నయా రాజ్యంలో 'వయా' అడ్డదారులు

పైసలతో పనులు.. పైరవీలు సాధ్యమంటున్న ప్రబుద్ధులు
ఉద్యోగాలు, బదిలీల్లో వేలుపెడుతున్నట్టు ప్రచారం
ప్రజా ప్రతినిధుల హవాపై గోదావరి జిల్లాల్లో చర్చ

పార్టీలు వేరైనా, ప్రభుత్వాలు మారినా అందరూ ఆ తానులో ముక్కలే కదా? అని సగటు మనుషుల్లో ఇపుడు చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబెట్టేందుకు ఓ వైపు ప్రతిపక్షాలు తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో తలమునకలయ్యాయి. ఇంకోవైపు విమర్శలకు ఎక్కడా తావులేకుండా పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి కమిట్‌మెంట్‌ విషయంలో చాలామందికి ఏ విధమైన అనుమానం లేకపోయినా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు (ప్రజా ప్రతినిధులు) అనుసరిస్తున్న వైఖరే ప్రభుత్వానికి, జగన్‌ పాలనకూ మైనస్‌గా మారినట్టు విజ్ఞులు వాపోతున్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇపుడిపుడే పాలనపై పట్టు బిగిస్తోంది. అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఉద్యోగాల జాతర రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఉద్యోగాలు, బదిలీల విషయాల్లో ప్రజా ప్రతినిధుల జోక్యం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వాల్లో సహజంగానే జరిగినప్పటికీ తమ ప్రభుత్వంలో మాత్రం పూర్తి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు, బదిలీలుంటాయని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నాయి. తాజాగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది.

తొలి విడతగా ఎంపికైన వారికి నియామకపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే మలి విడతలో జరిగే నియామకాలు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కొందరు కొమ్ములు తిరిగిన నేతలు ఆయా గ్రామ సచివాలయాల్లో ఖాళీల వివరాలను, అభ్యర్ధుల డేటాను తమ వద్ద ఉంచుకుని, తమ కనుసన్నల్లో నియామకాలు జరిగేలా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు రాజధాని స్థాయిలో వీరికి సహకారం ఉందని, ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదంతా పైస్థాయిలో పలుకుబడి ఉన్న నేతలే నడిపిస్తున్నట్టు సమాచారం! బదిలీల విషయంలోనూ కొందరు ప్రజాప్రతినిధులు మండల, డివిజన్‌ స్థాయిల్లో హవా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు పూర్తి అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను, పోలీసులను బాగా డిమాండ్‌ ఉన్న స్థానాల్లో నియమించుకున్నారని, పలుకుబడి లేని నిజాయితీ గల ఉద్యోగులను మారుమూల ప్రదేశాలకు, ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ చేశారని చెప్పుకుంటున్నారు. ఇక అధికార పార్టీ నేతల సెటిల్‌మెంట్లు గోదావరి జిల్లాల్లో క్రమంగా జోరందుకున్నట్టు తెలుస్తోంది.

తరచూ పార్టీలు మార్చే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఓ వైసీపీ నేత చేస్తున్న సెటిల్‌మెంట్లు, తుని నియోజకవర్గానికి చెందిన ఓ మాజీమంత్రి సోదరుడు చేస్తున్న సెటిల్‌మెంట్లు, అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి ఇంటి వద్ద చేస్తోన్న ప్రైవేటు సెటిల్‌మెంట్లతో ఇప్పటికే జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాపై పోలీస్‌, రెవెన్యూ శాఖలు ఉక్కుపాదం మోపాయి. అయితే అనేకచోట్ల అక్రమార్కులకు కొందరు నేతలు అండగా నిలవడంతో దొడ్డిదారిలో ఇసుక అక్రమరవాణా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.

అక్రమ మైనింగ్‌, మట్టి మాఫియా ఆగడాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సిండికేట్లు, మాఫియా, భూ దందాలు, భూకబ్జా సెటిల్‌మెంట్లకు పాల్పడే నేతలపై ప్రభుత్వం తగిన నిఘా ఉంచని పక్షంలో భవిష్యత్‌లో అధికార పార్టీకే నష్టం కలిగే ప్రమాదం ఉందని పలువురు హితవు పలుకుతున్నారు.

Show comments