యూట్యూబ్ లో నాగబాబు ఓదార్పు యాత్ర

అంతా నా ఇష్టం అంటూ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఈ ఛానెల్ ద్వారా టీడీపీ, వైసీపీపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు. జనసేన దూసుకొస్తోందంటూ ఏవేవో మాట్లాడారు. కట్ చేస్తే జనసేన ఘోరంగా ఓడిపోయింది. దీంతో అదే ఛానెల్ ను ఇప్పుడు ఓదార్పు యాత్రకు ఉపయోగిస్తున్నారు నాగబాబు.

తాజా ఓటమితో జనసైనికులు, వీరమహిళలు ఎవరూ బాధపడొద్దని ఓదారుస్తున్నారు నాగబాబు. ఇంకా భవిష్యత్తు ఉందని, రాబోయే రోజులన్నీ మనవే అంటూ ఊరించే ప్రయత్నం చేశారు. అవసరమైతే ఓ 2 నెలలు అలా విహారయాత్రకు వెళ్లి రమ్మని కూడా ఓ ఉచిత సలహా పడేశారు.

అయితే యూట్యూబ్ లో నాగబాబు ఓదార్పు యాత్ర మిస్-పైర్ అయింది. అతడి వీడియో చూసిన చాలామంది నెటిజన్లు, నాగబాబుపై రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసే బదులు.. పార్టీ పెట్టినప్పట్నుంచే టీడీపీకి కొమ్ముకాయకుండా ఉంటే ఈపాటికి అధికారం దక్కేదని చీవాట్లు పెడుతున్నారు. ఆఖరి నిమిషంలో రాజకీయాల్లోకి వచ్చి గెలిచేద్దాం అనుకుంటే ఇలానే ఉంటుందని మరికొందరు రియాక్ట్ అయ్యారు.

జనసైనికుల్ని ఓదారుస్తున్నారు సరే, ఓడిపోయిన మిమ్మల్ని ఎవరు ఓదారుస్తున్నారంటూ నాగబాబుపై సెటైర్లు మొదలయ్యాయి. ఏకంగా 2 స్థానాల్లో ఓడిపోయిన పవన్ ను ఎవరు ఓదారుస్తున్నారో చెప్పాలంటూ పోస్టులు పడ్డాయి. ఎక్కువమంది మాత్రం ఇకనైనా పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మిచే ఆలోచనపై దృష్టిపెట్టాలని సూచించారు. అలా శ్రేణుల్ని ఓదార్చాలనుకున్న నాగబాబును, నెటిజన్లు ఆడుతున్నారు.