ఎమ్బీయస్‌: మోదీ విజయం - బెంగాల్‌ - 1/2

రాష్ట్రాలవారీ విశ్లేషణ బెంగాల్‌తోనే ఎందుకు మొదలుపెట్టాలి అనుకోవచ్చు. ఎందుకంటే మోదీ బెంగాల్‌ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. 42 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఉన్న ఆ రాష్ట్రాన్ని 17 సార్లు పర్యటించారు. 2015 నుంచి బెంగాల్‌ గెలవడానికి ప్రణాళికలు రచించారు. మమతా బెనర్జీ, మోదీల మధ్య వ్యక్తిగత వైరం ఉన్నట్లు యిద్దరూ ప్రవర్తించారు. మోదీ పని అయిపోయిందని, ప్రధాని పందెంలో తాను ముందువరుసలో ఉన్నానని మమతా తను నమ్మారో లేదో తెలియదు కానీ మనల్ని నమ్మించబోయారు. మోదీని ఎక్స్‌పైరీ బాబూ అన్నారు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న మోదీ ఆమెకు గుణపాఠం చెప్పడానికి నిశ్చయించుకున్నారు. మాయావతికి కూడా అలాటి ఆశలున్నాయి కానీ మరీ అంతగా బయటపడలేదు. ఫలితాలు రానీ అనుకున్నారు. మమత మాత్రం మేం 42 సీట్లూ గెలుస్తాం అని చెప్పుకుంటూనే తిరిగారు. చివరకి దిమ్మ తిరిగింది.

బిజెపికి యీ విజయం ఆకాశం నుంచి ఊడిపడలేదు. బాలాకోట్‌ మంత్రం జపించడం వలన సిద్ధించలేదు. కఠోర పరిశ్రమతో పాటు అనేక టక్కుటమార విద్యలు ప్రదర్శించవలసి వచ్చింది. (ఈ మాట అనగానే మోదీ భక్తులు గతంలో కాంగ్రెసు చేయలేదా? అంటూ కామెంట్స్‌ పెడతారు. అది వ్యర్థం. కాంగ్రెసు చేయని అకృత్యం లేదు. అందుకే దాని గతి అధోగతి అయింది. మేము వారి కంటె భిన్నం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చినవారు అదే బాటలో వెళుతున్నారు సుమా అని ఎత్తి చూపుతున్నానంతే. అప్పుడెప్పుడో ఆదర్శవంతంగా రాజకీయాలు చేసి చాలా నష్టపోయాం. అప్పణ్నుంచి కాంగ్రెసును ఆదర్శంగా తీసుకుని భ్రష్టులమై పోయాం అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఫిరాయింపులతో కాంగ్రెసు కూడా కొన్నాళ్లు వెలిగింది. ఇప్పుడు చీకటి కొట్లో మగ్గుతోంది. ఇప్పుడు బిజెపి వెలుగుతోంది. బలమైన ప్రత్యామ్నాయం వస్తే వారూ ఓ రోజు - అదెప్పుడో తెలియదు - చీకటి కొట్లోకి వెళ్లవలసి వస్తుంది.) ఎన్ని చేసినా మమత అహంకారం, అవినీతి వాళ్లకు దోహదపడినట్లు మరేదీ దోహద పడలేదు.

అప్పుడు తృణమూల్‌, ఇప్పుడు బిజెపి - పదేళ్ల క్రితం 2009లో వామపక్ష ప్రభుత్వం బెంగాల్‌ను ఏలుతున్నపుడు సింగూరు-నందిగ్రామ్‌ ఆందోళన ద్వారా రైతుబాంధవి అవతారం ఎత్తిన మమతా ఆ ఏడాది పార్లమెంటు ఎన్నికలలో 19 స్థానాలు గెలిచింది. మరో రెండేళ్లకు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయి, అప్పణ్నుంచి లెఫ్ట్‌ను తుడిచి పెట్టేసింది. ఇప్పుడు కథ పునరావృతమౌతోంది. ఎటొచ్చీ పాత్రధారులే మారుతున్నారు.  2014లో 17.4% ఓట్లతో 2 సీట్లు గెలుచుకున్న బిజెపి యీసారి 40.3% ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. మధ్యలో అసెంబ్లీ ఉపయెన్నికలలో 22% ఓట్లు తెచ్చుకుంది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికలలో, 2021 అసెంబ్లీ ఎన్నికలలో  తృణమూల్‌ను ఓడించి తీరతానంటోంది. 2009 ఓటమి తర్వాత లెఫ్ట్‌ కార్యకర్తలు పార్టీని అంటిపెట్టుకునే వున్నారు. ఇప్పుడు తృణమూల్‌ నాయకులు పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు. బిజెపి వారినలా ఉంచేట్లు లేదు. ఎడాపెడా తన పార్టీలోకి గుంజుకుంటోంది. అందువలన 2011కు ముందే అసెంబ్లీ ఎన్నికలు రావచ్చు.

బెంగాల్‌ను గెలిచే ప్రయత్నం నాలుగేళ్ల క్రితమే మొదలుపెట్టినా, ముకుల్‌ రాయ్‌ను తృణమూల్‌ నుంచి ఫిరాయింపు చేయడంతోనే బిజెపికి ఊపు వచ్చింది. పశ్చిమ యుపిలో బిజెపి ఇన్‌చార్జిగా ఉన్న శివ్‌ప్రకాశ్‌ను బెంగాల్‌కు పంపించినప్పుడు స్థానికులు ఎవరూ చేరలేదు. అప్పుడతను యుపి, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ల నుండి కార్యకర్తలను బెంగాల్‌కు తీసుకుని వచ్చి పని చేయించసాగాడు. కొన్ని నెలల్లో మార్పు వచ్చింది. స్థానికులు కూడా పార్టీలో చేరసాగారు. అప్పుడు అమిత్‌ షా అరవింద్‌ మేనోన్‌ అనే తన సన్నిహితుణ్ని వ్యూహకర్తగా బెంగాల్‌ పంపాడు. శివ్‌, అరవింద్‌, మధ్యప్రదేశ్‌ బిజెపి నాయకుడు కైలాశ్‌ విజయవర్గీయా కలిసి 15 వేల మందితో పార్టీ ఐటీ సెల్స్‌ తయారుచేశారు. సోషల్‌ మీడియాలో హిందూత్వతో సహా అనేక విషయాలపై మమతాను దుమ్మెత్తి పోయసాగారు.  

విభీషణుడి సాయం - ఏం చేసినా లోపలి గుట్టుమట్లు చెప్పే విభీషణులు లేనిదే యుద్ధం గెలవడం కష్టం. బిజెపికి దొరికిన విభీషణుడు ముకుల్‌ రాయ్‌. అతను యూత్‌ కాంగ్రెసు సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి మమతకు సన్నిహితుడు. 1998లో ఆమె కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తృణమూల్‌ పార్టీ పెట్టినపుడు అతనూ వచ్చి చేరాడు. పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర నిర్వహించాడు. భయపెట్టో, భ్రమ పెట్టో పార్టీలు మార్పించడంలో ఘనుడు. పంచాయితీ ఎన్నికలలో, మునిసిపల్‌ ఎన్నికలలో  లెఫ్ట్‌ నుంచి, కాంగ్రెసు నుంచి అనేకమంది కార్యకర్తలను లాక్కుని వచ్చి, పార్టీని బలోపేతం చేశాడు. పార్టీకి నిధులు సమకూర్చే క్రమంలో శారదా స్కాములో, నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లో యిరుక్కున్నాడు.

యుపిఏ1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా చేసిన మమత 2011లో ముఖ్యమంత్రి అయి, తన బదులు దినేశ్‌ త్రివేదిని రైల్వే మంత్రిని చేయమంది. అతను పాసింజర్‌ చార్జీలు పెంచడానికి సమ్మతించడంతో కాంగ్రెసుతో కుమ్మక్కవుతున్నాడన్న సందేహంతో అతన్ని పీకేసి, ముకుల్‌ను పంపించింది. ముకుల్‌, మమత అండ చూసుకుని మన్‌మోహన్‌ను కూడా ధిక్కరించాడు. చివరకు 2012 సెప్టెంబరులో మమత యుపిఏ నుండి వైదొలగడంతో ముకుల్‌ మంత్రి పదవి పోయింది. అయినా అతను మమతను అంటిపెట్టుకునే ఉన్నాడు. 2015లో శారదా స్కాములో అతని పేరు బయటపడడంతో, మమత అతన్ని కాస్త దూరం పెట్టసాగింది. 

ఫిరాయిస్తే కేసులు లేవు - బిజెపి యీ విషయం గ్రహించింది. సిబిఐ కేసులు చూపించి భయపెట్టి 2017 సెప్టెంబరులో ముకుల్‌ను తన పార్టీలోకి మార్పించింది. అతను పార్టీ మారుతూ తనకు తృణమూల్‌ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నాడు. ఇక అప్పణ్నుంచి తనతో బాటు శారదా స్కాములో, యితర క్రిమినల్‌ కేసుల్లో యిరుక్కున్న తృణమూల్‌ వారందరినీ 'బిజెపిలో చేరితే మీకు రక్షణ ఉంటుంది, లేకపోతే జైలు తప్పదు' అని బెదిరించి, లాలించి బిజెపిలోకి లాక్కుని రాసాగాడు. ఉదాహరణకి 11 క్రిమినల్‌ కేసులున్న నిశిత్‌ ప్రమాణిక్‌ అనే తృణమూల్‌ నాయకుణ్ని బిజెపి టిక్కెట్టిప్పించి కూచ్‌ బిహార్‌ నుంచి నిల్చోబెట్టాడు. అతను నెగ్గాడు కూడా! 

ఈ ఫిరాయింపులు ఆపడానికి మమత తనవంతు ప్రయత్నం చేసింది. ఘాటల్‌ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థినిగా పోటీ చేసిన మాజీ పోలీసు అధికారిణి భారతీ ఘోష్‌ ఒకప్పుడు ఆమెకు సన్నిహితురాలు. అయితే ఆమె ఎప్పుడైతే బిజెపిలో చేరింది. ఆమెపై పాత కేసులు బయటకు తీసి గంటల తరబడి ఇంటరాగేట్‌ చేయించింది. ఆ విధంగా ప్రచారం చేసుకోకుండా ఆపింది. అంతిమంగా భారతి ఓడిపోయింది. ముకుల్‌ తీసుకుని వచ్చినవారిలో అనుపమ్‌ హజ్రా, అర్జున్‌ సింగ్‌, సౌమిత్ర ఖన్‌ కూడా ఉన్నారు. 

సౌమిత్ర పార్టీ మారగానే ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల వద్ద డబ్బు వసూలు చేశాడన్న కేసు పెట్టించింది మమత. అతను విష్ణుపూర్‌ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా నిలబడితే ప్రచారం చేయడానికి నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని హైకోర్టు ఆంక్షలు విధించింది. అయినా అతను 78 వేల మెజారిటీతో నెగ్గేశాడు. ఈ గెలుపుకు తృణమూల్‌ నాయకుల అంత:కలహాలు కూడా తోడ్పడ్డాయట. అర్జున్‌ సింగ్‌ బారక్‌పూర్‌ నియోజకవర్గంలో తృణమూల్‌ అభ్యర్థి మాజీ రైల్వే మంత్రి దినేశ్‌ త్రివేదిని ఓడించేశాడు. బెంగాల్‌లో సంస్థాగతమైన బలం లేని బిజెపి ఇలా ఫిరాయింపులతో బలపడింది. మరింత బలపడడానికి ఫిరాయింపుల మార్గమే ఎంచుకుంది. 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మోదీ ప్రకటించారు కూడా. ఫలితాలు వచ్చాక ఒక పద్ధతి ప్రకారం పార్టీ మార్పిస్తున్నారు.

ఆర్థిక స్థితి అంశమే కాలేదు - నిజానికి నోట్ల రద్దు, జిఎస్‌టి వలన కుదేలైనది అవ్యవస్థీకృత (ఆన్‌-ఆర్గనైజ్‌డ్‌) రంగమే. బెంగాల్‌లో అత్యధికంగా ఉన్నది ఆ రంగమే. మోదీ కారణంగా దెబ్బ తిన్నారు కాబట్టి వాస్తవానికి ఆ కార్మికుల కుటుంబాలూ, చిన్నాచితకా వ్యాపారస్తులూ అందరూ బిజెపిని శిక్షించాలి. కానీ బిజెపిని యీ మేరకు గెలిపించడానికి గల కారణాలేమిటి? ఈ విషయం రాయగానే ఆర్థిక వ్యవస్థ మోదీ హయాంలో వెలిగిపోయింది అంటూ కామెంట్లు పెట్టకండి. దాని గురించీ సమాచారం బాగానే పోగేశాను. రాజకీయపరమైన విశ్లేషణలు పూర్తయ్యాక అవి మీతో పంచుకుంటాను. మొన్ననే మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ చెప్పేశారు - 2011-17 మధ్య జిడిపి లెక్కలన్నీ బోగస్సే అని. మసిపూసి మారేడు కాయ చేయడం కాంగ్రెసు మొదలుపెడితే బిజెపి దాన్ని కొనసాగించింది అని. రిజర్వ్‌ బ్యాంకు మార్చి 2019 అంకెలు దాచేయవలసిన అవసరం ఏమొచ్చింది? మాడభూషి శ్రీధర్‌ గారి వ్యాసాలు చదివితే సమాచార హక్కును మోదీ ప్రభుత్వం ఎలా కాలరాస్తోందో, వాస్తవాలు బయటకు రాకుండా ఎలా తంటాలు పడుతోందో పూర్తిగా తెలుస్తుంది.

బెంగాల్‌ సామాజిక స్థితి - తృణమూల్‌ యీసారి 43.3% ఓట్లతో 22 సీట్లు గెలుచుకుంది. ఇన్నే రావడానికి, ఇన్నయినా రావడానికి కారణాలున్నాయి. మమత పాలనలో బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. కానీ అభివృద్ధితో పాటే అక్కడ అవినీతి విపరీతంగా జరిగింది. ప్రతి చిన్నదానికి స్థానిక నాయకులకు ముడుపులు చెల్లించుకోవలసి వచ్చేది. జనాలకు అభివృద్ధి కంటె అవినీతే కంటికి ఆనింది. అక్కడ తృణమూల్‌ ఓడిపోయింది. అవినీతితో పాటు గూండాగిరీ కూడా జనాలను విసిగించింది. 

బెంగాల్‌కు రెండు ముఖాలున్నాయి. ఒకటి మేధోపరమైన, కళాత్మకమైన భద్రలోక్‌ వెరయిటీ. తక్కిన రాష్ట్రాల వారు యిది చూసే బెంగాల్‌ అంటే ముచ్చటపడతారు, గౌరవిస్తారు. కానీ బెంగాలీ సమాజంలో హింస కూడా ఎక్కువగా ఉంది. వ్యక్తిగతంగా పిరికివాడు కూడా మూకతో కలిస్తే పరమ హింసాత్మకంగా మారతాడు.  సామూహిక హింసలో ఉచితానుచితాలు మర్చిపోతారు. ఇది యిప్పుడే కాదు, ఎప్పణ్నుంచో వుంది. స్వాతంత్య్ర పోరాటంలో అహింస కంటె హింసను నమ్ముకున్నవారిలో బెంగాలీలు, పంజాబీలే ఎక్కువగా కనబడతారు. హిందూ-ముస్లిము కలహాలు సంభవించినపుడు చౌరీచౌరా సంఘటనే దేశం మొత్తాన్ని కదిలించింది. 

దేశవిభజన సమయంలో గాంధీ పంజాబ్‌కి వెళ్లలేదు, బెంగాల్‌ వెళ్లి అక్కడ శాంతి నెలకొల్పడానికి చూశాడు. ఎందుకంటే అక్కడే సమస్య తీవ్రరూపాన్ని దాల్చింది. రాజకీయాల్లో హింసను ప్రయోగించడానికి సంకోచించని కమ్యూనిస్టులు బెంగాల్‌ను తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. పరమహింసాత్మకమైన నక్సల్‌బరీ ఉద్యమం కూడా బెంగాల్‌లోనే పుట్టింది. ఎన్నికల సమయంలోనే కాదు, రాజకీయ ఊరేగింపుల సమయంలో కూడా హింస విపరీతంగా జరుగుతుంది.

నిరుద్యోగం, మామూళ్లు - స్వాతంత్య్రానికి పూర్వం బెంగాల్‌లో అనేక పరిశ్రమలు ఉండేవి. కానీ పోనుపోను కార్మికోద్యమాలు హింసాత్మకంగా మారడంతో పరిశ్రమలు తరలిపోసాగాయి. బొంబాయి, అహ్మదాబాద్‌లలో కూడా కార్మికోద్యమాలు జరిగాయి. కానీ అవి హింసాత్మకం కాకపోవడంతో పరిశ్రమలు నిలదొక్కుకున్నాయి. బెంగాల్‌లో హింస కారణంగా అందరూ దాన్ని దూరం పెట్టారు. కాంగ్రెసు రోజుల్లో మొదలైన యీ జాడ్యం యిప్పటికీ కొనసాగుతోంది. పరిశ్రమలు లేక నిరుద్యోగం ప్రబలింది. సగటు కలకత్తా వాసి వైట్‌ కాలర్‌ ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ, ఒళ్లొంచి పని చేయడానికి యిష్టపడకపోవడంతో ఆ స్థానాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన బిహారీలు, ఒడియాలు, యితరులు ఆక్రమించారు. 

ఈ నిరుద్యోగ యువత బెంగాల్‌కు పెద్ద సమస్య. వాళ్లు బయట రాష్ట్రాలకు వచ్చేస్తే బాగుపడతారు తప్ప అక్కడే వుంటే సమయం వ్యర్థం చేస్తూ, సమాజంపై విసుగు, కోపం ప్రదర్శిస్తూ ఏ చిన్న సందర్భం దొరికినా హింసకు పాల్పడతారు. తమ పొట్ట నింపుకోవడానికి దుర్గాపూజతో సహా అనేక పేర్లు చెప్పి చందాలు వసూలు చేస్తారు. ఏదో ఒక పార్టీకి ఫీల్డ్‌ ఫోర్స్‌గా పని చేస్తూ, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలు చేస్తూంటారు (దీన్ని అక్కడ తాలాబాజీ అంటారు). ఎన్నికల సమయంలో ఓటర్లను భయభ్రాంతులను చేస్తారు. ఓట్లు వేయకుండా అడ్డుపడతారు. వీరిని తృప్తి పరచడమే అక్కడి పార్టీల పని. గతంలో కాంగ్రెసు, కమ్యూనిస్టులు, యిప్పుడు తృణమూల్‌ వీళ్లని పెంచి పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు బిజెపి కొత్తగా వచ్చి చేరింది. 

ప్రభుత్వ సంక్షేమపథకాలు లబ్ధిదారుల నుండి వీళ్లు బెదిరించి డబ్బు తీసుకుంటారు. చౌక ఇళ్ల స్కీము ఐన నిజశ్రీ, నిరుద్యోగులకు భృతి నిచ్చే యువశ్రీ.. యిలా అన్నిటికీ వీళ్లకి డబ్బు యివ్వాల్సిందే.  కాలేజీలో ఎడ్మిషన్‌ కావాలన్నా, టీచరు ఉద్యోగం పొందాలన్నా వీళ్లను తృప్తి పరచాల్సిందే. వీళ్లు వసూలు చేసి పెద్ద నాయకులకు అందచేస్తూ ఉంటారు. ఓ స్థాయి వరకు ప్రజలు సహిస్తూ ఉంటారు. ఇది తృణమూల్‌ పాలనలో తారస్థాయికి చేరడంతో ప్రజలకు ఆగ్రహం కలిగింది. తృణమూల్‌ ఏర్పడ్డాక కాంగ్రెసు క్యాడరంతా తృణమూల్‌కు వచ్చి చేరింది. వారికి, కమ్యూనిస్టులకు మధ్య పోరాటం సాగుతూ ఉండేది. పోనుపోను కమ్యూనిస్టులు అధినాయకత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడంతో దిశానిర్దేశం చేసేవారు, ధీమా కలిగించేవారు కరువయ్యారు. తృణమూల్‌లో చేరితే రక్షణ సమకూరడంతో బాటు, డబ్బులు కూడా సంపాదించవచ్చని క్యాడర్‌లో సింహభాగం తృణమూల్‌లో చేరారు. ఇప్పుడు మొత్తమంతా కలిసి ప్రత్యర్థులను బెదిరిస్తూ రాజకీయంగా అరాచకాలకు పాల్పడుతున్నారు.

తృణమూల్‌ దాష్టీకం - 2018 జూన్‌లో పంచాయితీ ఎన్నికలు జరిగితే, 34% స్థానాల్లో తృణమూల్‌ అభ్యరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జరిగినదేమిటంటే ఎవరైనా నిలబడతానంటే వీళ్లెళ్లి బెదిరించారు. దాంతో నామినేషన్లు వేసినవారు కూడా బెదిరి ఉపసంహరించుకున్నారు. ఇలా రాష్ట్రమంతా అరాచకం సాగిస్తున్న మమతను ఎదుర్కునేవాళ్లు లేరా అని సామాన్యజనం అంగలారుస్తున్న కాలంలో బిజెపి రంగంలోకి దిగి, మేమూ హింసతో వాళ్లను అడ్డుకోగలం అని నమ్మకం కలిగించింది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న తీరులో అమిత్‌ షా మమత సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఒక మురికివాడకు వెళ్లి 'బూత్‌ చలో' ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇక అక్కణ్నుంచి ప్రతి పండగకు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, తమ కండబలాన్ని ప్రదర్శించారు.

బిజెపి సిద్ధాంతాలమీద ప్రేమ కంటె మమతను వదుల్చుకోవడానికి యిది మంచి అవకాశం అనుకున్న వాళ్లంతా బిజెపికి ఓటేశారు. మమతను అడ్డుకోలేక బావురుమంటున్న కమ్యూనిస్టు, కాంగ్రెసు కార్యకర్తలు కూడా యీసారి బిజెపికే ఓటేశారంటున్నారు. అందుకే 2014లో 23% ఓట్లు, 2 సీట్లు తెచ్చుకున్న సిపిఎం యీసారి 6.3% ఓట్లు, 0 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలాగే కాంగ్రెసు 2014లో  9.7% ఓట్లు, 4 సీట్లు తెచ్చుకుంటే యీసారి 5.6% ఓట్లు, 2 సీట్లు తెచ్చుకుంది. దీని కారణంగా మొత్తం 294 అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి 129 గెలిచింది. తృణమూల్‌ 158టిలో గెలిచింది. దీనితో బాటు జరిగిన 8 అసెంబ్లీ ఉపయెన్నికలలో బిజెపికి 4, తృణమూల్‌కు 3, కాంగ్రెసుకి 1 వచ్చాయి.

(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2019)
mbsprasad@gmail.com

Show comments