నరేష్ చేతిలో 'మా' పగ్గాలు?

అనధికారికంగా కావచ్చు, అధికారికంగా కావచ్చు, మొత్తానికి మా అధ్యక్షుడిగా శివాజీరాజా ఇక నిమిత్తమాత్రుడే. ఇక అధికారాలు, నిర్ణయాలు అన్నీ సీనియర్ నరేష్ చేతిలో పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా మా వివాదం సర్దుబాటుకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది. వివాదాస్పద నిర్ణయాలు, స్కామ్ లు అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలుగు సినిమా రంగ పరిశ్రమ పెద్దలు రంగప్రవేశం చేసి, మా సంఘ వ్యవహారాల్లో కలుగచేసుకోవడం విశేషం.

నిజానికి ఒక సంఘ వ్యవహారంలో మరోసంఘం ఎప్పుడూ కలుగచేసుకోదు. ఫెడరేషన్ లేదా ఛాంబర్ లేదా మరో కమిటీ వ్యవహారాల్లో గొడవలు వస్తే మా అసోసియేషన్ పెద్దలు జోక్యం చేసుకుంటామంటే ఓకె అంటారా? సమస్యలేదు. కానీ సినిమా రంగ పెద్దలు మా వ్యవహారాల్లో కలుగచేసుకుంటే ఎవ్వరూ మాట్లాడలేదు. 

క్లాస్ టీచర్ మాట విన్న విద్యార్థుల్లా కుక్కిన పేనుల్లా వుండిపోయారు శివాజీరాజా అండ్ కో. ఇప్పటిదాకా అయిపోయిందేదో అయిపోయిందని, ఇకపై అందరూ ఒకటే అని, ఏమైనా వస్తే, తాము పై నుంచి చూస్తామనే రీతిలో సరేష్ బాబు తదితర పెద్దలు సెలవిచ్చారు. అంటే ఇప్పటిదాకా జరిగింది అంతా ఇక గప్ చుప్ అన్నమాట.

ఇదిలా వుంటే, ఇకపై మాలో ఆధిపత్యం అంతా సీనియర్ నరేష్ దే అని వినిపిస్తోంది. మహేష్ బాబు అమెరికాలో ఓ షో చేయాల్సి వుంది. శివాజీ రాజా అండ్ కో ఆధిపత్యం వుంటే అది అయ్యే అవకాశం తక్కువ. అందుకే అన్నివిధాలా ఆలోచించి సీనియర్ నరేష్ కు అన్నీ అప్పగించినట్లు తెలుస్తోంది. 

శివాజీరాజా చేసేది, చేయగలిగింది లేదు. ఎందుకంటే వన్స్ సినిమారంగ పెద్దలు కలుగచేసుకుని, సీన్లో ఎంటర్ అయిన తరువాత వ్యవహారాలు వేరుగా వుంటాయి. మొగ్గు వేరుగా వుంటుంది. అందువల్ల గౌరవప్రదంగా టెర్మ్ కంప్లీట్ చేయడమే ఉత్తమం అని శివాజీరాజా కూడా అనుకుని వుండొచ్చు. 

ఏది ఏమైనా అందరూ ఒక్కటై, పెద్దలు రంగంలోకి దిగితే ఎన్ని కుంభకోణాలైనా గప్ చుప్ అయిపోతాయి, ఫైళ్లు సీల్ చేసినా, మళ్లీ వ్యవహారం మామూలైపోతుంది అనడానికి 'మా' వ్యవహారమే ఒక ఉదాహరణ.

ఇక మీదట అయినా ఊ అంటే ప్రెస్ మీట్.. ఆ అంటే ప్రెస్ మీట్.. ఆపై స్నాక్స్ అంటూ ఖర్చులు రాయడం మాలో తగ్గిపోతుందేమో? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Show comments