నాగబాబు.. ముసుగు తీసిన వైనం

ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి అల్లు అరవింద్‌ పోటీచేయడం తప్పుకాదు.. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి నాగబాబు పోటీచేయడమూ తప్పుకాదు. కానీ, ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక.. ప్రజలకోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకున్నాక ఆ మాటలకు కట్టుబడి వుండాలి తప్ప, 'బంధుత్వం' పేరుతో రాజకీయాలు నడిపేసి, అక్కడ తమ పప్పులుడక్కపోవడంతో రాజకీయాలు పక్కనపడేసి, మళ్ళీ అవకాశం కుదిరాక రాజకీయాలు చేస్తామంటేనే ఖచ్చితంగా విమర్శలొస్తాయి.

నర్సాపురం నియోజకవర్గం నుంచి నాగబాబు లోక్‌సభకు పోటీచేయడం ఖాయమైంది. తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో అన్నయ్య నాగబాబు, జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 'మేం అన్నయ్య వెంటే వుంటాం..' అని గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు, పవన్‌ అభిమానుల్ని ఎంతగా హర్ట్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమో, ఆ పెద్దన్నయ్య.. అదేనండీ చిరంజీవి కూడా రేపోమాపో జనసేనలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నిజానికి, ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహరించింది పవన్‌కళ్యాణే. పార్టీలో కొన్ని 'శక్తుల'రాకని ఆయన తట్టుకోలేకపోయారు. ఆ శక్తుల రాకతో, పవన్‌ అనుకున్నవి అనుకున్నట్లు జరగలేదు. చివరికి పవన్‌, ఎన్నికలయ్యాక ప్రజారాజ్యం పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. చిత్రంగా అప్పట్లో నాగబాబు, ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయాలనుకోలేదు.

ఈ మధ్య, గ్లాసు పట్టుకుని యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు షురూ చేసిన నాగబాబు, జనసేనకు కొంత విరాళాన్నీ ప్రకటించిన సంగతి తెల్సిందే. తమ్ముడికి మద్దతిస్తాం, జనసేన పార్టీలో మాత్రం చేరడంలేదని చెప్పిన నాగబాబే, ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు... నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నారు కూడా. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు 'బంధుత్వం'తో టిక్కెట్‌ దక్కించేసుకుని, అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చేసుకుని, గెలిచేయాలన్న ఆలోచన ఎంతవరకు సబబు.? అన్నదే ఇక్కడ ప్రశ్న.

'దొడ్డిదారిన కాదు.. ధైర్యంగా రాజకీయాలు చేస్తాం..' అని జనసేన గట్టిగా చెప్పుకుంటూ, రాజకీయ ప్రత్యర్థులపై మండిపడుతోంది గానీ.. ప్రజల్లోకి వెళ్ళకుండా, ప్రజల కోసం పనిచేయకుండా.. రాత్రికి రాత్రి టిక్కెట్‌ దక్కించేసుకోవడాన్ని ఏమనుకోవాలి.? ఇన్నేళ్ళూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతల్ని కాదని జనసేనాని తన సోదరుడు నాగబాబుకి టిక్కెట్‌ ఇచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

ముసుగు తొలగిపోయింది.. ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడా అడుగులేస్తోంది. కానీ, కొద్దోగొప్పో ప్రజారాజ్యమే బెటర్‌.. అన్పించేలా నడుస్తున్నాయి జనసేన రాజకీయాలు.. అదే అభిమానుల్ని మరింత ఆవేదనకు గురిచేస్తోంది.

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments