నాడు కిరణ్‌ ధర్నా.. నేడు బాబు ఢిల్లీ డ్రామా

ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లక్రితం కిరణ్‌కుమార్‌ రెడ్డి ధర్నాచేసిన సన్నివేశం గుర్తుందా? సరిగ్గా ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్నాచేసిన తీరు గమనించారా? అప్పట్లో సొంతపార్టీని వ్యతిరేకించి కిరణ్‌ ఢిల్లీలో షో నిర్వహించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షాన్ని వదలుకుని ధర్నా చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీని వదలి సొంతంగా పార్టీ పెట్టుకుని ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో బలహీన పడ్డారని, ఓటమి అంచున ఉన్నారని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. ఆ క్రమంలో చంద్రబాబు వేస్తున్న రకరకాల ఎత్తులు, వ్యూహాలలో ఇది ఒకటి అని అర్థం చేసుకోవాలి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీకి వచ్చినప్పుడు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం మర్యాద. తాను వెళ్లకపోతే, మంత్రులను పంపించడం పద్ధతి. అవేవి చంద్రబాబు చేయలేదు. పైగా దేశ ప్రధానమంత్రికి మర్యాద ఇవ్వరా అని ఎవరైనా అడిగితే బీజేపీతో కుమ్మక్కు అయ్యారని చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారు. ఆంధ్రులు కుసంస్కారులన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగిస్తున్నారన్న బాధ కలుగుతుంది. చంద్రబాబు అసలు డిల్లీ వెళ్లి దీక్ష చేయవలసిన అవసరం ఏముంది. నిజంగానే ఆయనకు ధైర్యం ఉంటే గన్నవరం విమానాశ్రయం వద్దకు వెళ్లి ముందుగా మోడీకి స్వాగతం చెప్పి, ఆ తర్వాత అక్కడే తన నిరసన కూడా చెప్పి ఉండవచ్చు కదా? కాని ఆ పని ఎందుకు చేయలేదు?

దేశవ్యాప్తంగా తెలిసేలా నిరసనలు చేయాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు మోడీ వచ్చినప్పుడు తన ఇంటిలోనే ఎందుకు ఉండిపోయారు? ఇదేమైనా మాచ్‌ ఫిక్సింగా... లేక భయపడ్డారా? అన్న సందేహం కూడా రావచ్చు. గతంలో ఎన్‌టీ.రామారావు దేశ ప్రధానిని ఎన్నడూ అవమానించలేదు. రాజీవ్‌ గాంధీకి స్వాగతం పలికి, ఆ తర్వాత తను ఏపీ తరపునో, పార్టీ తరపున చెప్పవలసిన నిరసనలు ఏమైనా ఉంటే చేసేశారు. అది కనీస సంస్కృతి. రాజకీయ ఆరాటంలో చంద్రబాబు ఏపీ ప్రజల పరువు కూడా తీస్తున్నట్లుగా ఉంది. ఇక ఆ తర్వాత మోడీని ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి, సీనియారిటీ గురించి పలు విమర్శలు చేశారు. ఢిల్లీలో కూడా మోడీపై కుటుంబపరమైన వ్యాఖ్యలు చేశారు.

మోడీకి కుటుంబం ఉంటే కదా దాని విలువ తెలిసేది అని చంద్రబాబు అన్నారు. అసలు పెళ్లే చేసుకోని రాహుల్‌ గాంధీని పక్కన పెట్టుకుని చంద్రబాబు ఈ వ్యాఖ్య చేయడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈయన రాజకీయంగా మిత్రురాలిగా ఉన్న మమత బెనర్జీని కూడా అవమానించినట్లు అయింది. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా చంద్రబాబు అవమానించారనుకోవాలి. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. అంతేకాదు. ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా టీడీపీవారు వేయించిన పోస్టర్లు మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయని అంటున్నారు. చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయితే ఇలాగే ఉంటుందని పోస్టర్లు వేశారు.

మరి ఇదే చాయ్‌వాలతో కలిసి పోటీచేయాలని ఆరాటపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబుకు ఇలాంటివి అలవాటే. ఉమ్మడి ఏపీి విభజన సయంలో చంద్రబాబు దానిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో దీక్షచేశారు. ఆ సందర్భంగా సోనియాగాంధీ బొమ్మను అసహ్యంగా చిత్రిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. సోనియాగాంధీని రాక్షసిగా చూపిస్తూ, రక్తం తాగుతున్నట్లు, కోరలు ఉన్న రాకాసి మాదిరి పెద్దబొమ్మ వేసి... మిగిలిన కాంగ్రెస్‌ నేతలను కూడా రాక్షసులుగా చూపించారు. పుర్రెబొమ్మలు కూడా వేశారు. అంతేకాదు... ఆ రోజులలో ఆయన కాంగ్రెస్‌ను తిట్టిన తిట్టుకుండా పలు ప్రసంగాలు చేశారు.

యుద్ధ విమానంలో విభజనబిల్లు పంపుతారా? కాంగ్రెస్‌ నేతలకు ఎంత అహంకారం.. ఇలా చాలా తిట్టారు. ఆ తర్వాత కూడా సోనియాగాంధీని గాడ్సేతో పోల్చడం, తెలుగుజాతి పొట్టకొట్టిన వ్యక్తిగా విమర్శించడం వంటివి జరిగాయి. తదుపరి రాహుల్‌గాంధీని కూడా అవమానిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్‌ చెత్త పార్టీ అని, దానిపై తాను ఒక తట్టెడు మట్టి వేశానని, మీరు కూడా వేయండని సభలలో చెప్పారు. ఇప్పుడు ఆయన తాను వేసిన మట్టి తీసేపనిలో పడ్డట్లు అనుకోవాలి. కాంగ్రెస్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయం చేసే దశకు వెళ్లారు.

ఇక్కడ చంద్రబాబును విమర్శించడం ఒక కోణం అయితే, ఏఐసీసీ అధినేతగా ఉన్న రాహుల్‌గాంధీ ఎలాంటి అవమాన భారంలేకుండా వచ్చి చంద్రబాబు పక్కన కూర్చుని ముచ్చట్లు ఆడుతున్నారు. తల్లిని అవమానించినా పట్టని కొడుకుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. నిజానికి అప్పుడు సోనియాగాంధీని అయినా, ఇప్పుడు మోడీని అయినా చంద్రబాబు అంత నీచంగా అవమానించడం పద్ధతికాదు. సంస్కృతి, సంప్రదాయం కాదు. ఢిల్లీ పోరాట దీక్షకు రాహుల్‌ గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వంటివారిని కూడా రప్పించడం చంద్రబాబు విజయం అయితే, అది రాహుల్‌, మన్మోహన్‌ల బలహీనతగా భావించాలి. విలువలు లేని రాజకీయాలకు ఒక పరాకాష్టగా దీనిని పరిగణించాలి.

చంద్రబాబు, రాహుల్‌ మధ్య ఏదో బలమైన బంధం ఏర్పడబట్టే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షను తీవ్రంగా విమర్శించి, రాహుల్‌ను గతంలో అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కోరడం ఏమిటి? రాహుల్‌ మాత్రం అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు పక్కన కూర్చుని ఏపీ కాంగ్రెస్‌ నేతల పరువుతీయడం ఏమిటి? అది కాంగ్రెస్‌ దయనీయ స్థితికి అద్ధం పడుతుంది. ఇక ఇతరత్రా ఆయా పార్టీల నేతలు కూడా వచ్చారు. వారంతా ప్రధానంగా బీజేపీ యేతర పార్టీలవారే. వారి లక్ష్యం ఏపీకి ప్రత్యేకహోదా కన్నా, బీజేపీపైన, ప్రధాని మోడీపైన విమర్శలు చేయడానికి ఒక వేదిక దొరికిందన్న లక్ష్యంతో వచ్చినట్లు అనిపిస్తుంది.

ఏపీలో ఆప్‌నేతలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిపై విరుచుకుపడుతుంటారు. కాని నీతివంతమైన రాజకీయాలు చేస్తానని చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రం వెళ్లి చంద్రబాబు పక్కన కూర్చుని కబుర్లు చెప్పివెళ్లారు. అయితే వామపక్షాలు జాతీయ స్థాయిలో, ఏపీ స్థాయిలో ఒకే వైఖరితో ఉండి వారెవరూ చంద్రబాబు దీక్షకు వెళ్లలేదు. ఏపీకి బీజేపీ ఎంత ద్రోహంచేసిందో, చంద్రబాబు కూడా అంతే చేశారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దేశస్థాయిలో తాను ఇంతమంది నేతలను పోగుచేయగలిగానని చెప్పి ఏపీలో ప్రజలను మభ్యపెట్టడానికి ఇది కొంతవరకు ఉపయోగపడవచ్చు. కాని ఇందుకోసం ప్రజల సొమ్ము పదికోట్లకు పైగా వెచ్చించి తన ప్రచారం, టీడీపీ ప్రచారం చేసుకోవడం మాత్రం దారుణంగా ఉంది.

ఆర్థికంగా కూడా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సొంత డబ్బులతో ఇలాంటివి పెట్టుకుంటే గౌరవంగా ఉండేది. కాని చంద్రబాబు అందుకు సిద్ధపడడం లేదు. తన ఇళ్ల కోసమే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీటిలా ఖర్చుపెట్టిన చంద్రబాబునాయుడు నుంచి ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుంది. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి వద్దకు పాదయాత్ర సినిమాను కూడా ఆవిష్కరించారు. ఆయన పక్కన గరుడపురాణం శివాజీని, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ కనిపించారు. గతంలో వీరిద్దరిని విజయవాడ నుంచి పోలీసులతో చంద్రబాబు తరిమివేయిస్తే, వారు హైదరాబాద్‌ వచ్చి చంద్రబాబును ఏ రకంగా విమర్శించింది అందరికి తెలుసు. ఇక చంద్రబాబు ప్రసంగంలో కొన్ని అంశాలు  మిస్‌ అవుతున్నాయి.

కేంద్రం నుంచి అసలు ఏమీ ఇవ్వలేదని అంటారు? అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన ఏడువేల కోట్ల సంగతి చెప్పరు. అలాగే ఐఐటీ, ఐఐఎమ్‌ వంటి పదికి పైగా సంస్థలను కేంద్రం ఇచ్చిన సంగతిని మరుగున పర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే నిజాయితీ లోపించింది. కేంద్రం ఇవి ఇచ్చింది.. ఇంకా ఇవి ఇవ్వాలని అడిగితే బాగుంటుంది. అలాగే ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేసినప్పుడు విపక్షనేత జగన్‌ను ఎంతగా చంద్రబాబు విమర్శించింది అందరికి తెలుసు. అసలు హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయని కూడా ప్రశ్నించేవారు.

కాని ఇప్పుడు అదే హోదా కోసం తాను పోరాడుతున్నానని చెబుతున్నారు. ఎందుకు తాను అప్పట్లో విపక్షాలపై కేసులు పెట్టింది.. ఇప్పుడు ఎందుకు తాను ప్రజల డబ్బుతో పోరాటం అంటూ హడావుడి చేస్తోంది కూడా వివరంగా చెప్పగలిగితే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలాకాకుండా చంద్రబాబు ఏమిచేసినా జనం డబ్బును వృదా చేసినట్లే. అలాగే మాటలు మార్చడంలో సిద్ధహస్తుడుగా, అబద్ధాలు ఆడడంలో ఆరితేరిన వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు నాయుడు డిల్లీలో చేసిన విన్యాసానికి పెద్దగా విలువ ఉండదు. ఆయనకు మద్ధతు ఇవ్వడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాని ఏపీ ప్రజలకు కూడా తెలియదనుకుంటే పొరపాటే.

-కొమ్మినేని శ్రీనివాసరావు

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!