Me Too: అందరూ దొంగలే!

అందరూ దొంగలే.. ఈ విషయంలో సందేహంలేదు. అయితే దొరికినోళ్లు మాత్రమే నిందల పాలవుతారు. బాలీవుడ్ సర్కిల్స్ లో రేగిన ఈ తుఫాన్ ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వివాదం సుడిలో చిక్కుకున్న వాళ్లు కొందరే. ఇంకా ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే ముగియదని.. కొన్నినెలల పాటు ఈ వ్యవహారం సీరియల్ లా కొనసాగే అవకాశం ఉందని ఖాయంగా చెప్పవచ్చు.

ఇలాంటి వ్యవహారాలు ఇదివరకూ వెలుగులోకి వచ్చినప్పుడు అవంత తేలికగా సద్దుమణగలేదు. రాద్ధాంతాలుగానే నిలిచాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇప్పుడు ఒకరిద్దరు కాదు.. చాలామందే స్పందించారు కాబట్టి.. బాలీవుడ్ ప్రముఖులపైనే ఈ వివాదాలు రేగాయి కాబట్టి.. ఇవి సంచలనం అవుతున్నాయి.

అయితే ఈ వ్యవహారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ టు వ్యవహారంలో అమితాబ్ బచ్చన్ కే వార్నింగ్ ఇచ్చేంత స్థాయిలోకి వెళ్లారు నటీమణులు. కాబట్టి.. ఇంకా మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టే.

ఇక ఈ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. వీరిలో ఒకరైన సుభాష్ ఘయ్ అయితే.. పరువు నష్టం దావా హెచ్చరిక చేశాడు. ఈ బాలీవుడ్ షో మ్యాన్ పై అత్యాచారం ఆరోపణలు చేసింది ఒక తార. ఇలాంటి నేపథ్యంలో ఘయ్ స్పందిస్తూ చట్టపరంగా నిరూపించకపోతే చట్టపూర్వకమైన చర్యలకు రెడీగా ఉండాలని అన్నాడు.

ఇక సాజిద్ ఖాన్ కూడా తను కేవలం నిందితుడినే.. దోషిని కాను అంటున్నాడు. అప్పుడే తన విషయంలో తీర్పులివ్వొద్దు అని అంటున్నాడు. ఇలా సాగుతోంది ఈ వ్యవహారం. ఇక ఈ వ్యవహారంతో సోషల్ మీడియా నెటిజన్లకు కూడా మంచి మసాలానే దొరికింది. బాలీవుడ్ మీడియా కూడా ఈ వివాదాలతో పండగ చేసుకుంటోంది. ఎంచక్కా తీర్పులు ఇచ్చేస్తోంది.

Show comments