రానా పార్సిల్: డ్రగ్స్ కాదండోయ్

సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి సురేష్‌ తనయుడు, 'భళ్ళాలదేవ' రానా వార్తల్లోకెక్కాడు. వెన్నునొప్పిని తగ్గించుకునేందుకోసం విదేశాల నుంచి ఓ పరికరాన్ని తెప్పించుకోవడమే అందుక్కారణం. విదేశాల నుంచి సినీ ప్రముఖులు కొందరు డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. సినీ ప్రముఖులే కాదు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందినవారూ 'డార్క్‌నెట్‌' ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుంటున్న వైనాన్ని తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే విచారణ గట్టిగా జరుగుతోంది కూడా.! 

ఇక, రానా విదేశాల నుంచి ఏదో తెప్పించుకున్నాడన్న సమాచారం అందగానే, తెలంగాణ ఎక్సయిజ్‌ శాఖకు చెందిన అధికారులు హుటాహుటిన రామనాయుడు స్టూడియోకి చేరుకున్నారు. పార్సిల్‌ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే, విషయం తెలుసుకున్న రానా తండ్రి సురేష్‌బాబు, వచ్చిన పార్సిల్‌లో వెన్ను నొప్పిని తగ్గించే పరికరం వుందని చెప్పడంతో కథ సుఖాంతమయ్యింది. 

మామూలుగా అయితే, పార్సిల్స్‌ విషయంలో పోలీసుల నిఘా పెద్దగా వుండదు. ప్రముఖుల సంగతి సరే సరి. అందునా, సినీ పరిశ్రమకు వచ్చే పార్సిల్స్‌ని ఎవరూ పట్టించుకోరు. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. రామానాయుడు స్టూడియోలో తెలంగాణ ఎక్సయిజ్‌ శాఖ తనిఖీలనగానే ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. 

మొత్తమ్మీద, వెన్ను నొప్పిని తగ్గించుకునేందుకు విదేశాల నుంచి పరికరాన్ని తెప్పించడంతో, అసలు సంగతి తెలియక సిట్ అనుమానించడం వెరసి, రానా తెలుగు సినీ పరిశ్రమలో చిన్నపాటి కుదుపుకు కారణమయ్యాడన్నమాట. ఇదిలా వుంటే, డ్రగ్స్‌ కేసుకి సంబంధించి 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించిన తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిట్‌, మరికొందర్ని విచారించేందుకు నోటీసులు సిద్ధం చేస్తోందన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.

Show comments