మీటూ ఫైట్‌: లీగల్‌ యాక్షన్‌ బై అక్బర్‌

'మీ.. టూ..' అంటే దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులపై మహిళా లోకం ఒక్కటవుతోంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌పై పలువురు మహిళలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు మాత్రమేకాదు, ఆయన ఎప్పుడెలా తమను వేధించారో పేర్కొంటూ పెద్దయెత్తున కథనాల్ని రాస్తున్నారు. వారంతా ఒకప్పుడు సీనియర్‌ పాత్రికేయుడిగా, ఓ పత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన దగ్గర పనిచేసిన జర్నలిస్టులే.

ప్రియా రమణి అనే జర్నలిస్ట్‌ అయితే, ఎంజే అక్బర్‌ తనతో ప్రవర్తించిన హేయమైన తీరు గురించి పుంఖాను పుంఖాలుగా కథనాలు రాస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌గా, ఎడిటర్‌గా ఆయన్ని అభిమానించిన తాను, ఆయన చర్యలపట్ల ఆశ్చర్యానికి గురయ్యాననీ, ఆయన తనను లైంగికంగా వేధించడాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆ కథనాల్లో పేర్కొన్న విషయం విదితమే. మొత్తం ఐదుగురు మహిళలు ఇలా ఎంజే అక్బర్‌పై ఆరోపణలు చేశారు.

అయితే, ఈ ఆరోపణల్ని లైట్‌ తీసుకున్న ఎంజే అక్బర్‌, తనపై కొందరు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగలేదు, ఆయన తనపై ఆరోపణలు చేసినవారికి లీగల్‌ నోటీసులు కూడా పంపారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరిస్తున్నారంటూ ఈ నోటీసుల్లో ఎంజే అక్బర్‌ పేర్కొన్నారు.

కాగా, లీగల్‌ నోటీసులకు చట్టబద్ధంగానే సమాధానం చెబుతామంటున్నారు బాధిత మహిళలు. బాలీవుడ్‌ నటి తనూశ్రీదత్తా, తనపై నటుడు నానా పటేకర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించాక దేశంలో 'మీ టూ' ఉద్యమం ఊపందుకున్న విషయం విదితమే.

ఈ 'మీ..టూ..' ఉద్యమం దెబ్బకి బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌, 'హౌస్‌ఫుల్‌-4' సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి నానా పటేకర్‌ కూడా గుడ్‌ బై చెప్పేయక తప్పలేదు. మహిళల్ని వేధించేవారితో తాము పనిచేయలేమంటూ అక్షయ్‌కుమార్‌, అమీర్‌ఖాన్‌ తదితరులు సోసల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి