టిక్ టాక్ లో ఆడుకున్నారు.. హీరోయిన్ ఆవేదన

నటీనటులు ట్రోలింగ్ కు గురవ్వడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది వాటిని లైట్ తీసుకుంటే, మరికొంతమంది మాత్రం అవి చూసి బాధపడతారు. తన కెరీర్ లో కూడా అలా బాధపడిన సందర్భాలున్నాయని తెలిపింది హీరోయిన్ నందిత శ్వేత.

"నీకు సినిమాలు తగ్గిపోయాయి, ఎందుకు సినిమాలు చేయడం లేదంటూ నాపై టిక్ టాక్స్ చేస్తున్నారు. అవి నన్ను బాగా ఇబ్బందిపెట్టాయి. నేను సినిమాలు చేయడం లేదంటే ఖాళీగా ఉన్నానని కాదు కదా. నా పనులు నాకు ఉంటాయి కదా. అయినా టిక్ టాక్స్ చేయడం మరీ ఘోరం."

ఇలా తన బాధను బయటపెట్టింది నందిత శ్వేత. కేవలం చదువు కోసం మాత్రమే గ్యాప్ తీసుకున్నానని, ఒక దశలో గ్యాప్ వచ్చిందనే విషయం కూడా తనకు తెలియలేదని.. అలాంటి టైమ్ లో వచ్చిన టిక్ టాక్స్ తనను బాగా బాధపెట్టాయని చెప్పుకొచ్చింది. స్టార్స్ తో ఎందుకు నటించడం లేదని అడిగినప్పుడు కూడా బాధేస్తుందని అంటోంది.

"స్టార్స్ సరసన నటిస్తేనే మంచి హీరోయిన్ అన్నట్టు చాలామంది ఆలోచిస్తున్నారు. చాలామందిలో ఆ మైండ్ సెట్ ఉంది. ఓ నటిగా కమర్షియల్ సినిమాలతో పాటు హాఫ్-బీట్, డీ-గ్లామరైజ్డ్ సినిమాలు కూడా చేయొచ్చు. నేను అదే చేస్తున్నాను. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే కనిపించాలని లేదు."

మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో తనకు అన్నీ హారర్ పాత్రలే వస్తున్నాయని, ఇప్పుడిప్పుడు ఆ జానర్ నుంచి బయటకొస్తున్నానని తెలిపింది నందిత శ్వేత. త్వరలోనే ఓ స్టార్ హీరో సరసన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేయబోతున్నానని ప్రకటించింది.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?