నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు

ఈ లైన్ మనది కాదు. కవి కృష్ణశాస్త్రి రాసినది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు. నా ఇచ్చయే గాక నాకేటి వెరపు అన్నది ఆయన రాసిన పూర్తి లైన్. ఆయన ఎందుకు రాసారు. సందర్భం ఏమిటి అన్నది అలా వుంచితే ఆంధ్రకు సిఎమ్ అయిపోతా అంటూ బీరాలు పలుకుతున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాత్రం అచ్చం ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఆయన ఎవరికీ సమాధానాలు చెప్పరు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టా అంటారు తప్ప ప్రశ్నలకు బదులు ఇవ్వరు. ఇంటర్వూలకు కూడా ఆయనే ప్రశ్నలు రాసి ఇచ్చి, ఆయనకు కావాల్సిన సమాధానాలు చెప్పి ముగిస్తారు.

కానీ సోషల్ మీడియా అనేది ఒకటి వుంది. అది అంతా చూస్తోంది. పవన్ వైనాలు చాటింపు వేస్తోంది. ప్రశ్నలు సంధిస్తోంది. కానీ పిల్లి కళ్లు మూసుకున్న చందంగా తనకు ఏమీ పట్టనట్లు, తనకు ఏమీ తెలియనట్లు పవన్ వ్యవహరిస్తున్నారు. తన మానాన తను హ్యాపీగా షూటింగ్ లు చేసుకుంటున్నారు. రాజకీయాలు గాలికి వదిలేసారు. ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ఆయనకు తెలియంది కాదు. జనం గమనించనిది కాదు. లోకేష్ పాదయాత్ర రాయలసీమలో పూర్తయ్యాక అప్పుడు పవన్ ఎంటర్ అవుతారు. ఇదంతా ఓ మ్యాచ్ ఫిక్సింగ్.

అసలు పవన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?

మనల్ని ఎవడు ఆపుతాడు అంటూ, వారాహి మీద హడావుడి చేసిన పవన్ ఇప్పుడు లోకేష్ యాత్ర ప్రారంభం కాగానే ఎందుకు సైలంట్ అయిపోయారు?

జనసేనకు ఇంత బజ్ వున్నపుడు, స్థానిక ఎన్నికల్లో తమకు బోలెడు సీట్లు వచ్చాయని గతంలో టముకు వేసినందున, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల కూడా ఎందుకు అభ్యర్ధులను నిలబెట్టలేదు. కనీసం గ్రాడ్యుయేట్ ఎన్నికల మీద అయినా ఎందుకు దృష్టి సారించలేదు?

తను వెళ్లి పూజలు జరిపిన కొండగట్టు అంజన్న ఆలయంలో దోపిడీ జరిగితే, జగన్ మీద ఎలా విరుచుకు పడతారో అలా కేటిఆర్ మీదో కేసిఆర్ మీదో ఎందుకు పడలేకపోయారు?

వీధి కుక్కలు ఓ పసికందును దారుణంగా కొరికి చంపేస్తే, కేసిఆర్ ను లేదా కేటిఆర్ ను ఎందుకు టార్గెట్ చేయలేకపోయారు. ఆంధ్రలో ఇదే సంఘటన జరిగి వుంటే పవన్ ఒంటి కాలి మీద లేచిపోయి వుండేవారు కాదా?

పిజి విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంలో ఎంత చప్పటి స్టేట్ మెంట్ వదిలారో పవన్ కు అర్థం కావడం లేదా?

ఈ విధంగా అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరికి బాహాటంగా తెలిసిపోతూనే వుంది. అయినా జగన్ అంటే కోపం, జగన్ ను అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను. అంటూ హుంకరించడం తప్ప పవన్ చేసేదేమీ లేదు. రోజుకు నాలుగు కోట్ల వంతున కాల్ షీట్లు ఇచ్చి డబ్బులు చేసుకోవడం తప్ప. మళ్లీ అదేంటీ అంటే నాకు అవి లేవు..ఇవి లేవు అంటూ ఎదురు దాడి మొదలెట్టడం మాత్రం బాగా వచ్చు.

Show comments