నాకు పిల్లలు కావాలి, చైతూ మాత్రం రెడీగా లేడు

వచ్చే నెలకు పెళ్లయి ఏడాది అవుతోంది. మరి తల్లి అయ్యే ఉద్దేశం ఉందా లేదా? నాగార్జునను తాతను చేసేదెప్పుడు?
పిల్లలకు సంబంధించి ఇలా తొలిసారి మీడియా నుంచి సమంతకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఈ బ్యూటీ వద్ద సమాధానం కూడా రెడీగా ఉంది. పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగచైతన్య మాత్రం రెడీగా లేడని అంటోంది సమంత.

"పిల్లలు ఎప్పుడనేది ఇంకా ప్లాన్ చేయలేదు. నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు. నాకైతే పిల్లలు కావాలనే ఉంది. కానీ ఈ విషయంలో చైతూను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. పిల్లలకు సంబంధించి చై ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాడో ఏమో?"

ఇలా పిల్లలకు సంబంధించి తన చేతిలో ఏం లేదని తేల్చేసింది సమంత. ఏమైనా సందేహాలుంటే చైతూను అడగమంటోంది. మరోవైపు వినాయకచవితి పోటీపై కూడా రియాక్ట్ అయింది. తన భర్తే తనకు ముఖ్యమని, శైలజారెడ్డి అల్లుడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంది. 

"ఓ భార్యగా, నా భర్త ఆనందం నాకు చాలా ఇంపార్టెంట్. అతడికే సక్సెస్ రావాలని కోరుకుంటాను. నాకు ఏదైనా ఆయన (నాగచైతన్య) తర్వాతే. కాకపోతే యూటర్న్ సినిమాను ఎంతో ఇష్టపడి చేశాను. కాబట్టి ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఈ సినిమాతో నాకు కావాల్సింది మంచి పేరు కాదు, డబ్బు కావాలి."

మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానని, రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయనని తేల్చి చెప్పేసింది సమంత. ఒకవేళ మంచి క్యారెక్టర్లు దొరక్కపోతే ఇంట్లో ఖాళీగా కూర్చుంటానని, ఒకప్పటిలా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తనకు లేదంటోంది. 

ఇక యూటర్న్ విషయానికొస్తే.. ఈ సినిమా ట్రయిలర్ లో తన వాయిస్ పై వచ్చిన విమర్శిల్ని స్వీకరించింది సమంత. తన డబ్బింగ్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్నానని, సినిమా డబ్బింగ్ మొత్తం మరోసారి చెప్పానని అంటోంది. ఈ విషయంలో ఇద్దరి ముగ్గురి అభిప్రాయాలు కూడా తీసుకొని డబ్బింగ్ చెప్పినట్టు సమంత వెల్లడించింది.

అసలు ఎందుకు ఇంత కష్టమని ప్రశ్నిస్తే, పరిపూర్ణ నటిగా నిరూపించుకోవాలంటే డబ్బింగ్ కూడా చెప్పాలని, అందుకే ఎంత కష్టమైనా తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని అంటోంది సమంత. 

RELATED మామ, బేబి మధ్యలో నేను