మనవడి కోసం చంద్రబాబు 'గ్యాలరీ' స్టంట్‌.!

పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పరుగులు పెడ్తున్నాయంటూ నాలుగేళ్ళ నుంచీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతూనే వున్నారు. 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసేస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించేసినా, ఆ దిశగా పనులు మాత్రం 'వేగంగా' జరుగుతున్న పరిస్థితులు అయితే లేవు. ఇంకా ప్రాజెక్ట్‌ పనులు 58 శాతమే పూర్తయ్యాయన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెబుతున్న మాట. ఈ లెక్కన, ప్రాజెక్ట్‌ పూర్తవడానికి ఇంకెంత సమయం పడుతుందట.? 

తాను ముఖ్యమంత్రిగా వుండగా, పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవుతుందన్న నమ్మకం చంద్రబాబులోనే కన్పించడంలేదు. అందుకే, వీలు చిక్కినప్పుడల్లా ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నారు. ఈ స్టంట్స్‌ ఎపిసోడ్‌లో కొత్త 'మైలురాయి'.. అదే 'గ్యాలరీ వాక్‌'. చంద్రబాబు ఈ 'గ్యాలరీ వాక్‌'ని ప్రారంభించేశారు. అదీ, సకుటుంబ సపరివార సమేతంగా. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, చంద్రబాబు మనవడు దేవన్ష్‌.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి నారాలోకేష్‌ సంగతి సరే సరి. 

పోలవరం గ్యాలరీ వాక్‌లో చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ హైలైట్‌ అయ్యేలా మొత్తం కార్యక్రమాన్ని డిజైన్‌ చేసినట్లున్నారు. మనవడ్ని చూసి చంద్రబాబు మురిసిపోవడం.. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని ప్రసన్నం చేసుకోవడానికి అధికార పార్టీనేతలు పడ్డపాట్లు.. ఈ హంగామా ఓ రేంజ్‌లో సాగింది. గ్యాలరీ వాక్‌లో మనవడు దేవాన్ష్‌ని ముందు పెట్టుకుని చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్‌ ఈ మొత్తం ఎపిసోడ్‌కే హైలైట్‌ అని చెప్పొచ్చు. 

ఇదిలావుంటే, ఈ గ్యాలరీ వాక్‌ కార్యక్రమానికి టీడీపీ ప్రజా ప్రతినిథులు, తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా హాజరుకావడం గమనార్హం. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేంద్రం పోలవరం ప్రాజెక్ట్‌కి నిధులు ఇవ్వడంలేదని ఆరోపించడం.. అక్కడే వున్న విష్ణుకుమార్‌రాజు ఆ ఆరోపణల్ని ఖండించడం.. ఇదంతా ఓ ప్రసహనంలా సాగింది. 

పట్టిసీమపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానంటూనే, అదొక అద్భుతమైన ప్రాజెక్ట్‌ అని విష్ణుకుమార్‌రాజు సెలవిచ్చేశారు. పోలవరం గ్యాలరీ వాక్‌కి తనను ప్రభుత్వం ఆహ్వానించిందనీ, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ గనుక.. కేంద్రంలో తానూ భాగం గనుక.. ఈ కార్యక్రమానికి వచ్చినట్లు విష్ణుకుమార్‌రాజు చెబుతుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద మరోమారు 'పసుపు పండుగ' కన్పించింది. ప్రాజెక్ట్‌ పనులు ఎలా సాగుతున్నాయన్న విషయాన్ని పక్కనపెడితే, ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు భలే పబ్లిసిటీ స్టంట్లు మాత్రం చేసేస్తున్నారు.

RELATED ఆమెకు మంచి రోజులొచ్చాయా?