అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు నాగబాబు

మహానటి సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించారు మోహన్ బాబు. ఇప్పుడు మరోసారి అదే పాత్ర ఎన్టీఆర్ బయోపిక్ లో రిపీట్ కాబోతోంది. కానీ మోహన్ బాబును మాత్రం రిపీట్ చేయడం లేదు. ఎస్వీఆర్ పాత్ర కోసం నాగబాబును తీసుకుంటున్నారట. అవును.. ఈ విషయాన్ని త్వరలోనే మేకర్స్ ఎనౌన్స్ చేయబోతున్నారు. 

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి మహానటితో ఎలాంటి పోలికలు లేకుండా చూడాలనేది మేకర్స్ ప్రాధమిక లక్ష్యం. అందుకే మహానటిలో నటించిన నటీనటులు ఎవర్నీ ఇందులో రిపీట్ చేయడం లేదు. ఇందులో భాగంగానే ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య చేయడం లేదు. ఎస్వీఆర్ పాత్రను మోహన్ బాబు చేయడం లేదు. 

ఎస్వీ రంగారావు పాత్ర కోసం నాగబాబును తీసుకోవడం అన్నది సరైన నిర్ణయమే. కాకపోతే నాగబాబు వాయిస్ పూర్తిగా పాడైపోయింది. అలాఅని వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పిస్తే గీతగోవిందం సినిమాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ అబిడ్స్ లోని ఎన్టీఆర్ నివాసంలో జరిగింది. ఈరోజు నుంచి మరో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణపై అసెంబ్లీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని ఈ అసెంబ్లీ ఎపిసోడ్ ద్వారా చూపించబోతున్నారు.

క్రిష్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నారు. సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే.