ఏ ఖాతాకు ఆ ఖాతాయే...!

కొందరు అంటూ ఉంటారు 'నాది ఏ ఖాతాకు ఆ ఖాతాయే. ఎవరికి చేయాల్సిన పనులు వారికి చేస్తా. మొహమాటం లేదు' అని. ఓ వ్యక్తి ఫ్రెండ్‌ అయినంతమాత్రాన మొహమాటంతో అతనికి ఫేవర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్‌కు ఫేవర్‌ చేయాలనే ఉద్దేశంతో  వేరేవారికి అన్యాయం చేయకూడదు. చెప్పుకోవడానికి ఇది బాగానే ఉంది. నిజ జీవితంలో ఇలా వ్యవహరించవచ్చేమోగాని రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉండే పాలిటిక్స్‌లో ఇలా నిక్కచ్చిగా వ్యవహరించడం సాధ్యమా? ఎక్కువమందికి సాధ్యం కాకపోవచ్చు.

కాని కొందరు వైరుధ్యాలను కూడా సమన్వయం చేసి ఏ పనికాపని చేస్తారు. ప్రస్తుతం ఇలా చేస్తున్న నాయకుడు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌. ఈమధ్య ఈయన వార్తల్లో వ్యక్తిగా ఎందుకు మారాడో తెలిసిందే. ఉన్నట్లుండి గ్రాండ్‌ అలియన్స్‌ (మహాఘట్‌ బంధన్‌) ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి బీజేపీతో కలిసి ఎన్‌డీఏ సర్కారును ఏర్పాటు చేసిన నితీష్‌ లౌకికవాదుల దృష్టిలో పాపాత్ముడిగా మిగిలిపోయారు.

'అవకాశవాది' అనే పేరు సంపాదించుకున్నారు. 'నితీష్‌ నిజాయితీపరుడు అయివుండొచ్చు. కాని అవకాశవాది' అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు? మతతత్వ పార్టీ అని విమర్శించిన బీజేపీతోనే చేతులు కలిపి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఓడించి మహాఘట్‌బంధన్‌కు అధికారం అప్పగిస్తే, వారు తిరస్కరించిన పార్టీనే నితీష్‌ అక్కున చేర్చుకున్నారు. అవినీతిపై యుద్ధంలో భాగంగా ఇలా చేయాల్సివచ్చిందని తన చర్యను సమర్ధించుకున్నారు. ఒకప్పుడు బీజేపీతో అంటకాగిన నితీష్‌ కుమార్‌ మధ్యలోనే దాన్ని ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టి చిరకాల శత్రువైన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో, కాంగ్రెసుతో చేతులు కలిపారు.

తాజాగా ఆ రెండు పార్టీలను వెళ్లగొట్టి బీజేపీతో కలిశారు. నిజమే. ఇది అవకాశవాదమే. రాజకీయం అంటేనే అవకాశవాదం. అంటే అవకాశాలను  అందిపుచ్చుకోవడమే రాజకీయం. రాజకీయమంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఉద్యోగంలో పైకి ఎదగాలంటే డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు రాయాలి. 'రాముడు మంచి బాలుడు' అనే టైపులో పనిచేస్తూ ప్రమోషన్లు సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. సరిగా పనిచేయకపోయినా ఉద్యోగానికి ఢోకా ఉండదు.

కాని రాజకీయాల్లో ఇదంతా ఉండదు. అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని మనుగడ సాగించాలి. పదవులు సంపాదించాలి. ఉన్న పదవులు కాపాడుకోవాలి. గమ్మున ఉంటే ఎవ్వరూ పట్టించుకోరు. అవకాశాలు అందిపుచ్చుకున్నంత మాత్రాన నీతినిజాయితీ లేనివారని అనుకోకూడదు. నితీష్‌ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ పార్టీలతో మిత్రత్వం చేశారు. కాని అవినీతిపరుడు కాదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించుకోలేదు.

నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా నిజాయితీపరుడు. గత మూడేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలూ లేవు. కాని ప్రతి రాష్ట్రంలో బీజేపీ లేదా ఎన్‌డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఓ విధంగా సామ్రాజ్య విస్తరణ కాంక్ష అని చెప్పుకోవచ్చు. అంటే నితీష్‌, మోదీ వ్యక్తిగతంగా నిజాయితీపరులైనా రాజకీయంగా అవకాశవాదులని చెప్పవచ్చు. కాని రాజకీయానికే మరోపేరు అవకాశవాదమైనప్పుడు దాన్ని తప్పుపట్టలేం.

అవకాశవాదం కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేవిధంగా ఉండకూడదు. నితీష్‌ చేసిన పని తప్పా? రైటా? అంటే కచ్చితమైన అభిప్రాయం చెప్పడం కష్టమే. సరే... ఇదిలా ఉంటే అవకాశవాదిగా పేరు తెచ్చుకున్న నితీష్‌ ఓ విషయంలో నిబద్ధంగా వ్యవహరించారు. ఏమిటది? గ్రాండ్‌ అలయన్స్‌ ప్రభుత్వ విచ్ఛిన్నం కాకముందే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిలబెట్టిన గోపాలకృష్ణ గాంధీకే జేడీయూ ఓటేస్తుందని, ఆయనకే మద్దతు ఇస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం బీజేపీతో చేతులు కలిపి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా తన అభిప్రాయం మార్చుకోలేదు. ప్రతిపక్షాల అభ్యర్థికే ఓటేస్తామని, మాట తప్పబోమని బీజేపీ నాయకులకు చెప్పేశారు. ఈ విషయంలో ఆయన మొహమాటానికి పోకపోవడం, రూటు మార్చకపోవడం విశేషం. ఏ ఖాతాకు ఆ ఖాతాయేనన్నమాట....! ఈ ఒక్క ఎన్నిక తరువాత పార్లమెంటులో ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. జేడీయూ కూడా మోదీ సర్కారులో భాగస్వామి కానుంది. మంత్రి పదవులు సిద్ధం చేస్తున్నారు. 

Show comments