ఇంతకంటె పారదర్శకత సాధ్యమేనా?

ఎవరెన్ని వక్రభాష్యాలు చెబుతున్నప్పటికీ.. జగన్మోహనరెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత.. యువతరానికి కొలువులు ఏర్పడ్డాయనే మాట నిజం. కూలి పనుల్లా యువతరాన్ని వాడుకోకుండా.. వారి జీవితాలకు ఎంతోకొంత మేర భద్రతను, నిశ్చింతను ఇచ్చే ఉద్యోగాలను ప్రభుత్వం లక్షల సంఖ్యలో కల్పించింది. యువతరానికి ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం చాలా దృఢమైన సంకల్పంతో అడుగులు వేస్తోంది.

అదే సమయంలో పెద్దస్థాయి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయి. డీఎస్సీ కూడా నిర్వహించబోతున్నట్లు నాయకులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గుర్తించవలసిన అంశం ఏంటంటే... పెద్దస్థాయి ఉద్యోగాల కల్పన విషయంలో గతంలో ఎన్నడూలేనంత పారదర్శకతను పాటించే ప్రయత్నం చేస్తున్నది.. జగన్ ప్రభుత్వం.

ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల విషయంలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికార్లకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టబోయే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేయడానికి సీఎం వాటిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఇకపై ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.

గ్రూపు పరీక్షలు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ కేడర్ లోని అనేక కీలకపోస్టులకు ఏపీపీఎస్సీనే పరీక్షలు నిర్వహిస్తుంది. ఆబ్జెక్టివ్ రాతపరీక్ష తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహించి నియామకాలు చేపడతారు. సాధారణంగా ఇంటర్వ్యూల్లోనే మతలబులు చోటు చేసుకుంటుంటాయి. సిఫారసులకు, లంచాలకు ప్రాధాన్యం ఉంటుంది.

ఆ రూపేణా ఇంటర్వ్యూలో మంచి మార్కులు వచ్చి.. రాతపరీక్షలో కాస్త అటుయిటుగా వచ్చినా.. ఉద్యోగాలు పొందుతున్నవారు కొల్లలు. నియామకాల్లో ఇలాంటి అవినీతి, అరాచకపోకడలకు జగన్మోహనరెడ్డి చెక్ పెట్టేస్తున్నారు. ఇంటర్వ్యూలు అనే ప్రక్రియే లేకపోతే గనుక.. ఇక అవినీతికి ఆస్కారం పూర్తిగా తగ్గిపోతుంది. కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలు మాత్రమే అయినప్పుడు.. ఇక అవకతవకలు తగ్గుతాయి.

వీటితోపాటు ఫలితాలను వేగంగా ప్రకటించడం మీద కూడా జగన్ సర్కారు దృష్టిపెట్టాలి. అన్నీ ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతున్నప్పుడు.. ఒకటిరెండు రోజుల్లో ఫలితాలు వెల్లడించేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గనుక.. ఆ వర్గాల్లో జగన్ సర్కారు మీద గౌరవం, విశ్వాసం మరింతగా పెరుగుతాయనడంలో సందేహం లేదు.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

Show comments