ఎమ్బీయస్‌: ముల్ల పెరియార్‌ డ్యామ్‌ వివాదం

కేరళ వరదలకు కారణం మనమంతా అనుకుంటున్నట్లు గాడ్గీళ్‌ నివేదిక అమలు చేయకపోవడం కాదట. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తూ తమిళనాడు ప్రభుత్వం తమ గోడు వినకుండా హఠాత్తుగా ముల్లపెరియార్‌ డ్యామ్‌ నుంచి నీరు విడుదల చేయడంతో ఇడుక్కి రిజర్వాయర్‌కు నీరు వచ్చిపడి తమకు వరద వచ్చిందని వాదించింది. అదంతా నాన్సెన్స్‌ అని తమిళనాడు కొట్టి పడేసింది. కోర్టు తదుపరి వాదనలు సెప్టెంబరు 6న వింటానంది. ఈ గొడవ అర్థం కావాలంటే ఆ డ్యామ్‌ కహానీ క్లుప్తంగానైనా తెలుసుకోవాలి.

ఇప్పటి తమిళనాడులోని తేని, మధురై, శివగంగ, రామనాధ్‌ జిల్లాలలో సాగునీటికి, తాగునీటికి కొరత ఉందని 1880ల్లోనే గ్రహించిన అప్పటి  బ్రిటిషు పాలకులు వాటికి నీరు కావాలంటే కేరళలోని ఇడుక్కి జిల్లాలో ప్రవహించే పెరియార్‌ నది నుంచి నీటిని మళ్లించాలని గుర్తించారు. 1895లో తేక్కడిలో ఆ డ్యామ్‌ కట్టారు. ఇరు ప్రాంతాల మధ్య 1886లో లీజు అగ్రిమెంటు రాసుకున్నారు. డ్యామ్‌ ఉన్నది కేరళలో. కానీ అవసరం తమిళనాడుది. అందుకని డ్యామ్‌ యాజమాన్యం కేరళదైనా నిర్వహణంతా తమిళనాడుదే. ఆ డ్యామ్‌లో సాధ్యమైనంత ఎక్కువ నీరు నిలవ చేయాలని, కరువు రోజుల్లో దానిని వాడుకోవాలని తమిళనాడు తాపత్రయం. 
అది నూరేళ్లకు పైబడిన పాత డ్యామ్‌ కాబట్టి ఎక్కువ నిలవ చేస్తే డ్యామ్‌ బద్దలై తమ ప్రాంతాలు మునుగుతాయని కేరళ అభ్యంతరం. దానితో బాటు యింకో కారణం కూడా ఉంది. దానికి 45 కి.మీ.ల కింద ఇడుక్కి డ్యామ్‌ కట్టి దాని ద్వారా జలవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. దానికి నీరు కావాలంటే ముల్లపెరియార్‌ డ్యామ్‌లో నీళ్లు ఎక్కువగా ఉంచకుండా కిందకు పంపేస్తూ ఉండాలి. ఆ డ్యామ్‌లో నీటిమట్టం ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో రెండు రాష్ట్రాలూ దశాబ్దాలుగా కొట్టుకుని ఛస్తున్నాయి.

1979లో ఆనకట్టకు పగుళ్లు రావడంతో కేంద్ర జలసంఘం నీటిమట్టం 136కి మించవద్దని సలహా యిచ్చింది. కేరళ ప్రభుత్వం దాన్ని గట్టిగా పట్టుకుంది. పూర్తిస్థాయి 152 అడుగులైనప్పుడు 136 దగ్గర ఆపడమేమిటంటూ తమిళనాడు కోర్టుకి వెళ్లింది. అలా ఆపితే తమ పంటలు నాశనమై పోతాయి కాబట్టి నీటిమట్టపు పరిమితి 142 అడుగులకు ఉండాలని తమిళనాడు కోర్టుకి వెళ్లింది. అంతకు పెంచితే డ్యామ్‌ తట్టుకోలేదని కేరళ నిరాకరిస్తోంది. మరమ్మత్తులు చేసి పటిష్ట పరుస్తామని తమిళనాడు ఆఫర్‌ చేసినా ఒప్పుకోవటంలేదు. 2006లో సుప్రీంకోర్టు 'ప్రస్తుతానికి 142కి పెంచుతున్నాం. డ్యామ్‌ను పటిష్టపరిచే పనులు కూడా తమిళనాడే చేపట్టి, నీరు సక్రమంగా వెళ్లే ఏర్పాట్లు చేసి చూపిస్తే 152 దాకా పెంచుతాం' అంది.

కేరళకు యిది అవమానకరంగా తోచింది. కేరళ ఇరిగేషన్‌ అండ్‌ వాటర్‌ కన్సర్వేషన్‌ (ఎమెండ్‌మెంట్‌) చట్టం, 2006 చేసి ఆ డ్యామ్‌ను 'ఎన్‌డేంజర్‌డ్‌' (ప్రమాదకరమైన స్థాయిలో ఉండి రక్షింపబడవలసిన కట్టడం)గా ప్రకటించింది. డ్యామ్‌ పడిపోయి తమ జిల్లాలు మునిగిపోకుండా చూడవలసిన బాధ్యత తమదే కదా అని వాదించింది. 136 అడుగులకు మించి నీటిమట్టం ఎత్తు ఉండకూడదని తీర్మానించింది. అయితే సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసి డామ్‌ పటిష్టతను తేల్చమంది. ఆ కమిటీ 2012లో ఓ నివేదిక యిచ్చి 142 దాకా ఏ ప్రమాదమూ లేదంది.

దాని ఆధారంగా 2014లో సుప్రీంకోర్టు కేరళ చేసిన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టిపారేసింది. 142 అడుగుల ఎత్తును స్థిరపరిచింది. ఎత్తు మేన్‌టేన్‌ చేస్తున్నారో లేదో చూడడానికి ముగ్గురు సభ్యులతో ఒక శాశ్వత పర్యవేక్షక కమిటీని నియమించింది. ముగ్గురిలో యిద్దరు రాష్ట్ర ప్రతినిథులతో పాటు చైర్మన్‌గా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఉద్యోగి ఉంటాడు. నిజానికి 142 అడుగుల ఎత్తు చాలా అరుదుగా చేరుతుంది. 35 ఏళ్ల తర్వాత 2014లో చేరింది. మళ్లీ యిప్పుడు 141.2 చేరింది. వరదలు వచ్చాక 'డ్యామ్‌లో నీరు వదిలిపెట్టేయాలి, లేకపోతే పొర్లిపోయి, మా జిల్లాను ముంచెత్తేస్తుంది' అంటూ ఇడుక్కి జిల్లా వాసి రస్సెల్‌ జాయ్‌ అనే ఆయన సుప్రీంకోర్టులో పిల్‌ వేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు తమిళనాడుని ఎత్తు తగ్గించమని ఆదేశించింది.

'ఇవాళ మీమాట విని తగ్గిస్తే, రేపణ్నుంచి ప్రతీసారీ కేరళ తగ్గించమంటూనే ఉంటుంది. అందుకని తగ్గించడం కుదరదు' అని తమిళనాడు చెప్పింది. ఇది వారం కిందటి వార్త. ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త - సుప్రీం కోర్టులో కేరళ వాదన. ''డ్యామ్‌లో 139 అడుగుల ఎత్తు రాగానే నీరు విడుదల చేయమని అడిగాం. తానీ తమిళనాడు ఉలకలేదు, పలకలేదు. నీరు వదిలి పెడితే మాకు వరదలు రావడం ఖాయం. కాస్త ముందే చెపితే ఆ గ్రామాల్లోంచి ప్రజలను ఖాళీ చేయిద్దామని మా తాపత్రయం. కానీ ఏ మాటా చెప్పకుండా తమిళనాడు ప్రభుత్వం దాదాపు 142 దాకా చేరేదాకా ఆగింది. ఆగస్టు 14 రాత్రి 2.40కు 13 షట్టర్లు తెరిచి నీళ్లు వదిలేసింది.

మర్నాడు పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు 9 వేల క్యూసెక్కులు, మధ్యాహ్నం 2 గం నుంచి 21.450 క్యూసెక్కుల నీరు వదిలేసింది. ఒకవైపు వర్షాలు, మరో వైపు యీ నీళ్లు వదలడంతో మా గ్రామాలు మునిగిపోయాయి అని కేరళ అంది. దానికి సమాధానంగా తమిళనాడు కౌంటర్‌ అఫిడవిట్‌ కోర్టులో యిచ్చింది. '136 అడుగులు దాటగానే కేరళ అధికారులకు చెప్పాం. ఆ తర్వాత 138 దగ్గర, 140 దగ్గర, 141, 142 దగ్గర కేరళ అధికారులకు చెప్పాం. 142 దాకా ఆగి, ఒక్కసారి విడుదల చేశామన్నది తప్పు. 140 దాటగానే కొద్దికొద్దిగా నీళ్లు వదిలేస్తూ వచ్చాం. మట్టం పెరిగే కొద్దీ విడుదల చేసే నీరు పరిమాణం పెంచాం. మేం ఇడుక్కి డామ్‌కి రిలీజు చేసిన నీటి కంటె వాళ్లు ఇడుక్కి నుంచి ఎక్కువ నీళ్లు విడుదల చేశారు.

లోవర్‌ పెరియార్‌ బేసిన్‌లో వరదలు రావడానికి కారణం - కేరళ ప్రభుత్వం ఇడుక్కి నుంచే కాకుండా, ఇదమలయార్‌, భూతతాంకెట్టు డామ్‌ల నుంచి నీళ్లు ఒకేసారి విడుదల చేసింది. మొత్తం 39 డామ్‌ల నుంచి ఆగస్టు మొదటివారం నుంచే నీళ్లు వదిలింది. అన్నీ కలిపి ముంచెత్తాయి. మమ్మల్ని బాధ్యులను చేయడం సబబు కాదు.' అంది. వ్యక్తుల మధ్య నోటిమాటలైతే ఆధారాలుండవు. ఒకరు చెప్పాననీ, మరొకరు చెప్పలేదనీ వాదించవచ్చు. కానీ ప్రభుత్వాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు లిఖితపూర్వకంగా ఉంటాయి. పైగా మధ్యవర్తిగా కేంద్ర అధికారి ఉన్నాడు. అలాటప్పుడు యీ వాదనల మధ్య యింత తేడా రావడమేమిటి? తమిళనాడు హెచ్చరించానంటోంది, కేరళ లేదంటోంది.

నిజమేదో కోర్టు ఎలాగూ తేలుస్తుంది. ఏది ఏమైనా డ్యామ్‌ మేనేజ్‌మెంట్‌లో కేరళ పొరపాట్లు చేసినట్లు అనిపిస్తోంది - ప్రస్తుతానికి! అసలు సంగతి తేలాక యిప్పుడు విరాళాలు వస్తున్న స్ఫూర్తితోనే కేరళ ప్రభుత్వానికి అభిశంసనలు కూడా వెల్లువెత్తాలి. అప్పుడే తక్కిన రాష్ట్రాలు జాగరూకతతో ఉంటాయి.
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com

Show comments