ఎమ్బీయస్‌ - అవినీతిరహిత పాలన సాధ్యమా?

ఆంధ్రలో గెలవగానే జగన్‌ ఆర్నెల్లు, ఏడాదిలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. తనపై అవినీతిపరుడనే ముద్ర ఉన్న కారణంగానే సమాజంలో కొన్ని వర్గాలు దూరంగా ఉంటూ వచ్చాయని, తద్వారా అధికారం అందకుండా పోయిందని జగన్‌కు తెలుసు. తనపాలన మొదలు కాగానే అదిగో అవినీతి జరిగిపోతోంది, తినేశారు, బొక్కేశారు అనడానికి మీడియా రెడీగా ఉందనీ తెలుసు. అందుకని అవినీతి లేని పాలన అందిస్తానని, అవినీతికి ఆలవాలమైన టెండరు వ్యవస్థను మార్చేస్తాననీ బహిరంగంగా ప్రకటించడంతో బాటు, దానికి అందరూ సహకరించాలని తన అనుచరులకు ఖండితంగా చెప్తున్నాడట.

ఇటువంటి వార్తలు విన్నపుడు మనకు పెదాల పైన సన్నగా చిరునవ్వు మొలుస్తుంది. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో, ముఖ్యంగా కొత్తగా అధికారం దక్కిన కొత్తల్లో ఇలాంటి ఆదర్శాలు, ప్రకటనలు, వినబడతాయి. డిఎంకె, ఎడిఎంకె, జనతా, తెలుగుదేశం... ఇలాటి పార్టీలన్నీ అధికారంలోకి వస్తూ ఈ విషయంలో హడావుడి చేశాయి. ఆడంబరాలు ఉండకూడదని, సన్మానసభలు వద్దని, సెక్రటేరియట్‌లో దళారులు రాకూడదని.. ఇలా చాలా హంగామా ఉండేది. కొన్ని మెరుపుదాడులు కూడా ఉంటాయి. కొందరు మంత్రులు పొద్దున్నే ప్రభుత్వాఫీసులకు వెళ్లి హాజరుపట్టీ ముందేసుకుని నలభైశాతం మంది ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారని కనిపెడతారు. మరికొందరు ఆసుపత్రులకు వెళ్లి అక్కడ నకిలీ మందులిస్తున్నారని కనిబెడతారు.

పరిస్థితి ఇలా ఉందని అధికారంలో వచ్చే ముందు నుంచీ వాళ్లకు తెలుసు. అయినా కొత్తగా కనిపెట్టినట్లు ఓ తమాషా చేస్తారు. వెంట మీడియాను తీసుకెళ్లి తనిఖీలు చేస్తున్నారు కాబట్టి పబ్లిసిటీ స్టంటుగా చేస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఫాలో-అప్‌ చర్యలు తీసుకున్నట్లు మళ్లీ పేపర్లలో రాదు. ఉద్యోగులను మందలించారు, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కమ్మనమని హితోపదేశం చేశారు అంటారంతే! వీళ్ల ఉద్దేశం ఏమిటంటే - తాము అధికారంలోకి వచ్చాం కాబట్టి అధికారగణమంతా సవ్యంగా, సక్రమంగా, లంచాలు తీసుకోకుండా పనిచేయాలని!

వీళ్లనుచూసి ఉద్యోగులు నవ్వుకుంటారు. మంత్రిగా పూర్ణాయుర్దాయం ఐదేళ్లు. సగటు ఆయుర్దాయం మూడు, మూడున్నరేళ్లు - బాగా పనిచేసినా, చేయకపోయినా శాఖ మారుతుంది కాబట్టి! మరి ఉద్యోగిది 35, 40 ఏళ్లు! లంచాలు తీసుకోకపోయినా, తీసుకున్నా పట్టుబడకపోయినా, చివరివరకు ఉద్యోగం ఉండడం ఖాయం. ఆ భరోసా రాజకీయనాయకుడికి లేదు. దినదినగండమే! ఒక ఉద్యోగి తన కెరియర్‌ మొత్తంలో కనీసం డజను మంది మంత్రులను చూసి ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగికి మంత్రి లోకువే! అవినీతి రహిత.. వంటి కబుర్లు విన్నపుడు ''కొత్త చీపురు వారం రోజుల పాటు బాగానే తుడుస్తుంది, తర్వాతే నీరసిస్తుంది. వీళ్లూ అంతే. నెల తర్వాత షరా మామూలే.'' అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు.

అంటే ఎవరు వచ్చినా ఇంతేనా, పరిస్థితి మారదా? ఇలాటి నెగటివ్‌ థింకింగ్‌ సమాజానికి మంచిదేనా? అని వాదించవచ్చు. గతంలో ఇంత దారుణంగా ఉండేదా అని ఆలోచిస్తే లేదనే అనిపిస్తుంది. ఇప్పుడైతే అవినీతి అని సంస్కృతపదం ఉపయోగిస్తున్నారు కానీ అప్పట్లో సింపుల్‌గా తెలుగులో లంచం అనేవారు. ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఓ సందర్భంలో 'రామరాజ్యంలోనే లంచాలు ఉండేవిట' అన్నారట. తర్వాతి రోజుల్లో లంచాలు మాన్పడం ఎలా అనే చర్చ వచ్చినపుడు వాటిని చట్టబద్ధం చేసేస్తే మంచిది కదా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడు ఉద్యోగులు 'ఈ మేరకు మీరు ఎలాగూ ఇవ్వాలి, ఆ పైన ఏదైనా ఇస్తేనే పనవుతుంది' అని బేరమాడవచ్చనే ప్రతివాదన కూడా వచ్చింది.

ఏది ఏమైనా అప్పట్లో కొందరు మంత్రులు, కొందరు అధికారులు మాత్రమే లంచగొండులుగా పేరుబడ్డారు. నాయకులైతే ప్రజల నుంచి నేరుగా తీసుకోకుండా దేవాలయ భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారు. పార్టీకి నిధులు కాంట్రాక్టర్ల ద్వారా వచ్చేవి. వాళ్లు ప్రభుత్వం తమకు అప్పగించిన పనుల్లోంచి, పార్టీకి కమిషన్‌ ఇచ్చేవారు. దీనిలో సింహభాగం (90% వరకు అనేవారు) పార్టీ హైకమాండ్‌కే పోయేదిట. అందుకే మాజీ ముఖ్యమంత్రులుగా పని చేసినవారి కుటుంబాలకు పెద్దగా ఆస్తులు కనబడవు. ప్రజాప్రతినిథుల్లో కూడా చాలామంది స్వాతంత్య్రయోధులు, మధ్యతరగతివాళ్లు, నిజాయితీపరులైన కార్మికనాయకులు ఉండేవారు. పెద్దగా డబ్బు ఖర్చుపెట్టకుండా ఎన్నికలు గెలిచేసేవారు.

క్రమేపీ, ఒక పాతికేళ్లగా అనుకోండి, మార్పు వచ్చింది. ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. డబ్బిస్తే తప్ప ఓటేయని పరిస్థితి వచ్చింది. గతంలో కూడా నిమ్నవర్గాల్లో సారా సీసా తీసుకుని ఓటేసేవారుండేవారు. నియోజకవర్గంలో కొన్ని వాడలలోనే ఆ మంత్రం పనిచేసేది. మధ్యతరగతి వాళ్లు ఛీత్కరించుకునేవారు. కానీ ఈరోజు టీచరు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సెల్‌ఫోన్లు తీసుకుని ఓటేస్తున్నారని వింటున్నాం. అంటే సమాజంలో విలువలు పతనమై పోయాయన్నమాట. దీనికి కారణమేమిటి? 'నాయకులు కోట్లలో తింటున్నారు, అందుకే మనదగ్గర ఓట్లు కొనుక్కుంటున్నారు. మనం వేలల్లో తీసుకుంటే తప్పేముంది?' అని మధ్యతరగతి కూడా తమను తాము సమర్థించుకునే కర్మ దాపురించింది. తక్కిన రాష్ట్రాలలో కంటె తెలుగు రాష్ట్రాలలోనే ధనప్రవాహం ఎక్కువగా ఉందంటున్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టడానికి అయ్యే ఖర్చే కాదు, కార్యకర్తలకు ఇవ్వాల్సిన డబ్బు కూడా తోడవుతోంది. గతంలో పార్టీ అంటే అభిమానంతో కార్యకర్తలు వచ్చి పని చేసేవారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆరెస్సెస్‌ వాళ్లు తప్ప ఇంకెవ్వరూ అలా చేస్తున్నట్లు లేదు. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు వీరాభిమానులున్నారు. వాళ్లు ఉచితంగా చేస్తారు, ఆ రోజు సాదరు ఖర్చులిస్తే సంతోషిస్తారు. కానీ తెలుగు రాష్ట్రాలలో జండా పట్టుకుంటే వెయ్యికి తక్కువ పుచ్చుకోవటం లేదట. అదికాక బిర్యానీ, మందు వగైరాలు అదనం. ప్రచారం జరిగినన్నినాళ్లూ రోజుకి పదిలక్షలు కనీసపు ఖర్చని వినికిడి. మొత్తంమీద ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 20-25 కోట్ల ఖర్చవుతోందని అంచనా.

గతంలో నెగ్గుతారనుకునే వారికి పార్టీ టిక్కెట్టిచ్చేది. ఇప్పుడు టిక్కెట్టు కొనుక్కోవలసి వస్తోంది. ఎందుకివ్వాలి అంటే కొన్ని చోట్లయినా మైనారిటీలు, బిసిలు, దళితులు, పేదలు, మాజీ అధికారులు, దళితులకు టిక్కెట్టివ్వాలి కదా, వాళ్లు ఇన్నేసి కోట్లు ఎక్కడ పెట్టుకోగలరు? వారి కోసం మీ దగ్గర తీసుకోవాల్సి వస్తోంది అనే సమాధానం వస్తోంది. దానాదీనా బాగా డబ్బున్నవాళ్లే ఎన్నికలలోకి దిగుతున్నారు. గతంలో ధనికులు, కాంట్ట్రార్లు ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులను ఎంచుకుని, వారికి పరోక్షంగా సాయం చేస్తూ గెలిపించుకునే వారు. ఇటీవలి కాలంలో ఈ ద్రావిడ ప్రాణాయామం ఎందుకని వాళ్లకు తోచింది. మనం ఖర్చు పెట్టినదాకా ఉండి వాళ్లు నీతీ, నిజాయితీ, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు - లాంటి కబుర్లు చెపితే అనే భయం పట్టుకుంది. దానికంటె డైరక్టుగా తామే దిగితే పోతుంది కదా అనుకుంటున్నారు.

గతంలో అయితే నియోజకవర్గానికి ఏం చేశాడు, మనకు అందుబాటులో ఉంటాడా లేదా, మంచి రికార్డు ఉందా లేదా అనే అంశాలు ఓటర్ల పరిగణనలోకి వచ్చేవి. ఇప్పుడవేమీ లేవు, ఎదుటివాడి కంటె ఎక్కువ డబ్బు పంచితే చాలు నెగ్గేస్తాం అనే ధీమా అభ్యర్థులకు వచ్చింది. దానితో 50, 60 ఏళ్ల వయసు వచ్చేదాకా సమాజసేవ, ప్రజాజీవితం వంటి పదాల వర్ణక్రమం తెలియకపోయినా డైరక్టుగా రాజకీయాల్లో దిగసాగారు. విదేశాల్లో బాగా సంపాదించి, పార్టీకి ఫండ్స్‌ పడేసి, ఓట్లు కొనేసి ఎంపీ కూడా అయిపోవచ్చు అనే ఆలోచన బలపడింది. ఇలా పెట్టేవారంతా మదుపుదార్లే. ఈరోజు 25 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే, గెలిచాక ఈ పాతికా, వడ్డీతో కలిపి 30, పై ఎన్నికలలో పోటీకి మరో 30 (ఇన్‌ఫ్లేషన్‌ వలన ఓటు ధర పెరుగుతుంది కదా) మొత్తం 60 కోట్లు ఈ ఐదేళ్లలో సంపాదించాలి అనే లెక్కతోనే దిగాలి.

ఓడిపోతే ఈ లెక్కలు పని చేయవు. కానీ చేతిచమురైతే వదులుతుంది కాబట్టి ఆ టెర్మ్‌కు ఈ ఎన్నిక ఖర్చు కూడా తోడవుతూ పోతుంది. ఫైనల్‌గా ఏ పదేళ్లకో అధికారం చేజిక్కేసరికి ఆవురావురుమని ఉంటారు. పాత బాకీలన్నీ ఒక్క దెబ్బతో వసూలు చేసేసుకుందామని చూస్తారు. మొన్నటిదాకా నడిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కార్యకర్తల విషయంలో అదే జరిగిందని, అందుకే బాబు ఓటమి చెందారని అంటున్నారు. ఇదే లాజిక్‌ వైసీపీకి కూడా వర్తిస్తుంది కదా. వాళ్లూ 2014, 2019 ఎన్నికలలో ఖర్చు పెట్టారు. అంటే హీనపక్షం 35-40 కోట్లన్నమాట. జగన్‌ మాటకు కట్టుబడి మడికట్టుకుని కూర్చుంటే ఇది రాబట్టుకోవడం ఎలా? వారు ఎంతకాలం నోరు కట్టుకుని కూర్చుంటారు?

ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కాంగ్రెసు దుష్పరిపాలనతో, అవినీతితో ప్రజలు విసిగివున్నారు. ఎన్టీయార్‌ నిష్కంళక పాలన అందిస్తానని వాగ్ధానం చేసి, దానికి తగ్గట్టుగా అప్పటిదాకా రాజకీయాలకు కొత్తవారికి చాలామందికి టిక్కెట్లు ఇచ్చారు. వాళ్లంతా ఎన్నికలలో పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకపోయింది. ఎన్టీయార్‌ పేరు చెప్పుకునే గెలిచేశారు. ఎన్టీయార్‌ గద్దె నెక్కుతూనే అవినీతి ఎక్కడ కనిపించినా నాకు టెలిఫోన్‌ చేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంచారు. తన క్యాబినెట్‌ మంత్రే లంచం తీసుకుంటూ ఉంటే పట్టించారు. నాయకులు తినేయకుండా కట్టడిచేశారు. నిజానికి వాళ్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలు కాలేదు, అందువలన అవినీతికి పాల్పడవలసిన అవసరం లేదు. అయినా వాళ్లకు పురుగుకుట్టింది.

'ఆయన కేమండీ, ముసలాడైనా పడుచుపిల్లలతో కలిసి డాన్సులు చేసి కోట్లు గడించాడు. ట్రస్టు పెట్టి పిల్లలందరికీ పంచిపెట్టాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఇచ్చి, మనల్ని మాత్రం ఉపవాసాలు చేయమంటున్నాడు.' అని సణుక్కోసాగారు. వీళ్లలో కొందర్ని నాదెండ్ల తనవైపు తిప్పుకున్నారు. వాళ్లకు బలం ఉన్నట్లు తోచగానే తక్కినవాళ్లు కూడా గోడ దూకబోయారు. కానీ అనూహ్యంగా ప్రజా ఉద్యమం వెల్లువెత్తడంతో దడిసి, యిటే ఉండిపోయారు. కానీ వాళ్ల బుద్ధి గ్రహించిన ఎన్టీయార్‌ వెంటనే అసెంబ్లీ రద్దుచేసి, వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు టిక్కెట్టిచ్చారు. 1989లో ఎన్టీయార్‌ ఓడిపోయేనాటికి ఆయనపై అవినీతి కేసులున్నాయి. అప్పట్లో ఈ లంచాల డర్టీ వర్క్‌ అంతా డా. వెంకటేశ్వరరావు, ఆయన కంటె ఎక్కువగా చంద్రబాబు చేసేవారని చెప్పుకునేవారు.

1994లో అధికారంలోకి వచ్చాక టిడిపి కూడా మామూలు పార్టీలాగానే అయిపోయింది. 1989లో ఖర్చుపెట్టి కూడా ఓడిపోయాం కదా, 1994లో మళ్లీ పెట్టాం కదా. అన్నగారి నీడనే ఉంటూ లక్ష్మీపార్వతి అన్ని సూటుకేసులూ తీసేసుకుని మా నోట్లో కరక్కాయ కొడుతోంది. ఇప్పటికైనా కాస్తయినా తిననీయకపోతే ఎలా అనే సణుగుడు మళ్లీ ప్రారంభమైంది. బాబు తెలివిగా వాళ్లందరినీ సమీకరించి కుట్రచేసి, ఎన్టీయార్‌ను గద్దెదింపారు. బాబు ప్రధానంగా కాంగ్రెసులో పుట్టి పెరిగినవారు. ఆ సంస్కృతిని జీర్ణించుకున్నవారు. అందుకని టిడిపిని కాంగ్రెసుకు నకలుగా చేసి పెట్టారు. అందుకే ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలులో కాంగ్రెసుతో హోరాహోరీగా పోటీ పడగలిగారు. వీళ్లెవరూ ఇంట్లోంచి డబ్బు పట్టుకుని వచ్చి ఖర్చు పెడుతున్నారని అనుకోలేము కదా. ఎక్కడో అక్కడ అవినీతి చేసే ఉండాలి. పట్టుబడ్డారా, మీడియాలో వచ్చిందా లేదా అన్నది వేరే విషయం.

అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడినా 1999, 2009 ఎన్నికలలో అధికార పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. అవినీతిని ప్రజలు పట్టించుకోలేదు. 2004లో టీడీపీ ఓడిపోయినది అవినీతి అంశంపై కాదు. 2014లో కాంగ్రెసు ఓడిపోయినదీ అవినీతి అంశంపై కాదు. 2019 ఆంధ్ర ఎన్నికలలోనే అవినీతి ఒక ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. ఎందువలన? నేను గతంలో కూడా రాశాను. పాలనలో అవినీతి తమ నిత్యజీవితాన్ని తాకినప్పుడే ఓటరు దృఢంగా స్పందిస్తాడని. డిఫెన్సు కొనుగోళ్ల స్కాములు చూడండి. బోఫోర్స్‌ పాతికేళ్లగా నలుగుతోంది, అయినా కాంగ్రెసు మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడానికి అది అవరోధం కాలేదు. రఫేల్‌ ఈ ఎన్నికలలో అంశం కాలేదు. ఎందుకంటే డిఫెన్సు విషయాలు సాంకేతికమైనవి. అన్ని శతఘ్నులు, యుద్ధ విమానాలు అవసరమా కాదా? వాటికి ఎంత ధర పెట్టవచ్చు? దళారులు ఎంత తిన్నారు? ఎంత తినిపించారు? వీటిలో ప్రభుత్వపెద్దల ప్రమేయం ఏ మేరకు ఉంది? ఇవన్నీ సామాన్యజనాలకు అర్థంకావు.

అదే విధంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు తలపెట్టి, కాంట్రాక్టులు ఇచ్చినపుడు పాలకులు కొంత శాతం కమీషన్‌గా తీసుకుంటారు. ప్రతిపక్షం దానిపై గగ్గోలు పెడుతుంది. ఆ ప్రాజెక్టు పర్యావరణానికి ముప్పంటుంది, నిర్వాసితులకు పరిహారం చాలదంటుంది. టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందంటుంది. తాము అధికారంలోకి వచ్చి ఇవన్నీ రద్దు చేస్తానంటుంది. అధికారంలోకి రాగానే పర్యావరణ హాని గురించి మాట్లాడదు. ప్రాజెక్టు కొనసాగిస్తుంది. కాంట్రాక్టరు కూడా అతనే కొనసాగుతాడు. ఎందుకంటే అతను కొత్త పాలకులతో మళ్లీ బేరాలాడుకుంటాడు. వాళ్లు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి, కమిషన్లు తీసుకుంటారు. ఇలా డబ్బున్నవాళ్లకి, కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పనులు జరుగుతూనే ఉంటాయి.

పైగా తమిళనాడులో తప్ప వేరే రాష్ట్రాలలో, కేంద్రంలో ఒక పార్టీ వాళ్లు ప్రతిపక్షనాయకుడిపై కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భాలు అతి తక్కువ. అసెంబ్లీలో అరుచుకుంటారు. కేసులు పెడతామని బెదిరిస్తారు, ఒక్కోప్పుడు పెడతారు కూడా. కానీ వాటిని కొనసాగించరు. నత్తనడక నడుస్తూంటే తొందర పెట్టరు. వాళ్ల మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు తోస్తుంది. అందుకే ఐదేళ్లు పాలించినా అవతలివాళ్ల కథను ఒక కొలిక్కి తీసుకురారు. ఇవన్నీ మధ్యతరగతి ప్రజల, పేపరు టీవీ ప్రేక్షకుల కాలక్షేపానికి, చర్చించుకోవడానికి బాగా పనికి వస్తాయి. సాధారణ ప్రజలకు యివేమీ పట్టవు. ప్రభుత్వభూమి ఫలానావారికి చౌకగా కట్టబెట్టారట, దానికి ప్రతిఫలంగా మరోచోట లాభం పొందారట - ఇవన్నీ వాళ్ల జీవితాలను స్పృశించవు.

కన్యాశుల్కం నాటకంలో గిరీశం స్వాతంత్య్రం ఆవశ్యకత గురించి బండివాడికి లెక్చరిస్తే వాడు 'అయితే మా ఊళ్లో హెడ్‌ కనిస్టీపును మారుస్తారా?' అని అడుగుతాడు. దిల్లీ గద్దెపై తెల్లదొర ఉన్నాడా, నల్లదొర ఉన్నాడా అనేది వాడికి అనవసరం. రోజూ మామూళ్ల కోసం హింసించే కనిస్టీపే వాడి పాలిట విలన్‌. వాడు వదిలితేచాలు. అలాగే సామాన్యుడికి ప్రభుత్వాఫీసులోని చిరుద్యోగే ప్రభుత్వానికి ప్రతీక. వాడు లంచం కోసం పీడిస్తే 'ఛత్‌, వెధవ ప్రభుత్వం అనుకుంటాడు'. వాడు బాగా పనిచేస్తే మంచిదే పాపం అనుకుంటాడు. గతంలో రాజకీయపరమైన అవినీతి తక్కువగా ఉండడంచేత ఉద్యోగుల్లో అవినీతి కూడా హద్దు మీరకుండా ఉండేది. అందుచేత మరీ బాధించలేదు. ప్రభుత్వశాఖలన్నిటిలోనూ అవినీతి ఉండదు. అందరూ అవినీతిపరులు కాదు. కానీ లంచాలు పుచ్చుకున్నా ఏమీకాదనే ధీమా ఇటీవలి కాలంలో ప్రభుత్వోద్యోగుల్లో పెరిగింది.

ప్రభుత్వోద్యోగులకు క్రమశిక్షణ, నిజాయితీ గరపాలని చూసినందుకు వాళ్లు ఎన్టీయార్‌పై పగబట్టారు. ఎన్టీయార్‌ 1989లో ఓడిపోయినప్పుడు వాళ్ల వలననే ఓడిపోయాడనే మాట బయటకు వచ్చింది. ఎందుకంటే పోలింగు అధికారులుగా వారే ఉంటారు. చదువుకోని వారి ఓట్లు తారుమారు చేయగల అవకాశం వాళ్లకు ఉంటుందనే భయం పాలకులకు పట్టుకుంది. అప్పణ్నుంచి వారిని మంచి చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. జీతాలు పెంచారు, పెన్షన్లు పెంచారు, ఆఫీసుకి సరైన టైముకి రాకపోయినా ఊరుకున్నారు, లంచాలు ఎడాపెడా మేసేసినా చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. టీవీల్లో చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. లంచగొండి చిరుద్యోగి కూడా ఎంతెంత ఆస్తులు కూడబెడుతున్నాడా? అని. మహా అయితే ఆర్నెల్లు సస్పెండు చేస్తారు, తర్వాత ఎవణ్నో పట్టుకుని వెనక్కి వచ్చేయవచ్చు అనేధీమాతో ఉంటున్నారు వీళ్లు. ఎందుకంటే వీళ్లకు స్థానిక అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతున్నారు.

ఇది ప్రజలకు దుర్భరమై పోవడంతోనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. నిజానికి బాబు ప్రభుత్వోద్యోగులను నెత్తిన పెట్టుకున్నారు. ప్రభుత్వానికి స్తోమత లేకపోయినా జీతాలు అనూహ్యంగా పెంచారు. ఇక హైదరాబాదు నుంచి అమరావతికి బదిలీ చేసినవాళ్లను అల్లుళ్ల కంటె ఎక్కువ చూసుకున్నారు. రోజుకి ఒక అవినీతి అధికారి విషయం బయటపడుతున్నా ప్రక్షాళన కార్యక్రమం చేపట్టలేదు. తన దీర్ఘోపన్యాసం వింటేచాలు, ఏమీ చెయ్యను అనే భావన కలిగించారు. అయినా ఓడిపోయారు. ఓటింగు సమయంలో ఈ ప్రభుత్వోద్యోగులు అక్కరకు రాలేదే! ఎందుకంటే ప్రజాగ్రహం అంత బలంగా ఉన్నపుడు ఏ ఉద్యోగీ ఏమీచేయలేడు.

జగన్‌ ఇది గ్రహించాలి. కిందిస్థాయిలో, దైనందిన జీవితంలో అవినీతిని అరికట్టినపుడు సామాన్యుడు 'మంచి ప్రభుత్వం' అనుకుంటాడు. ఇప్పుడు ఇ-గవర్నెన్స్‌ వచ్చేసింది కాబట్టి అంతా పారదర్శకంగా చేయవచ్చు. సామాన్యుడు ప్రభుత్వాఫీసుకి వచ్చే అవసరం లేకుండానే ఇంట్లో సెల్‌ఫోన్‌తో పని చేసుకునేట్లా చేయవచ్చు. సంతకాల్లో కూడా డిజిటల్‌ సంతకాలను ఆమోదించవచ్చు. ఉద్యోగులు సమయానికి ఆఫీసుకి వచ్చేట్లా, టీచర్లు స్కూళ్లకు వచ్చేట్లా, డాక్టర్లు ఆసుపత్రులకు వచ్చేట్లా చేస్తేనే జనాలు సంతోషిస్తారు. సుపరిపాలన అనుకుంటారు. కానీ ఇలా చేయగలగడం సాహసమే అవుతుంది. ఎందుకంటే ఉద్యోగులు పెద్ద లిటిగెంట్లు. మా జోలికి వస్తే భస్మమైపోతారు అని భయపెడతారు. ఉన్నవీ, లేనివీ మీడియాకు చెప్పి రాయిస్తారు. పొగరుబోతు గుఱ్ఱాన్ని అదుపు చేయడం ఎంత కష్టమో ఉద్యోగులను క్రమమార్గంలో పెట్టడమూ అంత కష్టం. జగన్‌ కనుక అదిసాధిస్తే సగం గెలిచినట్లే!

ఇక కాంట్రాక్టుల విషయానికి వస్తే వాటిల్లో కమీషన్లు మాన్పించడం అతికష్టం. మహా అయితే తక్కువ తీసుకోవచ్చేమో కానీ సాంతంలేకుండా చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆ వ్యవస్థ అంతగా కుళ్లిపోయింది. రోడ్ల విషయంలోనే చూడండి, గతంలో అంటే 25, 30 ఏళ్ల క్రితం నీట్‌గా వేసేవారు. ఇప్పుడు అంచుల్లో వదిలేస్తున్నారు. రోడ్డు వేసిన వారానికల్లా గుంతలు పడుతోంది. ముందే చేసుకున్న ఏర్పాటో ఏమో మరో శాఖ వాళ్లు వచ్చి రోడ్డు తవ్వేస్తారు. దాంతో రోడ్డు నాణ్యత అంచనా వేయడం కష్టమైపోతుంది. జగన్‌ ఇది మార్చగలుగుతాడంటే నమ్మబుద్ధిగా లేదు. నిజంగా మారిస్తే మాత్రం అది ఒక అద్భుతమే అవుతుంది. అద్భుతాలు అరుదుగా జరుగుతాయి. జరిగినా లోపల శంక తొలిచేస్తూ ఉంటుంది - దీనివెనక మనకు కనబడని మర్మం, బయటపడని స్కాండల్‌ ఏదో ఉందేమో అని. అందువలన కొన్నేళ్లు గడిస్తే తప్ప నిర్ధారించలేం. అప్పటివరకు ఫింగర్స్‌ క్రాస్‌డ్‌!
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2019)

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు

Show comments