ప్రియాంక బరిలోకి దిగితే మోదీకి భయమేనా?

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి కమ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని చూస్తే ప్రధాని నరేంద్రమోదీ భయపడతారా? శక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ అంటూ బీజేపీ నేతలు అదేపనిగా పొగుడుతుండగా, ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీని చూస్తే ఎందుకు భయపడతారు? రాజకీయాల్లో ఆమె సీనియర్‌ కాదు. ఎలాంటి పదవులు నిర్వహించిన అనుభవం లేదు. నిజమే కాని.. సీనియర్‌ కాకపోయినా, పదవులు లేకపోయినా భారత రాజకీయాలను ఎంతో ప్రభావితం చేసిన, ఇంకా చేస్తున్న నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన మహిళ. ఇదే ఆమెకున్న ప్రధాన అర్హత, ఆకర్షణ, ఆదరణ. యూపీ అసెంబ్లీ ఎన్నికల వరకు తల్లి, సోదరుడి నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైన ప్రియాంక ఈ లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే యోచన చేస్తున్నారు. అది కూడా ఏ సాదాసీదా నియోజకవర్గం నుంచో కాకుండా మరోసారి ప్రధాని పదవిని చేపడతారని అనుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ పోటీచేస్తున్న యూపీలోని వారణాశి నుంచే పోటీ చేయవచ్చనే వార్తలొస్తున్నాయి.

అదే నిజమైతే ఆమె చరిత్ర సృష్టించినట్లే. వారణాశి నుంచి పోటీచేయాలనే ఆమె ఆలోచన సాకారం కావాలంటే అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి. అధిష్టానమంటే తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ గాంధీ. రాహుల్‌ తన సొంత నియోజకవర్గమైన అమేథీ నుంచే కాకుండా, కేరళలోని వాయ్‌నాడ్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నప్పుడు ప్రియాంక ఎందుకు పోటీ చేయకూడదని కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే కాంగ్రెసుకు స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన ప్రియాంక పోటీచేస్తే ప్రచారానికి దెబ్బ తగులుతుందని కొందరి అభిప్రాయం. అయితే మోదీని ఢీకొనాలంటే అందుకు తగిన వ్యక్తి ప్రియాంక గాంధీయేనని కొందరు చెబుతున్నారు. కాంగ్రెసుకు నరేంద్ర మోదీయే ప్రధాన ప్రత్యర్థి. అందులోనూ ఈ ఎన్నికలు మోదీ-రాహుల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. కాబట్టి వారణాశిలో ప్రియాంకను పోటీ చేయించడమే మంచిదని కొందరు నాయకులు అధిష్టానానికి సలహా ఇస్తున్నారు.

ఇదే జరిగితే నరేంద్రమోదీ ముందుజాగ్రత్తగా మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని వదోదర నుంచే కాకుండా, వారణాశి నుంచి కూడా పోటీచేశారు. రెండుచోట్లా విజయం సాధించిన ఆయన వారణాశిని ఉంచుకొని వదోదరకు రాజీనామా చేశారు. కాని ఈసారి ఆయన ఆ పని చేయలేదు. మళ్లీ ఎన్‌డీఏ బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకంతో, అంచనాతో కేవలం వారణాశి నుంచే పోటీ చేస్తున్నారు. ప్రతిపక్షాలు నిలబెట్టే అభ్యర్థి తనముందు చిత్తు కావల్సిందేనని ఆయన ధీమా. కాని ఇప్పుడు వారణాశి నుంచి ప్రియాంక పోటీ చేయవచ్చనే వార్తల నేపథ్యంలో ఆయన మరో సురక్షిత నియోజవర్గంపై దృష్టి పెట్టినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. ప్రియాంక ప్రభావంతో వారణాశిలో ఓడిపోయినా మరోచోట గెలుపు సాధించవచ్చు కదా.!

కాంగ్రెసు నాయకులు మాత్రం ప్రియాంక పోటీపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇంత కాలానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆమె లోక్‌సభలోకి కూడా ప్రవేశించాలని కోరుకుంటున్నారు. కాని సోనియా, రాహుల్‌ ఇప్పటివరకు ఈ నిర్ణయమూ తీసుకోకుండా ఊగిసలాడుతున్నారు. మే 19న ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి సమయం కూడా ఎక్కువగా లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో వారణాశిలో నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పోటీచేసి 3.71 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కూటమి ఇప్పటివరకు అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇందుకు కారణం ఆ స్థానాన్ని కాంగ్రెసుకు వదిలిపెట్టాలనే ఆలోచన చేయడమే. కాంగ్రెసు కూడా ఎస్‌పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పోటీచేస్తున్న ఆజంఘర్‌లో అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ అవగాహన నేపథ్యంలో ప్రియాంకను మోదీకి వ్యతిరేకంగా  పోటీ చేయించేందుకు ఇదో మంచి అవకాశమని కాంగ్రెసు నాయకుల భావన. గెలుపోటములను పక్కనపెడితే ఆమె పోటీ కాంగ్రెసు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్‌డీఏ స్టార్‌ క్యాంపెయినర్‌గా నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఆయనను దేశంలోని ఇతర  ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొననీయకుండా చేయాలంటే, వారణాశికే పరిమితం చేయాలంటే ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెసు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
-నాగ్‌ మేడేపల్లి

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments