సినిమా రివ్యూ: మన్మథుడు 2

సమీక్ష: మన్మథుడు 2
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌
తారాగణం: నాగార్జున అక్కినేని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వెన్నెల కిషోర్‌, లక్ష్మి, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి తదితరులు
మాటలు: కిట్టు విస్సాప్రగడ, రాహుల్‌ రవీంద్రన్‌
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
కూర్పు: చోటా కె. ప్రసాద్‌, బి. నాగేశ్వరరెడ్డి
ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్‌
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్‌
కథనం, దర్శకత్వం: రాహుల్‌ రవీంద్రన్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 09, 2019

'వాడి కోపం ప్రళయం... వాడి ప్రేమ సముద్రం... వాడి జాలి వర్షం' 'మన్మథుడు' అభిరామ్‌ క్యారెక్టరైజేషన్‌ని ఇంత సింపుల్‌గా, స్ట్రయికింగ్‌గా చెప్పాడు త్రివిక్రమ్‌. అది రాసిందెవరో నాగార్జునకి గుర్తుండకపోయి వుండొచ్చు కానీ అప్పుడు త్రివిక్రమ్‌ రాసిన మాటలు పదిహేడేళ్ల తర్వాత కూడా అలా గుర్తుండిపోయాయి. బాక్సాఫీస్‌ ఫలితం అటుంచితే, నాగార్జున కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల జాబితాలో మన్మథుడు నిలిచిపోతుంది. అలాంటి సినిమాకి ఏమాత్రం సంబంధం లేకపోయినా కానీ ఫ్రాన్స్‌ నుంచి అరువు తెచ్చుకున్న ఈ కథకి 'మన్మథుడు 2' అనే పేరెందుకు పెట్టారో తీసినోళ్లకే తెలియాలి. 'ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయను' అంటాడు ఇందులోని హీరో. మరి ఒక్క హిట్టు కోసం ప్రయత్నంలో ఆ పేరెందుకు చెడగొట్టడం?

మన్మథుడు ఇప్పటికీ కుటుంబ సమేతంగా కూర్చుని హాయిగా నవ్వుకుంటూ చూడవచ్చు. కానీ ఈ మన్మథుడుని చూడ్డానికి వెళితే... పిల్లల కళ్లెప్పుడు మూయాలి, వాళ్ల చెవులెలా మూయాలంటూ నానా హైరానా పడాల్సిందే. 'అర్జున్‌ రెడ్డి' కాలంలో ముద్దులు, సెక్స్‌ సంభాషణలు తెలుగు సినిమా మెయిన్‌ స్ట్రీమ్‌లో భాగమైపోయాయనే భ్రమలోంచి వచ్చిన 'ఫ్యామిలీ' చిత్రమిది. 'నో యువర్‌ ఆడియన్స్‌' అనేది ఏ సినిమాకైనా మొదటి సూత్రం. అలాగే తెలుగు సినిమా వరకు 'నో యువర్‌ హీరో' అని కూడా గుర్తుంచుకోవాలి. ఏళ్ల తరబడి చూస్తోన్న హీరోలపై ఒక విధమైన ఇంప్రెషన్‌, వాళ్లకో ఇమేజ్‌ వుంటుంది. దానికి లోబడి ఆడాలి తప్ప ఆడియన్స్‌ మారారు అనుకుంటూ క్రికెటర్‌ చేత కబడ్డీ ఆడించరాదు.

'మన్మథుడు 2'ని ఇంత 'ఘాటుగా' తీయాలని డిసైడ్‌ అయితే మొదట్నుంచీ అలాగే మార్కెట్‌ చేసుకుని వుండాలి. అంతే కానీ 'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' సినిమా తీస్తున్నామంటూ కండోమ్‌లని హెల్మెట్లంటూ.. సెక్స్‌ని మ్యాచ్‌లంటూ రిఫర్‌ చేయకూడదు. హీరో శృంగారాన్ని 'చూపించడానికి' అదురుతున్న సోఫాలు, గోడలు చూపిస్తూ అదే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనుకోకూడదు.  ఎక్కడో చెడు వాసన వచ్చినా కనిపెట్టేసే పర్‌ఫ్యూమర్‌ ఇందులోని హీరో. అదే శక్తి నిజంగా నాగార్జునకి వుండుంటే ఈ కథలోని బ్యాడ్‌ స్మెల్‌ని ముందే పసిగట్టి వుండేవాడు. 'ఎక్కడో తేడా కొడుతోంది చిన్నా' అంటూ రావు రమేష్‌లా ఒక్కసారయినా డౌట్‌ పడి వుంటే ఈ తప్పు జరగకముందే దిద్దుకుని వుండేవారు.

కథాపరంగా, కథనం పరంగా ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ చిత్రమిది. దీని హక్కులు ఫ్రాన్స్‌నుంచి ఎందుకు కొనుక్కుని వచ్చారో మరి? ఆడవాళ్లతో శృంగారమే తప్ప సంసారం ఇష్టపడని ఓ మధ్య వయస్కుడు పెళ్లి తప్పించుకోవడానికి ఓ యువతితో కాంట్రాక్ట్‌ పెట్టుకుంటాడు. ఈ కాంట్రాక్ట్‌ కాన్సెప్ట్‌కి నాగార్జునంత వయసొచ్చేసింది. పోనీ ఈ కథని ట్రీట్‌ చేసే విధానంలో ఏదైనా మార్పు వుంటుందా అంటే అదీ లేదు. తదుపరి సన్నివేశం ఏమి జరుగుతుందనేది సత్యానంద్‌ సినిమాలు చూసిన వారు ఎవరైనా ఊహించవచ్చు. ఆడవాళ్లతో అంత తేలికగా వన్‌నైట్‌ స్టాండ్స్‌ ఇండియాలో చూపిస్తే బాగోదు కనుక ఇదంతా పోర్చుగల్‌లో జరుగుతున్నట్టు చూపించారు. అలాగే ఇలాంటి కాంట్రాక్ట్‌కి ఒప్పుకునే భారతీయ యువతికి ఓ కారణముండాలి కనుక తన అక్క కొడుకుపై వారసత్వ హక్కు అంటూ లింక్‌ పెట్టారు. మరి అదే యువతికి సిగరెట్లు, మందు తాగే అలవాటు ఎందుకు? నేటి ట్రెండు అదే అనుకుని వుంటారు.

హీరోని శృంగార పురుషుడు అని చూపించి వదిలేయడంతో సరిపెట్టకుండా ఇంకా పలు చోట్ల దర్శకుడు రాహుల్‌ తన క్రియేటివిటీ చూపించాడు. తన మీద బ్యాడ్‌ ఇంప్రెషన్‌ రావాలని హీరో అక్కకి హీరోయిన్‌ లిప్‌లాక్‌ ఇస్తే... ఆమె ఛీదరించుకోవడం మాని తన భర్తని అంతమందిలోంచి లాక్కుని బెడ్‌రూమ్‌లోకి తీసుకుపోతుంది. ఇది హాస్యమనుకోవాలి. 'ఇంతవరకు నీ తుపాకీ పేల్చలేదు' అంటూ వర్జినిటీ గురించి ప్రస్తావించడంతో పాటు ఉప్పుని 'లవణం' అని పిలవడంలోను బూతు అర్థం ధ్వనించేట్టు జాగ్రత్త పడ్డారు. విజువల్‌ అండ్‌ ఆడియో పరమైన ద్వందార్థాలు, డైరెక్ట్‌ అర్థాలు ఎన్నో వున్న ఈ సినిమా 'పేరెంటల్‌ గైడెన్స్‌' సర్టిఫికెట్‌ పొందిందంటే సెన్సార్‌ పోర్చుగల్‌లో చేసారో, లేక సెన్సార్‌ ఆఫీసర్‌ అక్కడివాడో తెలీదు. నాగార్జున అంటే 'రొమాంటిక్‌ హీరో' అనే ఇమేజే వుంది తప్ప 'స్త్రీలోలుడు' అనే ఇంప్రెషన్‌ లేదు. ఆ రెండిటికీ మధ్య తేడాని తెలుసుకోలేకపోవడం ఈ మన్మథుడికి అతి పెద్ద మైనస్‌.

నాగార్జున ఇప్పటికీ ఫిట్‌గా వుండడం గ్రేట్‌... వెరీ అడ్మిరబుల్‌. అలాగని ఆయనతో ఈ వయసులో ఈ శృంగార చర్యలు చేయించడం మాత్రం అనాక్సెప్టబుల్‌! మిగతా వారితో ఎలాంటివి చేయించినా రకుల్‌ ప్రీత్‌తో ఈక్వేషన్‌ క్లీన్‌గా వుంచడం వరకు మంచి పని చేసారు. వెన్నెల కిషోర్‌ తనవంతుగా కొన్ని చోట్ల మంచి హాస్యంతో ఈ చిత్రానికి దోహదపడ్డాడు. సహాయ తారాగణంలో ముఖ్యమైన వాళ్లంతా తమవంతు బాధ్యత నిర్వర్తించారు. మన్మథుడు 2 అని పేరు పెట్టినందుకు కనీసం పాటల పరంగా అయినా దానిని మ్యాచ్‌ చేయడానికి చూడాల్సింది. ఈ సినిమాలో వున్న మూడు పాటల్లో ఏదీ మరోసారి గుర్తురానంత బాగుంది. పోర్చుగల్‌ పుర వీధుల్లో ఛాయాగ్రహణం కంటికి ఇంపుగా వుంది.

దర్శకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌ మొదటి సినిమాలో చూపించిన కొత్తదనం స్థానంలో స్టాక్‌ ఫార్ములాని నమ్ముకుని భంగపడ్డాడు. మన్మథుడు 2 అని పేరు పెట్టినందుకు అందులోని కొన్ని దృశ్యాలని రిపీట్‌ చేయాలని చూసారు కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి పంచ్‌లు వేసేయడం కాదు... దానికి టైమింగ్‌ ఎంత అవసరం అనేది తెలియజేస్తాయి. ఫైనల్‌గా ఆ మన్మథుడు నాగార్జునకి చిరకాలం గుర్తుండిపోయే సినిమా అయితే, ఈ మన్మథుడు 2 ఎంత త్వరగా మరచిపోతే అంత మేలనిపించే చిత్రంగా మిగిలిపోతుంది.

బాటమ్‌ లైన్‌: రాంగ్ ట్రాక్ మన్మథుడు
- గణేష్‌ రావూరి
Show comments