మరో ఇరవై ఏళ్లు... జగన్

మరో ఇరవై ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి... తెలుగుదేశం నాయకులు

మరో ఇరవై ఏళ్లు తెలుగుదేశానిదే అధికారం... లోకేష్ బాబు

ఇలా గత అయిదేళ్లలో ఊదరగొట్టని రోజు లేదు. అధికారం.. అధికారం.. అధికారం.

తమకే మరో ఇరవై ఏళ్లు అధికారంలో వుండాలని యావ. అదే సమయంలో పొరపాటున నేను సిఎమ్ అవుతా అని జగన్ అంటేచాలు, బాబు అనుకూల మీడియా సర్రున లేచేది. అదిగో జగన్ కు అధికారం యావ అంటూ..

అన్నాళ్లు అధికారంలో వున్న చంద్రబాబే మళ్లీ మరో ఇరవై ఏళ్లు అధికారంలో వుండాలి అని అనుకున్నపుడు, అస్సలు అధికారం అనుభవించని జగన్ కు కోరిక వుండదా? అని ఆ మీడియాకు అస్సలు ఆలోచన వుండదు. కానీ జనాలకు ఆలోచన వచ్చింది,. ఓ అవకాశం జగన్ కూ ఇద్దాం అని ఇచ్చేసారు. బాబును పక్కన పెట్టేసారు.

అయితే అధికారంలో వుండాలన్న యావే కానీ, నాలుగున్నరేళ్లు దానికోసం బాబుగారు చేసింది లేదు. ప్రచార పటాటోపం తప్ప.

అదిగో రాజధాని, ఇదిగో నిర్మాణాలు

అవిగో ఐటి కంపెనీలు.. ఇదిగో ఉద్యోగాలు

ఇదిగో ఉద్యోగసంక్షేమం.. అదిగో పెంపు అన్నదే తప్ప, కార్యాచరణలో కనిపించింది లేదు. చివరి నెలలో మాత్రం జనాలకు డబ్బులు పడేస్తే ఓట్లు వేసేస్తారు అని తప్పుడు కాలుక్యులేషన్ చేసి బొక్కబోర్లా పడ్డారు.

కానీ జగన్ ఇలా వస్తూనే అలా మొదలుపెట్టేసాడు. తక్కువో, ఎక్కువో పింఛన్లు పెంచాడు. ఉద్యోగులకు జీతాలు పెంచాడు. ఆశా వర్కర్లకు జీతాలు పెరిగాయి. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక తీర్చడానికి కమిటీ ఏర్పాటయింది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు ఇంకా చాలామందికి తృణమో పణమో పెరిగాయి.

రైతులకు ఏటా డబ్బులు వేయడం సంగతి అలావుంచితే, వ్యవసాయ కార్పొరేషన్ అన్నది గొప్ప చర్య. అలాగే రుణాలకు వడ్డీలు ప్రభుత్వం చెల్లించడం అన్నది మంచి ముందు అడుగు. కాస్త అపాత్ర దానం అయితే అవుతుంది. కానీ బ్యాంకులకు రుణాలు సక్రమంగా వెనక్కు వస్తాయి. ధరల స్థిరీకరణ నిధి, అలాగే ఇంకా చాలా చాలా నిర్ణయాలు జనాలను బాగా ప్రభావితం చేసేవే. ఇలా లక్షలాది మందిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటూపోతే, జగన్ ను ఎవరు ఆపగలరు? 2024లో?

మంత్రివర్గ సమావేశంలో అవినీతి గురించి హెచ్చరించడంతో పాటు, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించేసారు. జగన్ సంగతి ఆ పార్టీ నాయకులకు బాగా తెలుసు. లేస్తే మనిషిని కాదు అనే బాబు టైపు హెచ్చరికలు కాదు. బయటకు పంపిస్తా అంటే పంపించేయడమే.

ఇలా, ఇదే తరహాలో అయిదేళ్ల పాటు పాలిస్తే, ప్రశ్నించే పార్టీలు లేవు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలు వుండవు. అన్నీ మూసుకోవడమే. కానీ ఒక్కటే అనుమానం. అసలు జగన్ కు పాలనా పరమైన ఈ సలహాలు అన్నీ ఎవరు ఇస్తున్నట్లు? బై డీఫాల్ట్ అతనిలో వున్నాయా? లేక బ్యాక్ ఎండ్ లో ఎవరైనా గైడ్ చేస్తున్నారా?

ఎందుకంటే పాపం, తెలుగుదేశం జనాలు ఒకటేమాట అనేవారు. అనుభవం.. అనుభవం.. అనుభవం అని. ఆఖరికి అనుభవిస్తున్నట్లే వుంది.

వెల్ డన్ జగన్..కీప్ ఇట్ అప్