అడ్డగోలుగా పరువు తీస్తున్న అనిల్!

పోలవరం రీటెండర్ల విషయంలో నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మీడియాలో రివర్స్ టెండర్ల వ్యవహారం మీద ఒకరకం అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు.. అయితే వాటిని నివృత్తి చేయాలి- అవి అర్థరహితమైన ఆరోపణలని భావిస్తే వాటిని పట్టించుకోకుండా వదిలేయాలి. అయితే.. ఆరోపణలకు జవాబిస్తూ.. తర్కబద్ధమైన జవాబు చెప్పడంలో విఫలమై.. మరింతగా ప్రభుత్వం మీద అనుమానాలు రేకెత్తేలా ఆయన వ్యవహరిస్తున్నారు.

రివర్స్ టెండర్ల విధానంలో ఒక లోపం ఉన్నదని.. దీనిద్వారా టెండర్లను అయినవారికే కట్టబెట్టుకోవడానికి ఆస్కారం ఎక్కువని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. బిడ్‌లో పాల్గొనదలచిన కాట్రాక్టర్లకు అర్హత ప్రమాణాలను ముందే నిర్ణయించకుండా.. ఎల్1 కాంట్రాక్టరును ఎంపికచేసిన తర్వాత.. అర్హతలను ప్రకటించే విధానం వలన... అయినవారికే కట్టబెట్టేందుకు అవకాశం ఎక్కువని ఈనాడు కథనంలో పేర్కొన్నారు. దీనికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్లో ఎక్కడా.. ఈనాడు ఆరోపిస్తున్న అసలు పాయింట్ కు సమాధానం లేదు.

బిడ్ లు పిలిచేప్పుడే.. అర్హతలను ఎందుకు పేర్కొనడంలేదో ఆయన చెప్పలేదు. ఎల్ 1ను నిర్ణయించిన తర్వాత.. అర్హతలను ప్రకటించడం వల్ల.. ఏ రకంగా పారదర్శకత వస్తుందో, వక్రకేటాయింపులు జరగకుండా అడ్డుకోవడం ఎలా సాధ్యమవుతుందో ఆయన చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వానికి, సీఎం జగన్మోహనరెడ్డికి అయినవాళ్లు, బంధువులు ఎవరూలేరు. టెండర్లు పూర్తయ్యాక ఎవరు పని దక్కించుకుంటారో ఎవరికీ తెలియదు. అంటూ వివరణ ఇచ్చారు. టెండర్లు పూర్తికాకుండానే.. అయినవాళ్లు ఎవరూ లేరనేమాట మాత్రం ఆయన ఎలా చెప్పగలరో అర్థంకాని సంగతి.

అయినా ఈనాడు కథనంలో పేర్కొన్నది.. అర్హతలను ముందుగా ప్రకటించాలనే మార్గదర్శకాలను ఉల్లంఘించడం వలన ఎలాంటి పర్యవసానం ఉంటుందన్నది మాత్రమే. అర్హతలను ముందుగా ఎందుకు పేర్కొనలేదో మంత్రి వివరణ ఇస్తే సరిపోయేది. ఆ అసలు ఆరోపణకు సూటిగా జవాబివ్వకుండా డొంకతిరుగుడు మాటలతో ఆయన ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నారు. నిజానికి రివర్స్ టెండర్ల ద్వారా జగన్ సర్కారు వ్యయం తగ్గించగలిగితే... అందరికంటె ఎక్కువగా ప్రజలు సంతోషిస్తారు. అప్పుడిక.. ఎవరు చేసిన ఆరోపణలకూ విలువ ఉండదు. కానీ అప్పటిదాకా అనుమానాలు ప్రబలకుండా చూడడం.. మంత్రుల విధి.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?