సినిమా రివ్యూ: మల్లేశం

సమీక్ష: మల్లేశం
రేటింగ్‌: నాట్‌ అప్లికబుల్‌
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌, స్టూడియో 99
తారాగణం: ప్రియదర్శి, అనన్య నాగళ్ల, ఝాన్సీ, తాగుబోతు రమేష్‌ తదితరులు
మాటలు: అశోక్‌ పెద్దింటి
కూర్పు: రాఘవేందర్‌ వి
సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌
ఛాయాగ్రహణం: బాలు శాండిల్యస
నిర్మాతలు: రాజ్‌ ఆర్‌, శ్రీ అధికారి
రచన, దర్శకత్వం: రాజ్‌ ఆర్‌
విడుదల తేదీ: జూన్‌ 21, 2019

చింతకింది మల్లేశం... ఎన్నో జీవితాలని మార్చి, ఎంతమందికో జీవనోపాధి కల్పించి, చేనేత కర్మాగారానికి ఎంతో గొప్ప మేలు చేసిన పేరు ఇది. ఆరవ తరగతిలోనే బడి మానేసి కుటుంబ భారాన్ని మోసిన ఒక సామాన్య చేనేత కుటుంబానికి చెందిన యువకుడు 'ఆసు యంత్రం' కనిపెట్టి 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న నమ్మశక్యం కాని అసామాన్య కథ ఇది. మన మట్టి కథ ఇది.

చేనేత కుటుంబాల ఇళ్ళల్లో మగపిల్లాడు పుడితే మగ్గమెక్కాలని, ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని కట్నం ఇవ్వడంతో పాటు భర్త చేసే చేనేత పనికి 'చేయూత' ఇవ్వాలని పుట్టుకతోనే నిర్ణయించేస్తారు. చేతికి దారం చుట్టుకుని అటు ఇటు తిప్పుతూ భుజాలు అరిగిపోయే వరకు 'ఆసు' పోయడం అక్కడి ఆడవాళ్లకి రివాజు. ఒక్కసారి ఆ చేయి తిరగకపోతే కుటుంబం గడవదు. కానీ జీవితాంతం ఆ చేయి తిరుగుతూ, భుజం అరుగుతూ వుండాల్సిందేనా? తల్లి పడుతోన్న కష్టం చూసి దానిని తప్పించడానికి 'మల్లేశం' ఏదైనా చేయాలనుకున్నాడు. తన తల్లితో పాటు తమలాంటి కుటుంబాలకి చెందిన ఆడవాళ్లు అందరికీ కష్టం తప్పించడానికి ఆసు యంత్రం కనిపెట్టాలనుకున్నాడు. యంత్రాలు కనిపెట్టడానికి అతనేమి ఇంజనీరు కాదు. ఆ చేయి తిరిగే తీరుకి అనుగుణంగా ఆసు దానంతట అది పోసే విధంగా ఒక మెషీన్‌ కనిపెడితే కష్టం తీరిపోతుందని తెలుసు. కానీ ఏమి చేస్తే అది పని చేస్తుందో, ఎలా చేస్తే తన యంత్రం పనికొస్తుందో మల్లేశానికి తెలియదు.

'సైన్స్‌'కి సంబంధించిన విషయాలు చదువు మానేసిన కుర్రాడికి ఎలా తెలుస్తాయి? అంత యంత్రాన్ని తయారు చేయడానికి కావాల్సిన డబ్బులెక్కడ్నుంచి వస్తాయి? అకుంటిత దీక్ష, మొక్కవోని పట్టుదల వుంటే ఇలాంటి అవరోధాలని ఇట్టే అధిగమించవచ్చునని, అసాధ్యాలని సాధ్యం చేసుకోవచ్చునని నిరూపించిన చింతకింది మల్లేశం తన లక్ష్యం సాధించాడు. కానీ అందుకోసం ఎన్నో ఏళ్లు శ్రమించాడు. ఊరందరితో పాటు సొంత వాళ్లతోను మాటలు పడ్డాడు. నవ్వుల పాలయ్యాడు. జీవితం గడవక నేత పని చేయలేనపుడు అవీ ఇవీ చేస్తూ పొట్ట పోసుకున్నాడు. కానీ ఏనాడూ అతని దృష్టి యంత్రం మీదినుంచి పక్కకి మరలలేదు.

ఎంతో సాధించిన ఈ వ్యక్తి గురించి ఎక్కువ మందికి తెలియదు. అలాంటి వ్యక్తి కథని సినిమాగా మలిచిన రాజ్‌ ఆర్‌ 'మల్లేశం'ని మట్టి వాసనలతో నింపాడు. తెలంగాణ పల్లెల్లో వినిపించే అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంతో, అక్కడి సంస్కృతికి అద్దం పడుతూ అక్కడి మనుషుల జీవన చిత్రాన్ని చలనచిత్రంగా రూపొందించాడు. మల్లేశం కథని బాల్యం నుంచి మొదలు పెట్టి ఆ 'యంత్రం' ఆలోచన అంకురించిన దశనుంచి అది వ్యాపకం నుంచి వ్యసనంగా మారేంత వరకు, చివరకు అనుకున్నది సాధించే వరకు ఏమి జరిగిందో, ఎలా జరిగిందో వివరంగా చూపించాడు. ఈ కథలోని స్వచ్ఛత, నిజాయితీ ఆదిలోనే కట్టి పడేస్తాయి. సహజత్వం నిండిన దృశ్యాలతో నిజంగానే మల్లేశం జీవితం మన కళ్ళముందే జరుగుతోన్న భావన కలుగుతుంది.

ప్రేమకథని, ఆలుమగల అనుబంధాన్ని వెండితెరపై ఇంత స్వచ్ఛంగా చూసి ఎన్నాళ్లయిందో? తెరపై ఎవరూ నటిస్తున్నట్టు అనిపించదు. అందరూ తమ పాత్రల్లో లీనమైపోయి 'మల్లేశం'కి జీవం పోసారు. నటీనటులే కాదు, తెరవెనుక సాంకేతిక వర్గం కూడా ఈ చిత్రాన్ని సజీవంగా తెరకెక్కించారు. సంభాషణలు అచ్చంగా తెలంగాణ పల్లెల్లోని మాటలతోనే సాగుతూ ఒక్కోసారి అర్థం వెతుక్కోవాల్సినంత లోతుగా అనిపిస్తాయి. సంగీతం కూడా నేపథ్యానికి తగ్గట్టుగా కథలో భాగం అయిపోతుంది. ఛాయాగ్రాహకుడు వీలయినంత సహజత్వం తెరపై కనిపించడంలో అపారమైన కృషి చేసాడు. దర్శకుడు రాజ్‌ ఆర్‌ నిజాయితీతో ఈ కథని చెప్పాలనుకున్నాడే తప్ప హంగులు, ఆర్భాటాలకి పోలేదు. డ్రామాని కూడా ఎక్కడా సినిమాకి అనుగుణంగా మలచకుండా వాస్తవికతకే పెద్ద పీట వేసాడు. పాత్రధారులంతా తమ పాత్రలలో లీనమై నటించినా కానీ మల్లేశంగా ప్రియదర్శి అభినయం మెప్పిస్తుంది. కథానాయకుడిలా సగటు యువకుడిలా అతని ఆహార్యం, నటన బాగా కుదిరాయి. ఝాన్సీకి చిరకాలం గుర్తుండిపోయే పాత్ర దక్కింది. ఆమె ఎలాంటి లోపం లేకుండా ఆ పాత్రని పోషించింది. అనన్య నాగళ్ల కూడా సహజమైన నటనతో మెప్పిస్తుంది.

మల్లేశం కథని మొదలు పెట్టిన విధానం, అతని జీవితంతో పాటు తెలంగాణ పల్లెల సంస్కృతిని తెరపైకి తెచ్చిన తీరు, ఆ వాతావరణం, ఆ సహజత్వం అన్నీ మెప్పించినా కానీ ఒక దశకి చేరుకున్న తర్వాత కథని ఆసక్తికరంగా నడిపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. ముఖ్యంగా మల్లేశం కథ పట్నానికి చేరుకున్న తర్వాత ముందుగా మెప్పించిన లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతూ, కథ ముందుకి కదలక మొరాయిస్తుంది. మల్లేశంలోని తపన తెరపై కనిపిస్తుంది కానీ ఆ యంత్రం చేయడానికి అవసరమైన స్ఫూర్తి, చేసేందుకు అవసరమైన జ్ఞానం, పరిజ్ఞానం ఎలా వచ్చాయి, అసలు ఏమి చేయాలనుకున్నాడు, ఏది చూసి స్ఫూర్తి పొంది తన మెషీన్‌ తయారీలో దానిని భాగం చేసాడు లాంటివి తెరపైకి డీటెయిల్డ్‌గా, సమర్ధవంతంగా తెర మీదకి రాలేదు. దీని వల్ల ఆ మెషీన్‌ విఫలమైన ప్రతిసారీ ఎమోషన్‌ తగినంత పండలేదు.

చింతకింది మల్లేశంకి చెందిన ఒక వీడియో యూట్యూబ్‌లో వుంటుంది. అతను ఏ విధంగా కష్టపడ్డాడు, ఎంత కృషి చేసి అనుకున్నది సాధించాడనేది ఆయన మాటలలోనే స్వయంగా తెలుసుకునే వీలుంటుంది. ఆ వీడియో చూస్తున్నంతసేపు భావోద్వేగం కలగడంతో పాటు ఆయన గొప్పతనానికి, మొక్కవోని పట్టుదలకి జేజేలు పలకాలనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కలిగిన అనుభూతిని దృశ్యంలోకి తీసుకురావడంలో 'మల్లేశం' పూర్తిగా సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. అన్నిటికీ మించి ఆసు యంత్రమే లక్ష్యంగా బ్రతికిన వ్యక్తి అన్నేళ్ల కష్టం తర్వాత దానిని తయారు చేయగలిగిన క్షణాలని తెర మీదకి ఎఫెక్టివ్‌గా తీసుకురాలేదు.

ఆసు యంత్రం తయారీతో పాటు అక్కడి జనాల స్పందన కూడా కంగారుగా వుంటుంది తప్ప పతాక సన్నివేశానికి అవసరమైన సరంజామా కనిపించదు. అప్పటికీ రీల్‌ మల్లేశం సాధించిన ఘనతకి సంబరపడడం కంటే... రియల్‌ మల్లేశం మాటలు వినిపించినపుడే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. మల్లేశం అంతరంగంలోకి, అతని కష్టంలోకి ఇంకాస్త లోతైన దృష్టి పెట్టాల్సింది. ఇంకా బలంగా అతని కథని చూపించాల్సింది. ద్వితియార్ధంలో ఇబ్బందులున్నది నిజమే అయినా ఇలాంటి కథని తెరపైకి తెచ్చినందుకు మల్లేశం బృందానికి అభినందనలు దక్కుతాయి.

బాటమ్‌ లైన్‌: మెచ్చుకోతగ్గ ప్రయత్నం!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: హిప్పీ  సినిమా రివ్యూ: గేమ్‌ ఓవర్‌

Show comments