మైత్రి మూవీస్‌కి భారంగా మారిన ఉప్పెన

మొదటి మూడు చిత్రాలతోను అగ్ర హీరోలతో ఘన విజయాలు సాధించి అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్‌ ఆ తర్వాత మీడియం రేంజ్‌ సినిమాలపై దృష్టి పెట్టారు.

కానీ పెద్ద సినిమాలకి కలిసి వచ్చిన కాంబినేషన్‌ చిన్న చిత్రాలకి బెడిసి కొట్టింది. సవ్యసాచి, అమర్‌ అక్బర్‌ ఆంటొని లాంటి డిజాస్టర్స్‌ తర్వాత డియర్‌ కామ్రేడ్‌ కూడా అంచనాలని అందుకోలేకపోయింది.

వరుస పరాజయాలతో ప్రస్తుతం ఆశలన్నీ సుకుమార్‌-అల్లు అర్జున్‌ చిత్రం మీదే మైత్రి మూవీస్‌ పెట్టుకుంది. అయితే దాని కంటే ముందు రానున్న చిన్న చిత్రాలు కూడా ఆ సంస్థకి భారంగా మారాయి.

సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా 'ఉప్పెన' అనే చిత్రాన్ని మైత్రి తలపెట్టింది. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది కానీ బడ్జెట్‌ ఇప్పటికే అవధులు దాటిపోయింది.

కొత్త హీరో, కొత్త దర్శకుడికి తోడు తమ సంస్థ నుంచి వచ్చిన రీసెంట్‌ ఫ్లాప్స్‌ మైత్రిని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఉప్పెన చిత్రాన్ని భారీ డెసిఫిట్‌తో రిలీజ్‌ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర చేయడం క్రేజ్‌ పరంగా కలిసి వస్తుంది. అలాగే తమిళంలో కూడా కాస్త రీచ్‌ పెంచుతుంది. ఏదేమైనా కానీ చిన్న, మధ్య తరగతి చిత్రాల నిర్మాణం మాత్రం ఈ సంస్థకి తగని భారంగా మారింది.