మన్మోహన్ సింగ్ నే నమ్ముకున్న సోనియా!

తమ కష్టకాలంలో ఆపదమొక్కుల వాడిలా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానానికి బాగా ఉపయోగపడుతూ ఉన్నారు. తను ప్రధానమంత్రి పదవిని అధిష్టించడానికి అననుకూల పరిణామాలు ఏర్పడినప్పుడు సోనియాగాంధీ మన్మోహన్ ను పీఠం ఎక్కించారు. ఆయనను ముందు సీట్లో కూర్చోబెట్టి పదేళ్లపాటు తను బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేశారు. ప్రధాని ఆయన అయినా పవర్ మాత్రం తనచేతిలో పెట్టుకుని నడిపించారు సోనియా. పదేళ్ల పాటు సోనియాకు మరో ప్రత్యామ్నాయం దొరకలేదు.

మన్మోహన్ కాకుండా మరెవరు అయినా అక్కడ కూర్చుంటే తనను ధిక్కరిస్తారని ఆమె భయపడ్డారు. అప్పుడు అలా తన విధేయతతో సోనియాకు ఎంతో బాసటగా నిలిచారు మన్మోహన్. అయితే ఇప్పుడు పార్టీ మళ్లీ కష్టకాలంలో కొనసాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మన్మోహన్ మేధస్సును మరోరకంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. అందులో భాగంగా మన్మోహన్ ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయడానికి వివిధ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.

మన్మోహన్ ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ఏ రాష్ట్ర అసెంబ్లీ కోటాలోనూ కాంగ్రెస్ కు ఛాన్స్ లేకపోయింది. ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల కోటా నుంచి ప్రయత్నాలు చేసింది. ఆఖరికి డీఎంకేను కూడా అడిగింది. అయినా కుదరలేదు. అయితే కాంగ్రెస్ కు రాజస్తాన్ నుంచి అవకాశం దక్కింది. అక్కడ బీజేపీ రాజ్యసభ సభ్యుడొకరు మరణించారు. రాజస్తాన్ లో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు ఆ సీటు దక్కుతుందిప్పుడు. ఆ స్థానానికి మన్మోహన్ చేత నామినేషన్ వేయించారు.

మన్మోహన్ విలువ ఏమిటో ఆయన పదవి నుంచి దిగిపోయాకా కొంతమందికి అయినా తెలిసిందని, అందుకే ఆయన వాణిని రాజ్యసభ నుంచి వినిపించి మోడీపై పోరాడాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కాంగ్రెస్ లోని మిగతా నేతలు మాట్లాడటం కన్నా మన్మోహన్ మాట్లాడితే విలువ ఉంటుందనేది సోనియా లెక్కలాగుంది.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!

Show comments