కేసీఆర్ ఈ సారీ.. ఎమ్మెల్యేలకు కండువాలు!

గత పర్యాయంలోనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించాడు కేసీఆర్. గత ఎన్నికల ఫలితాలు రాగానే కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ వాకిట్లో చేరిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే చివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు మినహాయిస్తే.. అంతా తెరాసలోకి చేరిపోయారు. బీఎస్పీ తరఫున నెగ్గినవాళ్లు తెరాసలోకి చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వారు కూడా చేరారు. కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు కూడా మిగల్లేదు. ఆ స్థాయిలో తెలంగాణలో ఫిరాయింపుల పర్వం సాగింది.

అలాంటి ఫిరాయింపుదారుల్లో దాదాపు అందరికీ తెరాస తరఫున పోటీచేసే అవకాశం వచ్చింది. కొందరు గెలిచారు, కొందరు ఓడారు. తెలంగాణకు వెళ్లి చంద్రబాబు నాయుడు ఫిరాయింపుదారులను ఓడించమని పిలుపునిచ్చాడు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన పట్ల తెరాస వాళ్లు విరుచుకుపడ్డారు. “నీకు సిగ్గుందా?’ అని వారు ప్రశ్నించారు. దానికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు అనుకోండి.

ఏపీలో ఫిరాయింపుదారులను మంత్రులుగా చేసిన చంద్రబాబు.. తెలంగాణలో అలాంటి వాళ్లను ద్రోహులుగా అభివర్ణించాడు. ఆ తీరుకు బాబు మూల్యం చెల్లించుకున్నాడు. ఇక ఈసారి కూడా కేసీఆర్ వచ్చేవారికి కండువాలు వేస్తాడని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ తరఫున పంతొమ్మిది మంది గెలిచారు. వీరిలో కొందరు తెరాసలోకి ఖాయంగా ఫిరాయించే అవకాశాలున్నాయి.

తెలుగుదేశంలో ఇద్దరు గెలిచారు.. వారిలో ఒకరైనా తెరాసలోకి చేరిపోవచ్చు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒకరు తెరాసలోకి చేరేందుకు రెడీ అని ప్రకటించాడు. ఎంఐఎం వాళ్లు మిగులుతారు, బీజేపీ ఎమ్మెల్యే మిగలవచ్చు. వీరుగాక మిగతా ఎమ్మెల్యేల్లో మాత్రం ఎంతమంది తెరాసలోకి పోకుండా వారి పార్టీల వైపే నిలబడతారు అనేది ప్రశ్నార్థకం!

Show comments