ఓ ఫైవ్ ఉంటే అప్పివ్వు గురూ.. ఎమ్మెల్యే దేబిరింపు

బాగా బతికిన కుటుంబం, అందరికీ రాజకీయంగా ఆదర్శంగా ఉన్న కుటుంబం. పైగా తాను కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికల్లో తన తరపున ప్రచారం కోసం హీరోయిన్లను సైతం పిలిపించిన నేపథ్యం. కానీ ఆయనకు ఓ అలవాటుంది. తెలిసినవాళ్లు కనిపిస్తే "ఓ ఫైవ్ అప్పివ్వు గురూ" అనేస్తారు. ఫైవ్ అంటే ఇక్కడ 5వేలు కాదు, అక్షరాలా 5 లక్షలు. ఎమ్మెల్యే గారు కదా అని ఎవరైనా పలకరించి ఫోన్ నెంబర్ ఇచ్చి పుచ్చుకుంటే.. కచ్చితంగా మరుసటి రోజు ఫోన్ వస్తుంది, 'ఫైవ్ ఉంటే సర్దు గురూ' అని. అందుకే ఆయన్ని అందరూ లోకల్ గా అప్పుల అప్పారావ్ అని పిలుచుకుంటారు.

కోస్తా జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే.. అప్పుల అప్పారావ్ గా లోకల్ లో బాగా ఫేమస్. అంత మాత్రాన ఆయనేమైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నారనుకుంటే పొరపాటే. స్థిరాస్థులు బాగానే ఉన్నాయి. కానీ చరాస్తులనే కరిగించేశారని అంటారు. హైదరాబాద్, బెంగళూరు వెళ్లడం.. అక్కడే కాస్త విలాసంగా గడిపి తిరిగి రావడం ఆయనకు బాగా అలవాడు. ఆ విలాసాల్లో ఆస్తులన్నీ కులాసాగా కరిగిపోయాయి.

అయితే ఆస్తులు కరిగిపోక ముందు నుంచీ ఆయనకు ఈ అలవాటుంది. ఇప్పుడది గ్రహపాటుగా మారింది. అందుకే సాయంత్రం అవ్వగానే సరదాగా తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడం, అప్పు అడగడం ఆయన దినచర్యలో ఓ భాగం. ఆ మధ్య సినిమావాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ నేత.. ఇండస్ట్రీలో కూడా కొంతమంది నుంచి 'అప్పులు' తీసుకున్నారు.

తిరిగిచ్చేసే బాపతేనా..?

అర్జంట్ గా పనిపడింది, రేపటికల్లా తిరిగిచ్చేస్తా అని ఎవరైనా అప్పు అడిగితే కచ్చితంగా సందేహించాల్సిందే. రేపటికల్లా ఇచ్చేస్తాననేవాడు ఈ ఒక్కరోజు ఆగలేడా..? సదరు ఎమ్మెల్యే వ్యవహారం కూడా ఇంతే. తిరిగిచ్చేస్తానంటూ డెడ్ లైన్లు పెట్టి మరీ అప్పు తీసుకుంటారు, ఆ తర్వాత మొహం చాటేస్తారు. చిన్నా పెద్దా చాలామంది బాధితులు ఆయన బారినపడి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మరికొంతమంది రాజకీయం అడ్డు పెట్టుకుని ఎంతో కొంత సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఎమ్మెల్యేను ఏం అడుగుతామంటూ లోలోపల పిసుక్కుంటున్నారు.

ఇటీవల మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఆ సీనియర్ ఎమ్మెల్యే.. సొంత పార్టీ నేతల్ని కూడా వదిలిపెట్టరు. ఏదో ఒక రాజకీయ ఫేవర్ చేస్తానంటూ అందినకాడికి దండేస్తుంటారట. ఆమధ్య సొంత పార్టీ నేత అక్రమ వసూళ్లకు పాల్పడుతూ నేరుగా పట్టుబడితే.. తనకు వాటా ఉందనే విషయం బయటపడకుండా తప్పించుకున్నారు. ఇక వరదలు, ఇతర విపత్తులు వచ్చినప్పుడు కూడా ఓ రేంజ్ లో ఫండ్ రైజింగ్ ఉంటుందట. బాధితుల లిస్ట్ లో తన పేరు కూడా కలిపేసుకుని భారీగానే వసూళ్లు చేస్తారని లోకల్ గా ప్రచారం నడుస్తోంది.

ఆర్థికంగా అవసరం ఉన్నప్పుడు అప్పు అడగొచ్చు కానీ, ఇలా అవసరం ఉన్నా లేకపోయినా.. అప్పివ్వండి అంటూ వెంటపడే బాపతు మనుషులు కొంతమంది ఉంటారు. రాజకీయ నాయకుల్లో ఉన్న ఆ బాపతు ఎమ్మెల్యేనే ఈ అప్పుల అప్పారావ్. బహుశా రాజకీయాల్లో ఆయన సృష్టించుకున్న కొత్త దందా ఏమో ఇది.

Show comments