మీ.. టూ.. వివాదం ఎక్కడిదాకా.?

ఎప్పుడో పదేళ్ళక్రితం నాటి వివాదం.. ఇప్పుడు బాలీవుడ్‌ని కుదిపేస్తోంది. నానా పటేకర్‌, తనను అప్పట్లో లైంగికంగా వేధించాడన్నది తనూశ్రీదత్తా ఆరోపణ. అప్పట్లోనే ఆమె, నానా పటేకర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆమెకు న్యాయం జరగలేదట. అయితే, ఇప్పుడు తాను పెదవి విప్పడం ద్వారా, వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది తనతో గొంతు కలుపుతుండడం పట్ల తనూశ్రీదత్తా హర్షం వ్యక్తం చేస్తోంది.

తనూశ్రీ దత్తాతోపాటు, చాలామంది 'మీ..టూ..' అంటూ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళం విప్పుతున్నారు. నానా పటేకర్‌, అలోక్‌ నాథ్‌, సాజిద్‌ ఖాన్‌.. వీళ్ళంతా ప్రస్తుతానికి నిందితులు. అయితే, వీరిపై ఆరోపణలు నిరూపితం కావాలి.

ఇప్పటికే కొందరు పరువు నష్టం దావా వేశారు, తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి. 'మీ..టూ..' వివాదంపై కేంద్రం ఎట్టకేలకు స్పందించిందిగానీ, ఈ స్పందనతో బాధితులకు ఒరిగేదేమీ లేదన్నది ఓపెన్‌ సీక్రెట్‌. సాక్షాత్తూ కేంద్ర మంత్రిపై 'లైంగిక వేధింపుల' ఆరోపణలు వచ్చినా, ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ పెదవి విప్పకపోవడం ఆశ్చర్యకరం.

మామూలుగా, ఇంత సీరియస్‌ ఆరోపణలు వస్తే.. 'రాజీనామా చేయాల్సిందే..' అనే డిమాండ్లు విపక్షాల నుంచి రావడం, తప్పనిసరి పరిస్థితుల్లో 'పదవుల్లో వున్నవారు' రాజీనామాలు చేయడం, తమ సచ్ఛీలతను నిరూపించుకుంటే, తిరిగి ఆ పదవుల్లోకి రావడం జరుగుతుంటుంది. కానీ, ఇక్కడ అలాంటిదేమీ జరగడంలేదు.

నిజానికి, 'మీ..టూ..' అనేది సున్నితమైన, గంభీరమైన అంశం. సినీ పరిశ్రమలోనే కాదు, ఎక్కడైనా లైంగిక వేధింపులనేది ఓ జాడ్యంగానే భావించాల్సి వుంటుంది. కానీ, జరిగిన ఘటనకు సంబంధించి ఆధారాలు కొన్నేళ్ళ తర్వాత చూపించాల్సి వస్తే ఎలా.? చాలా కేసులు కోర్టుల్లో మగ్గుతూనే వుంటాయి. ఏళ్ళ తరబడి ఆయా కేసుల్లో శిక్షలు పడవు.. శిక్షలు పడినా, ఆ తర్వాత పై కోర్టులు కొట్టేసే అవకాశం వుంటుంది. సో, ఓ సారి దోషి అని డిక్లేర్‌ అయిపోతే సరిపోదన్నమాట.

మరెలా, 'మీ..టూ..' ఉద్యమం ఏం సాధిస్తుంది.? అనంటే, జరిగిన ఘటనలకు సంబంధించి ఎంతమంది నిందితులకు శిక్షలు పడతాయోగానీ, ఇకపై లైంగిక వేధింపులకు ఎవరూ సాహసించరన్నది మెజార్టీ అభిప్రాయం.

ఆ అభిప్రాయమే నిజమైతే, 'నిర్భయ' ఘటన తర్వాత 'నిర్భయ చట్టం' వచ్చినా, హత్యాచారాలు దేశంలో ఎందుకు తగ్గడంలేదు.? ఇదీ ఆలోచించాల్సిన విషయమే కదా. సమాజంలోంచి కొన్ని జాడ్యాల్ని పెకిళించి వేయాల్సిందే.. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అన్నదే అసలు ప్రశ్న.

Show comments