ఎమ్బీయస్‌: మోదీ విజయం - బెంగాల్‌ - 2/2

తృణమూల్‌కు వ్యతిరేకంగా యిన్ని అంశాలున్నా వాళ్లకు 22 సీట్లు ఎలా వచ్చాయి అంటే లోకనీతి వారి సర్వే ప్రకారం బెంగాలీలలో మమతకున్న ప్రజాదరణ 43% కాగా మోదీకి 37% మాత్రమే. మోదీకి ఆ మాత్రమైనా రావడానికి కారణం తను ర్యాలీలలో ఆట్టుకునేట్లా చేసిన ప్రసంగాలు, తను బెంగాల్‌ను అభివృద్ధి చేయబోతే మమత స్పీడు బ్రేకర్‌లా అడ్డుకొడుతోందని ప్రజల్ని నమ్మించ గలగడం! మమత మోదీని గణాంకాలతో ఎదుర్కోకుండా వ్యక్తిగతంగా నిందించడం ఆమెకు చెరుపు చేసింది. అయినా 35 సం.ల కంటె ఎక్కువ వయసున్నవారిలో బిజెపి కంటె 10% ముందుంది. 18-35 సం.ల వయోవర్గంలో మోదీ మమత కంటె 6% ముందున్నారు.

కేంద్రం వెర్సస్‌ రాష్ట్రం - కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బిజెపి ఎన్నికల వేళ కేంద్ర బలగాలను దింపి, మమత సేనను నిర్వీర్యం చేసింది. ఇసి ద్వారా పోలీసు అధికారులు అనేకమందిని బదిలీ చేయించింది. 42 ఎంపీ సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో రెండు విడతల్లో ఎన్నికలు ముగించారు. కానీ అన్నే సీట్లున్న బెంగాల్‌లో 7 విడతలకు సాగతీశారు. దీంతో మమతను నియంత్రించడంతో బాటు, మోదీ ప్రచారానికి కూడా కావలసినంత సమయం చిక్కింది.  ఓటింగు శాతం 83% దాటింది.

పోలీసులు, అధికారులు యిన్నాళ్లూ మమత చెప్పినట్లే ఆడారు. అయితే ఎప్పుడైతే కేంద్రం మమతను అదుపు చేయడానికి ప్రయత్నిస్తోందని గ్రహించారో అప్పణ్నుంచి మాట వినడం మానేశారు. అందుకే ఫలితాలు వచ్చాక మమత పెద్ద ఎత్తున అధికారులను మార్చింది. వారిలో 43 మంది ఐపిఎస్‌లున్నారు. ముగ్గురు ఐఏఎస్‌లను కేంద్ర సర్వీసులకు పంపేసింది. వీళ్లంతా ఎలక్షన్‌ కమిషనర్‌ చెప్పినట్లు నడుచుకున్నారని ఆమె ఆగ్రహం. 

బిజెపికి కలిసి వచ్చిన వలసదారులు - దేశవిభజన జరిగాక తూర్పు బెంగాల్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌కు లక్షలాదిమంది శరణార్థులు వచ్చి పడ్డారు. అది 1947తో ఆగలేదు. తర్వాత కూడా హిందువులు, ముస్లిములు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు బాగా లేవు. పంజాబ్‌ వైపు సరిహద్దులను కట్టుదిట్టం చేసిన భారత్‌, పాక్‌ ప్రభుత్వాలు, బెంగాల్‌ వైపు వదిలేశాయి. దాంతో అనేకమంది వచ్చి పడి ప్రభుత్వ భూములను, కలకత్తా పరిసరాల్లో జమీందార్ల వ్యవసాయ క్షేత్రాలను, ఫామ్‌హౌస్‌లను ఆక్రమించుకున్నారు. 

అధికారంలో ఉన్న కాంగ్రెసు వారిని అదుపు చేయబోతే కమ్యూనిస్టులు వారికి అండగా నిలిచారు. ఆ శరణార్థి కాలనీలన్నిటిని క్రమబద్ధం చేయాలని పోరాటం చేశారు. ఆ విధంగా ఆ వలసదారులందరూ కమ్యూనిస్టు పార్టీ అభిమానులుగా, ఓటు బ్యాంకులుగా మారారు. సాటి బెంగాలీలు కదాని స్థానిక ప్రజలు కూడా వారిని సహించారు. ఇప్పుడు బిజెపి వలసదారులను మతపరంగా విడగొట్టి కొన్ని జిల్లాల్లో లాభపడ గలిగింది.  దానికి ఆస్కారం యిచ్చినది మమత!

మమత ఓటుబ్యాంకు రాజకీయాలు - బెంగాల్‌ సమాజంలో కులం అనేది ఒక అంశమే కాదు. దేశవిభజన సమయంలో మతకలహాలు జరిగాయి కానీ తర్వాతి కాలంలో రాజకీయ నాయకులెవరూ మతాన్ని వాడుకోలేదు. కమ్యూనిస్టులు సమాజాన్ని వర్గాలుగా చీల్చి, కార్మికులను విపరీతంగా వెనకేసుకుని వచ్చి అధికారం అందుకున్నారు తప్ప ముస్లిములను బుజ్జగించలేదు. మమత అధికారంలోకి రాగానే జనాభాలో 30% ఉన్న ముస్లిములను తన ఓటు బ్యాంకుగా మార్చుకుందామని చూసింది. 2011లోనే మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే ఇమామ్‌లకు నెలసరి గౌరవ వేతనాలు యిచ్చింది. నమాజ్‌కై పిలిచే ముయెజిన్లకు స్టయిపెండ్లు యిచ్చింది. రాజ్యాంగ విరుద్ధమంటూ దీన్ని కలకత్తా హైకోర్టు కొట్టిపారేసింది. 

మమత తన రాజకీయ బహిరంగ సభల్లో ముస్లిం ఛాందసవాదులతో వేదిక పంచుకునేది. ముస్లిములను మెప్పించడానికి ఆమె ఏమైనా చేస్తుందనే ముద్ర పడింది. బిజెపి దీన్ని రాజకీయంగా బాగా ఉపయోగించుకుంది. మమత తెలివితక్కువగా అనేక సందర్భాల్లో హిందువుల మనోభావాలకు దెబ్బ తగిలేట్లా ప్రవర్తించింది. 2016, 2017లలో దుర్గా విగ్రహ నిమజ్జనం, మొహర్రం ఒకే రోజున వస్తే నిమజ్జనాన్ని వాయిదా వేసుకోమంది. కలకత్తా హైకోర్టు ''ఇది మైనారిటీలకు బుజ్జగింపు తప్ప మరేదీ కాదు'' అని వ్యాఖ్యానించింది. 

బిజెపి హిందువులను సంఘటితం చేయడానికి బెంగాల్‌కు పరిచయం లేని రామనవమి, హనుమాన్‌ జయంతి ఊరేగింపులు కోలాహలంగా నిర్వహిస్తూ ఉంటే వాటికి ప్రతిగా మమత తన ఊరేగింపులు ఏర్పాటు చేసింది. వీటి కారణంగా ముస్లిముల ఓట్లు తనకు గంపగుత్తగా పడతాయని ఆశపడింది. కానీ చివరకు చూస్తే ముస్లిముల్లో 70% మంది తృణమూల్‌కు, 12% మంది కాంగ్రెసుకు, 10% మంది లెఫ్ట్‌కు, 4% మంది (2014లో 2%) బిజెపికి ఓటేశారుట.   

బిజెపి విసిరిన వల -   తనపై ముస్లిము పక్షపాతిగా బిజెపి కొట్టిన ముద్ర బలపడుతోందని గ్రహించిన మమత తనెంతటి హిందువో చాటుకోసాగారు. రాజకీయ వేదికలపై హిందూ మంత్రాలు పఠించారు. 'నేను ఇస్కాన్‌ వాళ్ల దేవాలయాలకు భూములిచ్చా, తారాపీఠ్‌, తారకేశ్వర్‌, కాళీఘాట్‌లను పునరుద్ధరించా, దక్షిణేష్వర్‌ గుడికి స్కై వాక్‌ కట్టించా, శ్మశానాలు సంస్కరించా, మోదీ ఏం చేశాడు?' అని ప్రశ్నించింది. అయినా లోకనీతి సర్వే ప్రకారం హిందువుల ఓట్లు 40% (2014) నుండి 32%కి తగ్గాయి. బిజెపికి 21% (2014) నుంచి 57%కు పెరిగాయి. ఇప్పుడు ఫలితాల తర్వాత బిజెపి వారు తమ రణనినాదంగా చేసుకున్న 'జై శ్రీరామ్‌' నినాదానికి బదులుగా లోకల్‌ కలర్‌తో 'జై దుర్గా', 'జై కాళీమా' నినాదాన్ని అందుకుంది.

మమతను యిరకాటంలో పెట్టడానికి హిందూ వలసదారులను ఉంచి, ముస్లిము వలసదారులను తరిమివేయాలనే నినాదం చేపట్టింది బిజెపి. అసాం తరహాలో ఎన్‌ఆర్‌సి (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) బెంగాల్‌లోనూ అమలు చేస్తానని హామీ యిచ్చింది. ఎంతమంది తగ్గితే తమకు అంత ఎక్కువ అవకాశాలు వస్తాయి కదాన్న ఆశతో సరిహద్దు జిల్లాలలోని హిందూ వలసదారులు బిజెపికి కంచుకోటగా మారారు. అసాంలో ఎన్‌ఆర్‌సి ఎంత లక్షణంగా అమలైందో (ఒక అధికారి కార్గిల్‌ యుద్ధవీరుణ్ని కూడా విదేశీయుడని 'నిరూపించి' నిర్బంధంలో పెట్టించాడన్న ఉదంతం వెలుగులోకి వచ్చింది) చూసిన ముస్లిములు బిజెపిని చూసి భయభ్రాంతులవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లాలలో మతకలహాలు ప్రారంభమయ్యాయి. ఆరు జిల్లాలలో కలిపి 150 మంది దాకా చనిపోయారని అనధికార అంచనా. 

మతం రంగు పూస్తే ఓట్లు - రాయగంజ్‌ నియోజకవర్గంలోని దరిభిత్‌ హైస్కూలులో 2018 సెప్టెంబరులో ఒక సంఘటన జరిగింది. తమకు బెంగాలీ మీడియంలో సైన్సు, సాహిత్యం బోధించే ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు అడుగుతూంటే ప్రభుత్వం అక్కడకు సంస్కృతం, ఉర్దూ ఉపాధ్యాయులను నియమించింది. దాంతో విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, స్థానికులు కొత్త టీచర్లను అడ్డుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసు ఫయరింగ్‌ జరిగి యిద్దరు హిందూ విద్యార్థులు మరణించారు. బిజెపి దాన్ని హిందువులపై దాడిగా మలచింది. 48% మంది ముస్లిములు ఉన్నా ఇప్పుడక్కడ బిజెపి అభ్యర్థి దేవశ్రీ చౌధురీ గెలిచారు. ముస్లిము ఓట్లు కాంగ్రెసుకు చెందిన దీపా దాస్‌మున్షీ, సిపిఎంకు చెందిన మొహమ్మద్‌ సలీమ్‌ల మధ్య చీలిపోయాయి. 

హిందువులను సంఘటితం చేయడం ద్వారా బిజెపి రాష్ట్రవ్యాప్తంగా కనీసం 10-12 సీట్లలో లబ్ధి పొందిందని జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఒకాయన అంచనా వేశారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న రాయగంజ్‌, బాలూర్‌ఘాట్‌, ఆలిపూర్‌దువార్‌, ఉత్తర మాల్దా, రణాఘాట్‌, బోన్‌గావ్‌, బారక్‌పూర్‌లలో బిజెపి గెలిచింది. బసీర్‌హాట్‌, కృష్ణనగర్‌లలో మాత్రమే ఓడిపోయింది. '1960ల చివర్లో బెంగాల్‌లో ఆరాచకం ఏలింది. తృణమూల్‌ దాన్ని మళ్లీ తెచ్చింది. ఇప్పుడు బిజెపి 1940ల నాటి మతకలహాలను వెనక్కి తీసుకువస్తోంది.' అన్నారాయన. 

ఇలా చేస్తూనే బిజెపి మధ్యతరగతి ముస్లిములను అనునయించడానికి చూసింది. 30% ఓట్లను పూర్తిగా విస్మరించలేదు కదా. తక్కిన రాష్ట్రాలలో ముస్లిములకు ఒక్క టిక్కెట్టు యివ్వకపోయినా బెంగాల్‌కు మినహాయింపు యిచ్చింది. కితం ఏడాది జరిగిన పంచాయితీ ఎన్నికలలో 600 మంది ముస్లిములకు టిక్కెట్లిచ్చింది. ఈ సారి పార్లమెంటు ఎన్నికలలో జాంగిపూర్‌లో మహాఫుజా ఖాన్‌కు, ముర్షీదాబాద్‌లో హుమయూన్‌ కబీర్‌కు టిక్కెట్లిచ్చింది. రెండు చోట్లా తృణమూల్‌ తరఫున నిలబడిన ముస్లిము అభ్యర్థులు వీళ్లని ఓడించారు. బిజెపి ఘనంగా నెగ్గిన ప్రాంతాలు ఉత్తరం, పశ్చిమం, కొంతవరకు తూర్పు.

ఉత్తర బెంగాల్‌లో ఫలితాలు - ఉత్తర బెంగాల్‌లోని 8 సీట్లలో 7 సీట్లలో బిజెపి గెలిచింది. వామ ఫ్రంట్‌ పాలించే రోజుల్లో గూర్ఖాలాండ్‌ ఉద్యమం కారణంగా డార్జిలింగ్‌ ప్రాంతం ఎప్పుడూ అశాంతిగానే ఉండేది. వాళ్లు చేసిన అన్ని ప్రయత్నాలూ కొద్ది రోజులకే విఫలమయ్యేవి. మమత అధికారంలోకి వచ్చాక గూర్ఖాలాండ్‌ ఉద్యమాన్ని అణచివేసి, కొందరు నాయకులను కూర్చోబెట్టి గూర్ఖా టెరిటోరియల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (జిటిఎ) ఏర్పాటు చేసి, బలవంతంగా శాంతి నెలకొల్పింది. అత్యంత ప్రజాదరణ కలిగిన గూర్ఖా జన ముక్తి మోర్చా నాయకుడు విమల్‌ గురుంగ్‌ను దానికి అధినేతగా నియమించింది. ఇక అప్పణ్నుంచి 'కొండలు యిప్పుడు చిరునవ్వు చిందిస్తున్నాయి' అనే నినాదంతో తన విజయాన్ని చాటుకుంది. 

అయితే రెండేళ్ల క్రితం అక్కడి స్కూళ్లల్లో బెంగాలీ మీడియం ప్రవేశపెట్టడంతో అల్లర్లయ్యాయి. పదిమంది చనిపోయారు. 104 రోజుల పాటు ఆ ప్రాంతంలో జనజీవితం స్తంభించింది. దాని వెనుక  గురుంగ్‌ ఉన్నాడన్న అనుమానంతో అరెస్టు చేయబోయారు. అతను అప్పణ్నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. మమత అతని స్థానంలో  వినయ్‌ తమాంగ్‌ను జిటిఎ అధినేతగా నియమించింది. కానీ అక్కడి ప్రజలు దాన్ని అమోదించలేదు. తమాంగ్‌ను ప్రభుత్వపు కీలుబొమ్మగా చూశారంతే. ఈ ఎన్నికలలో గురుంగ్‌ అనుచరులు, గూర్ఖా నేషనల్‌ ఫ్రంట్‌ బిజెపికి మద్దతిచ్చాయి. డార్జిలింగ్‌ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రాజు బిస్తా 4 లక్షల తేడాతో గెలిచాడు. పైగా అసెంబ్లీ ఉపయెన్నికలో తృణమూల్‌ తరఫున నిలబడిన వినయ్‌ తమాంగ్‌ జిఎన్‌ఎల్‌ఎఫ్‌ చేతిలో ఓడిపోయాడు.

బెంగాల్‌ పశ్చిమ ప్రాంతం ఫలితాలు - పురులియా, బాంకుడా, పశ్చిమ మేదినీపూర్‌, ఝాడ్‌గాంవ్‌లకు విస్తరించిన జంగల్‌మహల్‌లో మావోయిస్టు తాకిడి ఎక్కువగా ఉండేది. మమత మావోయిస్టు బెడదను వదిల్చి, మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. జరిగిన అభివృద్ధి కనబడే స్థాయిలో ఉంది. అయితే దానితో బాటు తృణమూల్‌ నాయకుల అవినీతి, దాష్టీకం, బంధుప్రీతి పెరిగి ప్రజలను విసిగించాయి. కాస్త ఆలస్యంగానైనా దీన్ని గుర్తించిన మమత అక్కడ తృణమూల్‌ అభ్యర్థులను మార్చింది. అయినా ఫలితం లేకపోయింది. అక్కడి గిరిజన ఓటర్లు సంఘటిత మయ్యారు. తమకు అభివృద్ధి ఫలాలు అందటం లేదని, ఉద్యోగాలు రావడం లేదనీ ఫిర్యాదుతో ఉన్న గిరిజనులను బిజెపి బాగా ఆకర్షించింది. 

దేశమంతా గిరిజన ప్రాంతాల్లో బిజెపి బలపడుతోందన్న విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పనక్కరలేదు. గతంలో గిరిజనులకు విద్య, వైద్యం అందించి క్రైస్తవ మిషనరీలు వ్యాప్తి చెందినట్లే, యిటీవలి కాలంలో ఆరెస్సెస్‌ అవే విధానాలను అవలంబించి గిరిజనులను ఆకర్షిస్తోంది. 2018 జూన్‌లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలలో పశ్చిమ మేదినీపూర్‌, పురులియా, బాంకుడా జిల్లాలలో సగం సీట్లు గెలుచుకుంది. దాంతో మమత ఉలిక్కిపడి, అక్కడ లంచాలు మేసి, గిరిజనుల ఆగ్రహాన్ని మూటగట్టుకున్న యిద్దరు మంత్రులను తొలగించింది. ఒక ఎంపీకి ప్రాముఖ్యత తగ్గించింది. అయినా యీ ఎన్నికలలో ఆ జిల్లాలలో బిజెపియే నెగ్గింది. ఫలితాల తర్వాత మేల్కొన్న మమత ఆరెస్సెస్‌ తరహాలో 'వంగ జననీ వాహిని' పేర తృణమూల్‌ సేవాదళాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇదే ప్రాంతంలో ఉన్న పశ్చిమ వర్ధమాన్‌ జిల్లాలోని అసన్‌సోల్‌ నుంచి గాయకుడు బిజెపి ఎంపీ బాబుల్‌ సుప్రియో మళ్లీ నెగ్గాడు. పక్కనే ఉన్న దుర్గాపూర్‌ నుంచి బిజెపికే చెందిన ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా నెగ్గాడు.

బెంగాల్‌ తూర్పు ప్రాంతం ఫలితాలు - బెంగాల్‌ తూర్పు ప్రాంతంలోని హుగ్లీ, ఉత్తర 24 పరగణాలు, నాదియా జిల్లాలలో కూడా తృణమూల్‌ను దెబ్బ కొట్టగలిగింది. మమతకు అధికారం తెచ్చిపెట్టిన హుగ్లీ జిల్లా కూడా ఒకటి. టాటా మోటర్స్‌ సింగూర్‌లో కార్ల ఫ్యాక్టరీ పెడతానంటే లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఆహ్వానించింది. రైతుల భూములు లాక్కోకూడదంటూ మమత ఉద్యమించింది.  రైతులందరూ ఆమెకు అండగా నిలిచారు. పదేళ్ల కోర్టు వివాదం తర్వాత భూములన్నీ రైతులకు వెనక్కి వచ్చేశాయి. 

అయితే యిప్పుడు రైతులు సంతోషంగా లేరు. తమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి లేకుండా పోయి నిరుద్యోగం ప్రబలిందని, మమత తమను రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకుందని వాపోతున్నారు. ఈ అసంతృప్తికి తోడు తృణమూల్‌లో అంత:కలహాలు బిజెపికి కలిసి వచ్చాయి. బిజెపికి చెందిన లాకెట్‌ చటర్జీ హుగ్లీలో నెగ్గింది. ఉత్తర 24 పరగణాలలోని బారక్‌పూర్‌, బన్‌గాంవ్‌లలో, నాదియా జిల్లాలోని రణఘాట్‌లలో కూడా బిజెపి వాళ్లే నెగ్గారు.

ఇతర పార్టీలు - కాంగ్రెసుకు గతంలో 4 ఉంటే యీ సారి రెండే వచ్చాయి. దానికి గట్టి పట్టున్న మాల్దా, ముర్షీదాబాద్‌, ఉత్తర దినాజ్‌పూర్‌లలో ఎదురు దెబ్బలు తగిలాయి. 2014లో 9.6% ఓట్లు వస్తే యిప్పుడు 5.6% వచ్చాయి. ప్రణబ్‌ ముఖర్జీ కొడుకు అభిజిత్‌ జాంగీపూర్‌లో మూడో స్థానంలో నిలిచాడు. బెహరాంపూర్‌లో నాలుగుసార్లుగా నెగ్గుతూ వచ్చిన అధీర్‌ రంజన్‌ చౌధురి యీసారి 80 వేల తేడాతో స్థానాన్ని నిలుపుకోగలిగాడు. 

ఒకప్పటి కాంగ్రెసు దిగ్గజం ఘనీఖాన్‌ చౌధురి కంచుకోట ఐన మాల్డాలో ముస్లిము ఓట్లు చీలిపోయి, మాల్డా (నార్త్‌)లో బిజెపి గెలిచింది. మాల్దా (సౌత్‌)లో కాంగ్రెసు అభ్యర్థి కేవలం 8 వేల ఓట్ల తేడాతో గెలిచాడు. తక్కిన రాష్ట్రాలలో లాగానే కాంగ్రెసు యిక్కడా మూర్ఖంగా వ్యవహరించింది. ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించింది. కానీ కాంగ్రెసు కలిసి రాలేదు. పైగా వారికి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థులను నిలిపి తను చెడి, వాళ్లనూ చెడగొట్టింది. కాంగ్రెసు ఓటర్లలో 32% మంది బిజెపికి, 20% మంది తృణమూల్‌కు వేశారని ఓ సర్వే చెపుతోంది. 

సిపిఎం ఆవిర్భవించిన 1964 నుంచి యిప్పటివరకు ఒక్క సీటు కూడా గెలుచుకోని సందర్భం లేదు. అది యిన్నాళ్లకు దాపురించింది. 2014లో గెలిచిన రెండూ యీసారి తుడిచిపెట్టుకుపోయాయి. ఒకటి (రాయ్‌గంజ్‌) బిజెపి పట్టుకుపోతే, మరొకటి (ముర్షీదాబాద్‌) తృణమూల్‌ పట్టుకుపోయింది. సిపిఎం పాలిట్‌ బ్యూరో సభ్యుడు మహమ్మద్‌ సలీమ్‌ రాయగంజ్‌లో మూడో స్థానంలో నిలిచాడు. 2014లో దాని ఓట్ల శాతం 23% ఉంటే యీ సారి 6.3% ఉంది. దీనికి కారణం ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులలో 39% మంది తృణమూల్‌ను అదుపు చేయడం తమ పార్టీ వలన కాదని, ఆ సమర్థత బిజెపికే ఉందని నమ్మి శత్రువు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతంతో ఓట్లేశారని అంచనా. బిజెపి విధానాలు నచ్చని 31% మంది భయంతోనో, అభిమానంతోనో తృణమూల్‌కే వేశారట. 

భవిష్యత్తు ఆందోళనకరం - ఒక సర్వే ప్రకారం బెంగాలీలలో 84% మంది దేశంలో అన్ని మతాలకు సమానస్థానం ఉందని నమ్ముతున్నా, వచ్చే రోజుల్లో రాజకీయ ప్రేరితమైన మతకలహాలు మరింతగా పెరుగుతాయని ఊహించవచ్చు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి రావచ్చని గవర్నరు ఓ యింటర్వ్యూలో చెప్పేశారు. మమత వాహనం వెళుతూంటే బిజెపి కార్యకర్తలు 'జై శ్రీరామ్‌' నినాదాలిస్తున్నారు. బిజెపి ర్యాలీలపై తృణమూల్‌ వారి దాడులు, దానికి ప్రతిదాడులు పెచ్చరిల్లాయి. 

బెంగాల్‌ను హిందూ-నాన్‌ హిందూగా చీల్చుదామని బిజెపి ప్రయత్నిస్తూ ఉంటే దీన్ని బెంగాల్‌పై బయటివారి దాడిగా చిత్రీకరించడానికి మమత ప్రయత్నిస్తోంది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహభంజనం దానికి పనికి వచ్చింది. ఇప్పుడు మమత తన నినాదాల్లో 'జై బంగ్లా' కూడా చేర్చింది. బిజెపి వాళ్లు మమతకు 10 లక్షల పోస్టుకార్డులను పంపుతున్నారు. వాటిపై జై శ్రీరామ్‌ అని హిందీలో రాసి ఉంటుంది. దానికి ప్రతిగా తృణమూల్‌ జై బంగ్లా, జై హింద్‌ అని రాసిన 10 లక్షల పోస్టుకార్డులను మోదీకి, అమిత్‌ షాకు పంపడానికి ప్లాన్‌ చేసింది. ఇది యిప్పట్లో ఆగేట్లా లేదు.

(సమాప్తం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2019)
mbsprasad@gmail.com

Show comments