'మహా షేక్' నా? 'మహా ఫేక్' నా?

ఈరోజు ఒక్కసారిగా బయటకు వచ్చిన ఓ వార్త భలేగా వుంది. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయబావుటా ఎగరవేయాలని కిందామీదా అవుతున్న మహాకూటమి, ఇద్దరు మనవళ్లను రంగంలోకి దించుతోందంటూ ఆంధ్రజ్యోతిలో ఓ కథనం వండారు. ఒకరు ఎన్టీఆర్ మనవడు కళ్యాణ్ రామ్. మరొకరు మర్రి చెన్నారెడ్డి మనవడు. మర్రి కుటుంబం పూర్తిగా రాజకీయాల్లోనే వుంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యం లేదు.

కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కొంతవరకే రాజకీయాల్లో వుంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో హీరోగా వున్నారు. ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. హీరోగా ఇంకా బాగా ప్రూవ్ చేసుకోవాల్సిన స్టేజ్ లోనే వున్నారు ఆయన. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి అందునా, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తారా? అన్నది అనుమానం.

ఇదంతా వట్టి ఫేక్ న్యూస్ అని కళ్యాణ్ రామ్ సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. కళ్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రావడంలేదని, ఆయన సినిమాల మీద, సినిమా నిర్మాణాల మీద, ఇతర వ్యాపారాల మీద సీరియస్ దృష్టితో వున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఓ ఫేక్ న్యూస్ ను ఇంత ప్రముఖంగా ప్రచురిస్తుందా? అన్నది ఓ అనుమానం. 

లేదా, హరికృష్ణ ఫ్యామిలీని ఇప్పటి నుంచే తెలంగాణ రాజకీయాలకు పరిచయం చేసి, ఆ విధంగా తెలంగాణకు పరిమితం చేసి, ఆంధ్రలోకి రాకుండా చేయడానికి చంద్రబాబు ఏమన్నా ఎత్తుగడ వేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

కళ్యాణ్ రామ్ అఫీషియల్ గా ఏదో విషయం చెబితే తప్ప, ఇది షేక్ న్యూస్ నా? ఫేక్ న్యూస్ నా అన్నది క్లారిటీగా తెలియదు.

Show comments