కొడుకు సినిమా పేరు మరిచిపోయిన నాగార్జున

సాధారణంగా సినిమాలు పేర్లు ఎవరూ మరిచిపోరు. ఎందుకంటే సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది కాబట్టి టైటిల్ అనేది ఎవరికైనా గుర్తుండిపోతుంది. ఇక కొడుకు నటించిన సినిమా పేరైతే ఏ తండ్రీ మరిచిపోడు. కానీ నాగార్జున విషయానికొచ్చే సరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా పేరును నాగ్ మరిచిపోయాడు. 

శైలజారెడ్డి అల్లుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రాత్రి జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ ఫంక్షన్ లో సరిగ్గా 7 నిమిషాలు మాట్లాడాడు నాగార్జున. ఈ 7 నిమిషాల స్పీచ్ లో ఒక్కసారి కూడా శైలజారెడ్డి అల్లుడు పేరును సరిగ్గా చెప్పలేకపోయాడు. స్పీచ్ కొంత నడిచిన తర్వాత ఇక లాభం లేదనుకున్నాడేమో పేరు పలకడం మానేశాడు. 'ఈ సినిమా.. ఈ సినిమా..' అంటూనే ప్రసంగం పూర్తిచేశాడు. 

తన స్పీచ్ లో నాగార్జున మాటిమాటికి శైలజారెడ్డి గారి అల్లుడు, శైలజారెడ్డి అల్లుడు గారు, శైలజా అల్లుడు అంటున్నాడే తప్ప.. ఒక్కసారి కూడా టైటిల్ ను కరెక్ట్ గా చెప్పలేకపోయాడు. దీంతో ఫ్యాన్స్ కొంచెం ఇబ్బందిపడ్డారు. ఫంక్షన్ కు వచ్చిన సెలబ్రిటీలు తమలోతాము ముసిముసిగా నవ్వుకున్నారు. 

నాగచైతన్య నటించిన గత చిత్రాల టైటిల్స్ ను నాగార్జున మరిచిపోతే మతిమరుపు అనుకోవచ్చు. కానీ రిలీజ్ కు సిద్ధమైన సినిమా టైటిల్ ను, ఏకంగా అదే సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేదికపైన మరిచిపోవడం మాత్రం భావ్యంకాదు. అయితే ఇది మతిమరుపు కాదంటున్నారు ఫ్యాన్స్. టైటిల్ విషయంలో నాగ్ కాస్త తడబడ్డాడట. కన్ఫ్యూజన్ లో అలా మాట్లాడేశాడట.

RELATED ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు