నందు, తనీష్‌.. టెన్షన్‌ లేనట్టే

హమ్మయ్య.. డ్రగ్స్‌ కథ ప్రస్తుతానికి సుఖాంతమవుతున్నట్లే. 'ఉడ్తా టాలీవుడ్‌' ఎపిసోడ్‌కి సంబంధించి 'తొలి దఫా' 12 మంది సినీ ప్రముఖులు నోటీసులు అందుకున్న విషయం విదితమే. వీరిలో చాలామంది, 'అబ్బే, మాకసలు నోటీసులు అందనే లేదు..' అంటూ మీడియా ముందు తమ వాదనని విన్పించారు. కానీ, వారికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మాత్రం, 'మేం నోటీసులు పంపినవారంతా విచారణకు వస్తామని చెప్పారు.. రాకపోతే ఏం చెయ్యాలో ఆ తర్వాత ఆలోచిస్తాం..' అని కాన్ఫిడెంట్‌గానే చెప్పింది. 

తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదిమంది ఇప్పటికే 'సిట్‌' యెదుట హాజరయ్యారు. తాజాగా ఈరోజు యువ నటుడు తనీష్‌ సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇక మిగిలింది ఒక్కరే. ఆ ఒక్కరూ ఎవరో కాదు, మరో యువనటుడు నందు. ప్రముఖ గాయని గీతామాధురి భర్త అయిన నందు, పలు సినిమాల్లో నటిస్తున్నాడు. తనీష్‌, నందు తమకు నోటీసుల వ్యవహారంపై చాలా ఘాటుగా స్పందించారు. తనీష్‌ కంటతడి పెడితే, నందు మీడియాని వెంటేసుకుని నోటీసుల వ్యవహారంపై 'ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌'తో తాడోపేడో తేల్చుకోవాలనుకున్నాడు కూడా.! 

'మేం ఎవర్నీ నిందితులుగా చూడటంలేదు.. వారి నుంచి సమాచారం మాత్రమే సేకరిస్తున్నాం..' అంటూ తెలంగాణ ఎక్సయిజ్‌ శాఖ క్లారిటీ ఇచ్చాక... అప్పటిదాకా టెన్షన్‌ పడ్డ సినీ ప్రముఖులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. రక్తం, వెంట్రుకలు, గోళ్ళు తదితర శాంపిల్స్‌కి సంబంధించి నటి ఛార్మి కోర్టును ఆశ్రయించడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకమలుపు. ఆ తర్వాత విచారణకు హాజరయినవారెవరూ శాంపిల్స్‌ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. 

ఈలోగా, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సినీ పరిశ్రమలో ఎవర్నీ నిందితులుగా చూడటంలేదనీ వారిని బాధితులుగానే చూస్తున్నామనీ, వారికి వేధింపులు వుండవనీ క్లారిటీ ఇచ్చాక, సినీ పరిశ్రమలో నెలకొన్న ఆందోళన దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఈరోజు తనీష్‌ అయినా, రేపు నందు అయినా ఎలాంటి బెరుకూ లేకుండా విచారణను ఎదుర్కోనున్నారన్నది నిర్వివాదాంశం. అసలు నోటీసులే రాలేదని చెప్పి, విచారణకు హాజరవుతున్నవారు.. అసలు డ్రగ్స్‌ అలవాటే లేదని చెప్పి విచారణకు హాజరవుతున్నవారు.. విచారణలో అధికారులకు ఎలాంటి సమాధానమిస్తారట.? ఏమో మరి, ప్రస్తుతానికి సస్పెన్సే. 

'విచారణలో పెద్దల పేర్లు వస్తున్నాయి.. కానీ, వారు చెప్పారని చర్యలు తీసుకోలేం కదా..' అని ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొన్నాక, ఈ విచారణతో ఒరిగేదేంటి.? అన్న అనుమానం కలగడం సహజమే. అన్నట్టు.. ఈ ఎపిసోడ్‌ ఇక్కడితో ముగిసినట్టేనా.? రెండో లిస్ట్‌ నోటీసుల కోసం రెడీ అవుతోందన్న వార్తల్లో నిజమెంత.? వేచి చూడాల్సిందే.

Show comments