ముందే ముక్కలు కానున్న 'టి' మహాకూటమి.?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనుండగా, ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల కావడంతో.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ హడావిడి షురూ అయ్యింది. అందరికన్నా ముందు, తెలంగాణ రాష్ట్ర సమితి 105 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసిన విషయం విదితమే. అభ్యర్థుల లిస్ట్‌ ఖరారు చేసుకున్నాక, ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి మరీ, తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసుకున్నారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.

ఇక, కేసీఆర్‌ ఇచ్చిన షాక్‌తో విపక్షాలు డైలమాలో పడిపోయాయి. మహాకూటమిగా జతకడ్తున్నప్పటికీ ఏ పార్టీ రాజకీయం ఆ పార్టీదే అన్నట్టుంది ప్రస్తుతానికి. టిక్కెట్ల పంపకం దగ్గర పంచాయితీ అస్సలేమాత్రం తెగడంలేదు. 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లకు డబుల్‌ అడుగుతోంది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్‌ పార్టీనే మహాకూటమికి కేంద్ర బిందువు కావడంతో, ఆ పార్టీ ఏకంగా 90 స్థానాలు తమతో వుంచుకుని, మిగతావి మిత్రపక్షాలకు ఇవ్వాలనుకుంటోంది. కొత్తగా పుట్టిన తెలంగాణ జనసమితి లెక్క 25కి పైగానే కన్పిస్తోంది.

సింగిల్‌ డిజిట్‌కే తెలంగాణ జన సమితిని (టిక్కెట్ల పరంగా) పరిమితం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌, ఓ పది పదిహేను సీట్లను టీడీపీకి ఇవ్వాలనే భావనలో వుంది. అయితే, ఎవరికి వారు తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకోవడంతో టిక్కెట్ల పంచాయితీ ఓ కొలిక్కి రావడంలేదు. 'అమావాశ్య' పేరుతో ఓ సారి, మరో కుంటి సాకు చూపి ఇంకోసారి.. ఇలా చర్చలు సాగుతూ, వాయిదా పడుతూ వున్నాయి తప్ప.. చర్చలు ఫైనల్‌ అయి, టిక్కెట్లు మాత్రం ఖరారు కావడంలేదు.

ఇదిలా వుంటే, మహాకూటమిని డంప్‌ చేసే పనిలో కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి వున్నట్లు కన్పిస్తోంది. తెలంగాణ జన సమితికి బీజేపీ నుంచి ఆ స్థాయిలో బంపర్‌ ఆఫర్‌ ఒకటి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే.. కాంగ్రెస్‌ - టీడీపీ దారుణంగా దెబ్బతినేయడం ఖాయం. ఎందుకంటే, కాంగ్రెస్‌ అయినా.. తెలంగాణ టీడీపీ అయినా.. ఎంతో కొంత కోదండరామ్‌ 'నిజాయితీ'ని ఎన్నికల్లో క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నవే. 

మొత్తమ్మీద, కాంగ్రెస్‌ పార్టీ తాము పోటీ చేయబోయే నియోజకవర్గాల్ని దాదాపు ఖాయం చేసుకుంటున్న దరిమిలా.. రేపో మాపో మహాకూటమి ముక్కలయ్యిందన్న అధికారిక ప్రకటన.. అతి త్వరలో వినబోతున్నామేమో!

Show comments