జగన్ మద్దతు తీసుకుంటూనే వెంకయ్య విసుర్లు !

తమ కూటమితో సంబంధం లేకుండా, విపక్షానికి చెందిన నాయకుడు అయినా కూడా.. దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవులకు పోటీలేకుండా ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిగితేనే వాటికి విలువ పెరుగుతుందనే ఒక మంచి సిద్ధాంతానికి కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి పదవుల విషయంలో అధికార ఎన్డీయే కు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.

ఆయన ప్రత్యర్థులు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టడానికి ఏ రకంగానైనా తాటాకులు కట్టే ప్రయత్నం చేయవచ్చు గాక.. కానీ జగన్ ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్ని తాను ఆచరిస్తున్నారంతే. ఆ క్రమంలో జగన్ పార్టీ మద్దతును, ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా పోటీచేస్తున్న వెంకయ్యనాయుడు కూడా స్వీకరిస్తున్నారు. ఒకవైపు జగన్ మద్దతు తీసుకుంటూనే... జగన్ ను పరోక్షంగా దెప్పిపొడుస్తూ వెంకయ్య వ్యాఖ్యానాలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. 

విజయవాడలో ఆంధ్రపత్రిక పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పత్రికలు వాటి బాధ్యత, పాటించాల్సిన విలువలు తదితర విషయాల గురించి అనేక సంగతులు చెప్పారు. ఇందులో భాగంగానే... వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్న వారు పత్రికలను ప్రారంభిస్తున్నారని ... ఇది వాంఛనీయం కాదని ఆయన సెలవవిచ్చారు. ఏదో జనాంతికంగా నీతులు చెబుతున్నట్లుగా ఉన్నదే తప్ప.. వెంకయ్య మాటలు.. మీడియాలో ఇవాళ్టిపోకడలను ప్రతిబింబిస్తున్నట్లుగా లేదు. 

రాజకీయాల్లో ఉన్నవారు పత్రికలు ప్రారంభించకూడదని పరోక్షంగా జగన్ మరియు సాక్షి పత్రిక కూటమిని ఉద్దేశించే వెంకయ్యనాయుడు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. దీని మీద విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్నవారు పత్రికలు పెడితే తప్పు గానీ.. పత్రికలను ప్రలోభపెట్టి, తప్పుడు- దిగజారుడు వార్తలు రాయించడం తప్పు కిందికి రాదా?

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా చేసిన ఇంత సీనియర్ నాయకుడికి రాజకీయాల్లో లేనివారు నడుపుతున్న పత్రికలు కూడా ఏ రీతిగా పార్టీలకు అమ్ముడుపోతున్నాయనే సంగతి తెలియదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి జనంలో రేకెత్తుతున్న ఇలాంటి సందేహాలకు వెంకయ్యనాయుడు ఎలా సమాధానం చెప్పగలరో ఏమో?

Show comments