిన వర్గాలకు చెందినవాణ్ని పాకిస్తాన్‌ సమాజం జాతీయ టీములో ఎలా ఆడనిచ్చిందా అని నేను ఆశ్చర్యపడ్డాను. స్పాట్‌ ఫిక్సింగ్‌ స్కాండల్‌లో యిరుక్కుని శిక్ష అనుభవించేలోగా అతను 61 టెస్ట్‌ మ్యాచ్‌లలో ఆడాడు. అతనితో కలిసి పాక్‌ ముస్లిం క్రికెటర్లు  భోజనం చేసేవారు కాదని షోయబ్‌ అఖ్తర్‌ అన్నపుడు అదేమీ నేను నోటీస్‌ చేయలేదే అన్నాడితను. అతని కజిన్‌ అనిల్‌ సోనావారియా కూడా పాక్‌ టీములో టెస్ట్‌ క్రికెటరే! పాక్‌ క్రికెట్‌ టీములో యిప్పటివరకు 7గురు ముస్లిమేతరులు ఉన్నారట. భారత క్రికెట్‌ టీములో దళితుల శాతం బహు తక్కువనీ, అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తోందని కొందరు రాసిన వ్యాసాలు చదివాను. మరి మన సమాజం గురించి పాక్‌ ఎలాటి వ్యాఖ్యలు చేస్తుందో మరి! 

ఇక మతాంతీకరణ గురించి కూడా ఆలోచిస్తే.., అగ్రవర్ణాల దాష్టీకం భరించలేకనే మేం క్రైస్తవంలోకి మారుతున్నామని హరిజనులు అంటే మనం ఒప్పుకుంటామా? అబ్బే, ధనలాలసతోనో, మెరుగైన అవకాశాల కోసమో మారుతున్నారు అంటాం. పాక్‌లో కూడా ముస్లిమైతే అవకాశాలు పెరుగుతాయనే భావనతో మతం మారుతున్నారేమో తెలియదు. హైందవ బాలికను చెరిచారనే రిపోర్టులు పట్టుకుని కూడా ఏమీ తీర్మానించలేము. అవి యిక్కడా జరుగుతున్నాయి. ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా ఆడదానికి రక్షణ కరువైంది. బాధితురాలి కులం బట్టి, మతం బట్టి ఆ వర్గమంతా అణచివేతకు గురైందని చెప్పలేం. ఒక నిర్భయ, ఒక దిశ కేసు పట్టుకుని, దేశంలో ప్రతి మహిళ అన్యాయానికి గురవుతోందని చెప్పలేం. 'మీటూ' ఉద్యమంలో ఫిర్యాదు చేసిన ప్రతి మహిళ కేసూ సమర్థనీయంగా తోచలేదు. 

లంచగొండి అధికారో, నాయకుడో పట్టుబడినపుడు 'బిసిని కాబట్టి నాపై కక్ష కట్టారు' అని కులాన్ని అడ్డువేసుకున్న సందర్భాలూ ఉన్నాం. కొన్ని చెదురుమదురు సంఘటనలను ఆధారం చేసుకుని, ఈ దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కొందరు దళిత నాయకులు అంతర్జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేయడాలూ చూస్తున్నాం. వాటిని బట్టి దేశంలో బిసిల బతుకు, ఎస్సీఎస్టీల బతుకు దుర్భరమైందని ఆ సంస్థ తీర్మానిస్తే ఎలా ఉంటుంది? కారంచేడులో ఎప్పుడో ఓ ఘటన జరిగిందని, దేశంలో అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉందని అంటే ఎలా? 

కశ్మీరులో హిందువులను తరిమివేశారు. అది చూపించి 'భారతదేశంలో హిందువులను తరిమికొడుతున్నారు, ఆస్తులు దగ్ధం చేస్తున్నారు, హిందువునైన నాకు భయంగా ఉంది. మీ దేశంలో రక్షణ కల్పించి, మీ పౌరసత్వం యివ్వండి' అని నేను స్విజర్లండ్‌కు అప్లికేషన్‌ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి అన్ని రాష్ట్రాలలో ఉందా? ఎల్లకాలమూ ఉందా? అని ఆ దేశం అడగదా?

నేననేది - ప్రతీ కేసు వేరువేరని. వాటిని తరచి చూసి మాట్లాడాలి కానీ జనరలైజ్‌ చేసి మాట్లాడకూడదని. ఎవరైనా నేను మతపరమైన అణచివేతకు గురయ్యానని అర్జీ పెట్టుకుంటే, ఎలా అనేది కన్విన్సింగ్‌గా చెప్పగలగాలి. నాకు ఉద్యోగం రాలేదు, ప్రమోషన్‌ రాలేదు అంటే కుదరదు. టిడిపి హయాంలో రెడ్లకు ప్రమోషన్లు యివ్వలేదు, కాంగ్రెసు హయాంలో కమ్మలకు ప్రమోషన్లు యివ్వలేదు అని జనరల్‌గా అనేస్తే కుదరదు. కొందరు రెడ్లకు/కమ్మలకు ప్రమోషన్లు ఎందుకు వచ్చాయో చెప్పగలగాలి. అప్పుడు అర్హత లేదని రాలేదా, కులం కారణంగా రాలేదా, రానివాడు చేసే ఉత్తుత్తి ఆరోపణా అన్నది తేటతెల్లమౌతుంది. 

లేకపోతే దేన్నయినా సరే ఎలాగైనా చిత్రీకరించవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్‌ ఎగ్గొట్టారనే అనుమానంతో కొందరు టిడిపి మద్దతుదారులపై ఆ శాఖ వారు సోదాలు చేస్తే దాన్ని తెలుగువారిపై దాడిగా చిత్రీకరించారు బాబు! మాటవరసకి రేపు జగన్‌ ప్రభుత్వాన్ని ఏ కారణం చేతనైనా - శాంతిభద్రతలు విఫలమయ్యాయనో, ఏదైనా చట్టం అమలు చేయలేదనో - కేంద్రప్రభుత్వం డిస్మిస్‌ చేస్తే జగన్‌ దాన్ని క్రైస్తవులపై దాడిగా చిత్రీకరిస్తే, మనం అంగీకరిస్తామా?

'అసలు అక్రమంగా వచ్చినవారు హిందువులో, ముస్లిములో ఎలా కనుక్కుంటారు? ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయి వచ్చినపుడు డాక్యుమెంట్లు వెంట తెచ్చుకోరు కదా' అని జర్నలిస్టులు అడిగితే, అమిత్‌ షా సమాధానం చెప్పలేక, 'తెలుసుకునేందుకు మా మార్గాలు మాకున్నాయి' అన్నాడు. ఆందోళనకారులను దుస్తుల బట్టి గుర్తించవచ్చని మోదీ అన్నట్లు, బట్టల బట్టో, శారీరక పరీక్ష చేసో, డిఎన్‌ఏ టెస్టు చేసో... ఎలా గుర్తుపడతారో ఏమో చెప్పలేదిప్పటిదాకా! అవేమిటో ప్రజలకు చెప్పి చట్టబద్ధం చేస్తే బాగుండేది. 

ఎందుకంటే ఆ నియమాలను అమలు చేసేది అమిత్‌ షా కాదు, కింది స్థాయి అధికారి!  అతను చిత్తం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నా అడిగే దిక్కు లేకుండా పోతుంది. అసలీ చట్టంలో ఒక తమాషా ఏమిటంటే ముస్లిము కాకపోతే చాలు, రానిచ్చేస్తారు. పాకిస్తానీ ముస్లిం గూఢచారి ఇస్కాన్‌ ద్వారా హిందువుగా మారినా అతన్ని స్వాగతించవచ్చు.  పుట్టుకతో హిందువై ఉండాలి అనే నిబంధన లేదు కదా! అమెరికా క్రైస్తవ గూఢచారి పాకిస్తాన్‌లో ప్రవేశించి, మతబాధితుడిగా చెప్పుకుని వచ్చేయవచ్చు.

ఇక్కడ బిజెపి చేస్తున్న పెద్ద తమాషా ఏమిటంటే - పాకిస్తాన్‌ పేరు చెప్పి బంగ్లాదేశీయులను రానిచ్చేస్తున్నారు. నిజానికి 1947- 1950ల మధ్య పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో దిల్లీ, రాజస్థాన్‌, జమ్మూలకు వచ్చారు తప్ప తర్వాత వచ్చినవారు తక్కువే అనుకుంటాను. ఎందుకంటే ఏ సరిహద్దు రాష్ట్రమూ గొడవ చేయలేదు. కారణం అటువైపు సరిహద్దులను గట్టిగా కాపలా కాశారు. లేకపోతే ఖలిస్తాన్‌ ఉద్యమ సమయంలో పాకిస్తాన్‌ లక్షలాది మందిని ఆ మార్గంలో దింపేసి ఉండేది. ''భజరంగీ భాయిజాన్‌'' సినిమా చూస్తే భారత్‌, పాక్‌ల మధ్య రాకపోకలు ఎంత క్లిష్టమో అర్థమవుతుంది. 

ఇక తూర్పువైపు చూస్తే తూర్పు పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) సరిహద్దు జల్లెడ లాటిదే. సులభంగా జనాలు వచ్చిపోతూ ఉంటారు. పొద్దున్న సైకిలేసుకుని, బంగ్లాదేశ్‌లో బయలుదేరి, పగలంతా భారత్‌లో సరుకులు అమ్ముకుని, రాత్రికి మళ్లీ బంగ్లాదేశ్‌కు చేరుకునేవాళ్లు చాలామంది ఉన్నారని విన్నాను. మా బ్యాంకు నుంచి భారీ ఋణం తీసుకున్న ఓ కస్టమర్‌, యిక్కడ చచ్చిపోయినట్లు సర్టిఫికెట్టు సృష్టించుకుని, బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ కొన్నాళ్లుండి, మళ్లీ యిక్కడకు తేలాడు. అలా తరచుగా చేస్తూనే ఉంటాడట. రాకపోకలు అంత సులభం. 

అంత సులభం కాబట్టే పశ్చిమ బెంగాల్‌, అసాం వంటి రాష్ట్రాల జనజీవనం బంగ్లాదేశీయుల రాకతో అతలాకుతలమై గగ్గోలు పెడుతున్నాయి. ఏ మతానికి చెందినవారైనా సరే, వాళ్లని రానీయకూడదు, వచ్చినవాళ్లని వెనక్కి పంపేయాలి అని అడుగుతున్నాయి. కానీ బిజెపి వాళ్లలో హిందువులను రానిచ్చి వాళ్లను తన ఓటు బ్యాంకుగా మారుద్దామనుకుంటోంది. బంగ్లాదేశీయులను రానిస్తాము అంటే యిటువైపు సరిహద్దు రాష్ట్రాలు ఒప్పుకోవు కాబట్టి (పశ్చిమ) పాకిస్తాన్‌ పేరు కూడా కలిపింది. 

పాక్‌ నరరూప రాక్షసి కాబట్టి అక్కడ హిందువులను హింసిస్తున్నారంటే సులభంగా నమ్మేస్తాం. హిందువులపై అకృత్యాలంటూ పాక్‌లో సంఘటనలనే ఎత్తి చూపుతున్నారు. బంగ్లాదేశ్‌లో కూడా మతపరమైన అణచివేత జరుగుతూంటే యిప్పటిదాకా మన ప్రభుత్వం ఏం చేసింది? ద్వైపాక్షిక చర్చల్లో ఆ అంశం ప్రస్తావించిందా? పాక్‌ శత్రుదేశం సరే, బంగ్లాదేశ్‌ శత్రుదేశం కాదు కదా, మన నుంచి సహాయాలు పొందుతోంది కదా! నిలదీసి అడగలేదేం? 

ఈ రెండిటితో బాటు ఎఫెక్ట్‌ కోసం అఫ్గనిస్తాన్‌ పేరు కూడా కలిపింది అని నేను రాస్తే 'ఇవన్నీ అవిభక్త భారత్‌లో భాగంగా ఉన్న దేశాలు' అని రాశారు కొందరు. పాక్‌, బంగ్లాదేశ్‌ కరక్టే కానీ అఫ్గనిస్తాన్‌ మనతో ఎప్పుడుంది? అంటే అది గాంధార దేశం, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కదా అంటున్నారు వాళ్లు. మా స్నేహితుడి కొడుకు రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతమాత్రాన రష్యా మనదేశంలో భాగమై పోతుందా? గాంధారం, నేపాళం, కాంభోజం అంటూ సంస్కృతపు పేర్లు వల్లించినంత మాత్రాన అవన్నీ మనవే అనుకోకూడదు. మనం బాగా గుర్తు పెట్టుకోవలసిన దేమిటంటే మనది ఒరిజినల్‌గా జంబూద్వీపంలోని భరతఖండం (కాంటినెంట్‌ - పాశ్చాత్యులు ఆసియా ఖండంలో మీది ఉపఖండం - సబ్‌ కాంటినెంట్‌ అన్నారు). 

దానిలో అంగ, వంగ, కళింగ.. లాటివన్నీ దేశాలు. ఒక్కో దేశం ఒక్కో కాలంలో పొరుగున ఉన్న దేశాన్ని జయించింది. కొన్నాళ్లకు ఆ దేశం యీ దేశాన్ని గెలిచింది. ఈ క్రీడ నిరంతరంగా సాగింది. ఏదీ ఎవరిదీ శాశ్వతం కాదు. కాంభోజం అంటే కంపూచియా (కాంబోడియా). దాన్నీ ఓ దశలో పల్లవులు జయించారు. శ్రీలంకను ఓ కాలంలో చోళులు జయించారు. అందువలన అవన్నీ ఎప్పటికీ మావే, మాలోని భాగమే అనడం కుదరదు. 

ఆంగ్లేయులు ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లోని దేశాలన్నిటినీ జయించి, ఇండియా అనే ముద్ద చేశారు. దాన్నే మనం 'అవిభక్త భారత్‌' అనగలం. అఫ్గనిస్తాన్‌, బర్మా, శ్రీలంక వాటి పాలనలోనే ఉన్నా విడివిడి దేశాలుగానే పాలించారు. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్‌ను గాంధారం పేరుతో సిఏఏలోకి తీసుకుని వస్తే బర్మా, శ్రీలంకలను కూడా తీసుకురావాలి. బిజెపికి కొలబద్ద ఏమిటంటే - అవి ముస్లిము రాజ్యాలు! అక్కడ మైనారిటీలుగా హిందువులు కష్టపడుతున్నారు అనే కలరింగుతో సిఏఏకు ప్రజామోదం సంపాదించాలి. 

పశ్చిమ బెంగాల్‌ జనాభా 10 కోట్లు. దానిలో 17% మంది బంగ్లాదేశీ హిందువులే (మాటువాలు అంటారు) అని 2011 సెన్సస్‌ చెపుతోంది. వీళ్లు 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేయగలరు.  2019 మే ఎన్నికలలో 6-7 పార్లమెంటరీ నియోజకవర్గాలలో వీరి ఓట్ల వలన బిజెపి గెలిచిందని పరిశీలకుల అంచనా. అసాంలో తమకు పౌరసత్వం యిప్పించిన బిజెపికి బంగ్లాదేశీ హిందువులు విధేయంగా ఉంటారని అంచనా. బెంగాల్‌లో, అసాంలో 2021లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అసాంను నిలబెట్టుకోవాలని, బెంగాల్‌ను గెలవాలని బిజెపి చేస్తున్న విశ్వప్రయత్నాలలో భాగమే యీ సిఏఏ కసరత్తు అని అనుమానం.

దీనిని ఎదిరించడానికి ప్రతిపక్షాలకు నైతిక బలం లేదు. ఎందుకంటే అవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపినవే. నేను సామాన్యుణ్ని కాబట్టి, అక్రమంగా వచ్చిన ప్రతీవాణ్నీ తరిమివేయాలని అంటాను. కానీ నా అభిప్రాయంతో ఏ రాజకీయ పార్టీ ఏకీభవించదు. మానవత్వం, మరోటీ అంటూ కొందరికి ఆశ్రయం యివ్వాలంటుంది. గతంలో కూడా రాశాను - బెంగాల్‌ను కాంగ్రెసు ఏలే రోజుల్లో కమ్యూనిస్టులు తూర్పు పాకిస్తాన్‌ నుంచి వచ్చిన బెంగాలీలను అక్కున చేర్చుకుని వాళ్లను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారని, కాలక్రమంలో కాంగ్రెసును ఓడించారనీ! ఇప్పుడు బిజెపి వారిని మతపరంగా విడగొట్టి లాభపడుతూంటే గుడ్లప్పగించి చూస్తున్నారు. 

కానీ ఒకసారి పౌరసత్వం పొందాక, వారందరూ ఎల్లకాలం బిజెపికి విధేయులుగా ఉంటారన్న గ్యారంటీ లేదు. పోనుపోను తమ రాజకీయ భావాల బట్టి ఓటేస్తారు. తూర్పు పాకిస్తాన్‌/బంగ్లాదేశ్‌ బెంగాలీలు సిపిఎంను విడిచి, తృణమూల్‌ను గెలిపించారు. ఇప్పుడు బిజెపికి కూడా ఓట్లేస్తున్నారు. అలాగే ఇవాళ బిజెపికి ఓటేసినవారు రేపు దాన్ని 'బోడి మల్లయ్య' అనవచ్చు. పార్టీల స్థితిగతులు ఎదిగినా, కృంగినా యిలాటి చట్టాల వలన దేశసంపదకు నష్టం వాటిల్లుతుందనే నా బోటి వాళ్ల బాధ. వచ్చే వ్యాసంలో సిఏఏ బిల్లు అసమగ్రత గురించి మాట్లాడుకుందాం. (సశేషం)

(ఫోటో - అసామీ ఎన్నార్సీ కోలాహలం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)
mbsprasad@gmail.com

Show comments