ఫస్ట్ టైం.. ఒకేసారి 3 భాషల్లో 3 సినిమాలు

మొన్నటివరకు తెలుగు సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ కు అదనంగా కోలీవుడ్ ను కూడా తన ఖాతాలో చేర్చాడు నాగార్జున. త్వరలోనే ఓ తమిళ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లబోతున్నాడు. ఇలా ఒకేసారి 3 భాషల్ని కవర్ చేస్తున్నాడు నాగార్జున.

ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగ్. ఈ మూవీ నిన్ననే లాంఛ్ అయింది. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నెలాఖరుకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు నాగార్జున. ప్రస్తుతం తెలుగులో దేవదాస్ సినిమా చేస్తున్న నాగ్, బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కతున్న ధనుష్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  

ధనుష్ హీరోగా స్వీయదర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ తో పాటు తమిళ నటులు శ్రీకాంత్, ఎస్ జే సూర్య, శరత్ కుమార్ కూడా కీలకపాత్రలు పోషించబోతున్నారు. అదితిరావు హైదరి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో తను దాదాపు 20 నిమిషాలు కనిపిస్తానని, తన గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందనే విషయాన్ని నాగ్ ఇప్పటికే బయటపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు, సినిమాకు సెట్స్ పై నుంచే ప్రచారం కల్పించే ఉద్దేశంతో.. నటీనటులంతా ఎవరి గెటప్స్ ను వాళ్లే ఎప్పటికప్పుడు రివీల్ చేయబోతున్నారు.