రాజకీయంలో నమ్మకం.. నమ్మకంతోనే రాజకీయం

ప్రజలైనా, కార్యకర్తలైనా, అనుచరులైనా.. నమ్ముకున్నవారికి న్యాయంచేయడం అనేది వైఎస్సార్ పాలసీ. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆయన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలంటే లాభనష్టాల బేరీజు కాదు అనేది జగన్ నమ్మకం. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు నవరత్నాల కానుక అందించబోతున్నారు. తనకు మద్దతు తెలిపి, పదవులు, టికెట్లు ఆశించకుండా పనిచేసిన వారికి నామినేటెడ్ పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు కూడా ఫిక్స్ చేశారు జగన్.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ఎంపిక చేసిన ముగ్గురి నేపథ్యాలు పరిశీలిస్తే, రాజకీయ వ్యూహాల కంటే తనను నమ్ముకున్న వాళ్లకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాంటి పోటీ లేకుండా గ్యారెంటీగా గెలిచే అవకాశమున్న 3 ఎమ్మెల్సీ పదవులకు వైసీపీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. కోట్లకు కోట్లు కుమ్మరించే బడా పారిశ్రామిక వేత్తలు కూడా క్యూలో ఉన్నారు. కానీ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయాలు చేయదలుచుకోలేదు. కష్టకాలంలో తనకు, పార్టీకి అండగా నిలబడ్డవారికి న్యాయం చేయాలనుకున్నారు, చేస్తున్నారు.

అక్రమ కేసుల కారణంగా జగన్ తో సహా.. మోపిదేవి వెంకటరమణ గతంలో జైలు జీవితం గడిపారు. కానీ ఎక్కడా ఎప్పుడూ జగన్ ని పల్లెత్తుమాట అనలేదు సరికదా అధికార పార్టీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా జగన్ వెంటే నడిచారు. తొలినుంచి పార్టీకి అండదండగా ఉన్నారు. రేపల్లె నుంచి గెలిస్తే మోపిదేవికి సామాజిక వర్గాల సమీకరణలో మంత్రిపదవి గ్యారెంటీ అని అనుకున్నారంతా. కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా మంత్రిని చేసి జగన్ తన పెద్దమనసు చాటుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నారు.

ఇక మైనార్టీ నేత ఇక్బాల్. రాయలసీమ ఐజీగా రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్. ఎన్నికల ముందు ఏడాది వైసీపీలో చేరారు. కర్నూలుకు చెందిన ఈయన, జగన్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అప్పటి సీఎం చంద్రబాబు బావమరిదిపై పోటీకి దిగారు. టీడీపీకి పెట్టనికోట హిందూపురం. అందులోనూ బాలయ్య తరపున కోట్లకు కోట్లు కుమ్మరించారు, వీటన్నిటికి తోడు సొంతపార్టీ నేతలు కొందరు ఇక్బాల్ కి వెన్నుపోటు పొడిచారు. దీంతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే జగన్ మాత్రం ఆయన్ను మరచిపోలేదు. ఆయన విధేయతకు, విశ్వాసానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభకు పంపిస్తున్నారు.

ఇక మూడో వ్యక్తి చల్లా రామకృష్ణారెడ్డి. ఈయన కూడా ఎన్నికల ముందు వైసీపీలో టికెట్ ఆశించి చేరారు. గెలుస్తాడనే నమ్మకం ఉన్నా కూడా చల్లాకు జగన్ టికెట్ ఇవ్వలేదు. అధికారపక్ష ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు తనవెంటే నడిచిన వారికే కర్నూలు జిల్లాలో టికెట్లు కేటాయించారు జగన్. అయితే చల్లా మాత్రం జగన్ మాటకు కట్టుబడి పార్టీ కోసం పనిచేశారు. సో.. ఆ నమ్మకానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టం కడుతున్నారు సీఎం జగన్.

ముగ్గురు, మూడు నేపథ్యాల నుంచి వచ్చినవారు, ఒకరు తొలి నుంచీ పార్టీలో ఉన్నారు, ఒకరు మధ్యలో వచ్చిన ప్రభుత్వ అధికారి, ఒకరు ఎన్నికల ముందు పార్టీ మారిన ప్రత్యర్థి నేత. కానీ ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే. విధేయత-విశ్వసనీయత. అవే ఇప్పుడు వీళ్లను ఎమ్మెల్సీలను చేస్తున్నాయి. వైసీపీకి సంఖ్యాబలం ఉండడంతో వీళ్లు ఈజీగానే ఎమ్మెల్సీలు అవుతారు.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!