పవన్ కల్యాణ్ ని భలేగా ఇరికించిన నాగబాబు

క్లాస్ పీకేవాడు తనదారిన తాను చెప్పాల్సింది ఏదో చెప్పేస్తే సరిపోయేది. అనవసరంగా అతికిపోయి ఏదేదో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇంటర్ ఫెయిలై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుర్ఘటనలు విని ఆందోళనతో నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ లో సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఫ్లోలో చాలా చాలానే మాట్లాడారు.

విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రులే కారణం అని ఓసారి, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ కాలేజీల ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని మరోసారి తన నోటికొచ్చింది చెప్పేశారు. అంతా బాగానే ఉంది కానీ, అంతలోనే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అంతే, ఇక తన కుటుంబ సభ్యుల చదువుల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

తాను ఎల్.ఎల్.బి. చదివి మద్రాస్ బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్నానని, చిరంజీవి డిగ్రీ పాసయ్యారని, ఒక చెల్లెలు ఎంబీబీఎస్, మరో చెల్లెలు డిగ్రీ చదివిందని చెప్పారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వంతు. కల్యాణ్ బాబు ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్ట్స్ లో డిగ్రీ హోల్డర్ అని ముక్తాయించారు. అక్కడే నాగబాబు నెటిజన్లకు దొరికిపోయారు.

పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాల్లో తాను ఇంటర్ చదివానని చెప్పారు అయితే గ్రూప్ విషయంలో ఎంపీసీ అని ఓసారి, ఎంఈసీ అని మరోసారి నోరుజారి బుక్ అయ్యారు. తీరా ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం పదో తరగతి పాసయ్యానని స్పష్టంచేశారు. తన చదువు గురించి పవన్ కల్యాణ్ కే ఓ క్లారిటీలేదు, మధ్యలో నాగబాబు వచ్చి పవన్ ని డిగ్రీ పాస్ చేయించేశారు.

దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా జోక్ లు పేలుతున్నాయి. పోనీ ఆ డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటీ ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. లోకేషే నయం చెప్పుకోడానికి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ అయినా ఉందని, పవన్ కల్యాణ్ యూనివర్సిటీ లేకుండానే డిగ్రీ తెచ్చుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

చదువులో లోకేష్ బెటరా, పవన్ కల్యాణ్ బెటరా అంటూ ఓ ఫన్నీ పోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. మొత్తానికి నాగబాబు పవన్ చదువు గురించి మాట్లాడి మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారారు.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

Show comments