సీట్ల లెక్కః నామినేషన్ల గడువులోగా నైనా తేలేనా?

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఈ సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తుంది ఎన్నికల సంఘం. నామినేషన్లు తుదిగడువు నవంబర్ 19వ తేదీ. వచ్చే సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇందులో సెలవులూ గట్రా పోనూ.. నామినేషన్లకు ఉన్న సమయం ఆరేడు రోజులు అనుకోవాలి.

చిత్రం ఏమిటంటే.. ఇప్పటివరకూ మహాకూటమి సీట్ల లెక్కలు తేలలేదు. తాజాగా ఆ పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాదాపు నెలరోజుల కిందటే కూటమి చర్చలు మొదలయ్యాయి. ఉన్న సీట్లేమీ కొన్ని వందల్లో లేవు. ఉన్నది 119 మాత్రమే. వాటిల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కే అని కూటమిలోని అన్నిపార్టీలూ ఒప్పుకుంటున్నాయి. తమకు సీట్ల నంబర్ ముఖ్యమే కాదని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు.

కాబట్టి కూటమిలో నంబర్ టూ నుంచి కూడా అభ్యంతరాలు లేవు. ఇక ఎటొచ్చీ పంచాయితీ అంతా సింగిల్ డిజిట్ సీట్లను ఆశిస్తున్న పార్టీలు సీపీఐ, టీజేఎస్ ల నుంచి మాత్రమే! ఈ పార్టీలేమీ తమకు డజన్ల కొద్దీ సీట్లు కావాలని అనడం లేదు. ఒకరి బేరం ఎనిమిదీ లేదా తొమ్మిది సీట్లకు మరొకరి బేరం మూడు లేదా నాలుగు సీట్లకు.

ఈ సీట్లలో కూడా ఎలాగూ ఈ కూటమి గెలవలేని సీట్లే కొన్ని ఉన్నాయి. మరి ఈ మాత్రం సీట్ల నుంబర్ ను తేల్చుకోవడం కూడా చేతకావడం లేదు ఈ ‘మహా” కూటమి నేతలకు. దేశంలో చాలాసార్లు చాలా పార్టీలు కూటములుగా కట్టాయి. అయితే ఇలా సింగిల్ డిజిట్ సీట్ల వ్యవహారాలను తేల్చుకోలేని ఘనత మాత్రం ఈ పార్టీలకే దక్కుతుంది.

వీళ్లలో వీళ్లే ఇంత సమయం అయినా తేల్చుకోలేకపోతున్నారు.. వీళ్లు ప్రజలను ఏం ఆకట్టుకుంటారు? అనేది శేష ప్రశ్న. ప్రస్తుతం అయితే వీరి పంచాయితీ ఢిల్లీలో సాగుతోంది. మరి ఎప్పడు తేలుతుంది? నామినేషన్ల తుదిగడువు లోగా నైనా వీళ్ల పంచాయితీ తెగుతుందా? అనేది ఇప్పుడు చర్చగా మారింది.

అవతల కేసీఆర్ కారు పరిగెత్తుతుంటే.. మహాకూటమి మాత్రం ఇంకా సర్దుకుంటూనే ఉంది. ఇది ఎప్పటికి రేస్ ను ప్రారంభిస్తుందో!

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments