వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రికి అచ్చెన్న‌, ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రికి నాని...

ఏపీ అసెంబ్లీలో్ పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల మ‌ధ్య తిట్ల పురాణాన్ని జ‌నం విన‌లేక చ‌స్తున్నారు. టీవీ ఆన్ చేయాలంటే ఎలాంటి మాట‌లు వినాల్సి వ‌స్తుందోన‌నే భ‌యం సామాన్య ప్ర‌జానీకాన్ని వెంటాడుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను చ‌ట్ట స‌భ‌ల్లో ప్ర‌స్తావించి వాటి ప‌రిష్క‌రానికి కృషి చేస్తార‌నే న‌మ్మ‌కంతో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ల‌క్ష‌ల మంది ఓట్లు వేసి గెలిపించి పంపిన నేత‌లు అసెంబ్లీలో అత్యంత జుగ‌ప్సాక‌ర రీతిలో తిట్టుకోవడం గ‌మ‌నార్హం.

ఈ తిట్ల పురాణం శుక్ర‌వారానికి ప‌తాక‌స్థాయికి చేరింది. ‘దిశ’ బిల్లుపై చర్చ  సందర్భంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్ర‌బాబు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేత‌ల్లో కొంద‌రిపై కేసులున్నాయ‌ని ఏడీఆర్ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింద‌ని ప్ర‌స్తావించారు. బాబు ఆరోప‌ణ‌ల‌పై వైఎస్సార్‌సీపీ నేత‌లు అభ్యంత‌రం తెలిపారు. టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ‌పై కేసులున్నాయ‌ని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింద‌ని, అప్పుడు వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి ప్ర‌శ్నించారు.

త‌న‌పై కేసులుంటే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని అచ్చెన్నాయుడు అన్నారు. అలాగే మంత్రి కొడాలి నానికి ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రిలో చికిత్స చేయించాల‌ని, ఆయ‌న వ్యాఖ్య‌లు విన‌లేక పోతున్నామ‌ని అచ్చెన్నాయుడు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. హైద‌రాబాద్‌లో ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రి మాన‌సిక రోగుల చికిత్సాలయం అని తెలిసిన విష‌య‌మే.

 అచ్చెన్నాయుడిని వెట‌ర్న‌రీ (ప‌శువుల‌) ఆస్ప‌త్రిలో చేర్పిస్తే బాగుంటుంద‌ని కొడాలి నాని త‌న‌దైన శైలిలో స్పందించారు. అమ‌రావ‌తిలో మాన‌సిక వైక‌ల్య కేంద్రం ఏర్పాటు చేసి టీడీపీ ఎమ్మెల్యేల‌ను చేర్పించాల‌ని కొడాలి దీటుగా స్పందించారు. మొత్తానికి ఎవ‌రెవ‌రిని ఎక్క‌డెక్క‌డికి పంపాలో తెలియ‌దు కానీ, వారి సంభాష‌ణ వింటున్న, చూస్తున్న వాళ్లు మాత్రం ఎర్ర‌గ‌డ్డ‌కు వెళ్లాల్సి వ‌స్తుందేమోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. 

Show comments