మహేష్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?

హీరోలు సైడ్ బిజినెస్ లు చేయడం కామన్. వస్తున్న డబ్బును ఏదో ఒకచోట పెట్టుబడి పెట్టాల్సిందే కదా. కాకపోతే ఇక్కడే హీరోల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ లాంటి హీరోలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటే.. అల్లు అర్జున్ రెస్టారెంట్లు, పబ్స్ లో డబ్బులు పెడుతున్నాడు. ఎక్కువమంది హీరోలు రియల్ ఎస్టేట్ లో తమ పెట్టుబడులు పెడుతున్నారు. కానీ మల్టీప్లెక్సుల్లో మాత్రం ఇప్పటివరకు ఏ హీరో పెట్టుబడులు పెట్టలేదు. అలాంటి బిజినెస్ లోకి ఇప్పుడు మహేష్ బాబు ఎంటరయ్యాడు.

మల్టీప్లెక్సు బిజినెస్ మంచిదే. ఇందులో కూడా డబ్బులొస్తాయి. కానీ ఈ వ్యాపారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. పెరిగిన ఖర్చులతో జనాలు థియేటర్లకు రావడం మానేశారనే వాదన ఉంది. కాస్తోకూస్తో డబ్బులు వచ్చాయంటే అది కేవలం వీకెండ్స్ లో మాత్రమే అనే అభిప్రాయం ఉంది. పైగా పైరసీ ఎఫెక్ట్ ఉండనే ఉంది. అలాంటి వ్యాపారంలోకి మహేష్ ఎందుకు ఎంటరయ్యాడనేది అందరి అనుమానం.

మరికొందరు మాత్రం మల్టీప్లెక్సు బిజినెస్ ను సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ కింద చూస్తున్నారు. ఒక్కసారి డబ్బులు పెడితే చాలు, కలకాలం రిటర్నులు వస్తూనే ఉంటాయనేది మరికొందరి వాదన. పైకి కనిపించనప్పటికీ లాంగ్ రన్ లో మల్టీప్లెక్సుల్లో బాగా డబ్బులు చేసుకోవచ్చని అంటున్నారు.

ప్రతి వీకెండ్ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. జనాలు వస్తూనే ఉంటారు. మహేష్ అంత అమాయకంగా నిర్ణయం తీసుకోడని చెబుతున్నారు. ఇది కూడా నిజమే. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ మహేష్ మాత్రం మల్టీప్లెక్సు బిజినెస్ లోకి ఎంటరయ్యాడు.

ఏషియన్ సునీల్ తో కలిసి ఏ-ఎమ్-బి సినిమాస్ అనే సరికొత్త మల్టీప్లెక్సు చైన్ స్టార్ట్ చేశాడు. తొలి మల్టీప్లెక్సును హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటుచేశారు. 1638 సీటింగ్ కెపాసిటీతో, 7 స్క్రీన్స్ తో భారీగా రూపుదిద్దుకుంది ఈ మల్టీప్లెక్సు.

నిన్ననే ఈ మల్టీప్లెక్సులో సౌకర్యాల్ని మహేష్ దగ్గరుండి పర్యవేక్షించాడు. రజనీకాంత్ నటించిన 2.0 సినిమా రిలీజ్ తో ఈ సువిశాల మల్టీప్లెక్సు గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణలో మరిన్ని పట్టణాల్లో మహేష్ మల్టీప్లెక్సులు రాబోతున్నాయి.

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments