నడిచేది జగన్‌.. నడిపించేది జనం.!

ప్రజాసంకల్ప యాత్రకు ఏడాది పూర్తయ్యింది. మధ్యలో అనేక అవాంతరాలు.. అన్నిటినీ అధిగమించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజాసంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇంతలోనే పెద్దకుట్ర. అదీ, వైఎస్‌ జగన్‌ని అంతమొందించేందుకు ప్లాన్‌ జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వైఎస్‌ జగన్‌, వైద్య చికిత్స అనంతరం కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని, తిరిగి.. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. అందుకే, ప్రజాసంకల్ప యాత్రలో ఈరోజు చాలా చాలా ప్రత్యేకం.

విజయనగరం జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పునఃప్రారంభమయ్యింది. జగన్‌ రాక నేపథ్యంలో ముందుగానే, పెద్దయెత్తున జగన్‌ పాదయాత్ర ప్రారంభించే ప్రాంతానికి జనం చేరుకున్నారు. డబ్బుతో వచ్చిన అభిమానం కాదది. అందుకేనేమో.. వయసు మీదపడ్డ వృద్ధులూ, జగన్‌ వెంట పాదయాత్రగా కలసి వెళ్ళేందుకు ముందుకొచ్చారు.

ఫొటో చూస్తున్నారు కదా.. ప్రజాసంకల్ప యాత్ర మొత్తానికీ ఈ ఫొటో హైలైట్‌ అనుకోవచ్చేమో. అవును మరి, జగన్‌ నడుస్తున్నారు.. కానీ, ఆయన్ని నడిపిస్తున్నది జనం.. అని చెబుతోంది ఈ ఫొటో. మామూలుగా కాస్సేపు నడిస్తేనే నీరసం వచ్చేస్తుంటుంది. కానీ, జగన్‌ పరిస్థితి వేరు. వందలాది మంది, వేలాది మంది తనతోపాటు అడుగులేస్తోంటే, ప్రజాసంకల్ప యాత్రకు కొత్త ఉత్సాహం అందిస్తోంటే, వారిచ్చే ఉత్సాహంతో.. మరింత ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు.

ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యల్ని వైఎస్‌ జగన్‌ వద్ద ప్రస్తావించడం, ఆ సమస్యల్ని విని, పరిష్కారం తాను చూపిస్తానంటూ వారికి భరోసా ఇవ్వడం.. ఇలా సాగుతోంది జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర. వైద్యులేమో, కొన్ని రోజులపాటు వైఎస్‌ జగన్‌, గాయపడ్డ చేతికి ఎక్కువ శ్రమ ఇవ్వవద్దని చెప్పారు.

కానీ, జనంలోకి వెళ్ళాక.. అక్కడి జన సంద్రాన్ని చూశాక, చేతికి గాయం అయ్యిందన్న విషయం ఎలా గుర్తుంటుంది.? పైగా, జగన్‌ చేతిని ఓ అవ్వ తన చేతిలోకి తీసుకుని, ముందుకు నడిపిస్తోంటే.. గాయం చిన్నబోదా.? అదే జరిగిందక్కడ. ఇప్పుడు ఒప్పుకుంటారా, జగన్‌ నడుస్తున్నా.. అతన్ని నడిపిస్తోన్నది జనం అని.!

Show comments