సినిమా రివ్యూ: లవర్స్‌ డే

రివ్యూ: లవర్స్‌ డే
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: సుఖీభవ సినిమాస్‌
తారాగణం: రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, నూరిన్‌ షెరీఫ్‌, షియాద్‌ షాజహాన్‌ తదితరులు
మాటలు: ఎం. రత్నం
కథనం: సారంగ్‌ జయప్రకాష్‌, లిజో పనాడా
కూర్పు: అచ్చు విజయన్‌
సంగీతం: షాన్‌ రెహమాన్‌
ఛాయాగ్రహణం: సిను సిద్ధార్థ్‌
నిర్మాత: ఏ. గురురాజ్‌
కథ, దర్శకత్వం: ఒమర్‌ లులు
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019
 
టీజర్‌ వైరల్‌ అయిన తర్వాత దాని చుట్టూ కథ అల్లుకున్నారా లేక ఊహించనంతగా పాపులర్‌ అయిన టీజర్‌ కోసం కథ మార్చేసారా? కారణమేదైనా కానీ ఈ 'లవర్స్‌ డే' సదరు టీజర్‌ని దాటి మెరవలేకపోయింది. విశేషం ఏమిటంటే అంతగా పాపులర్‌ అయి, ఎక్కడంటే అక్కడ దర్శనమిచ్చిన ఆ టీజర్‌లోని షాట్స్‌ తెరపై ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించాయి. మాటలు లేకుండా మూగ సైగలతోనే టీనేజీ ఆకర్షణలు, తొలిప్రేమని అంత అందంగా చూపించగలిగిన దర్శకుడు ఈ చిత్రాన్ని అంత రసరమ్యంగా తీర్చిదిద్దలేకపోయాడు.
 
'ఇలాంటి స్కూల్స్‌ కూడా వుంటాయా?' అనిపించేలాంటి ఒక విచిత్రమైన స్కూల్‌లో ప్లస్‌ వన్‌ విద్యార్థులు రోషన్‌, ప్రియ తొలిరోజే ప్రేమలో పడతారు. కొద్ది రోజుల్లోనే ఆమెని అతను ముద్దు కూడా పెట్టేసుకుంటాడు. ఇవన్నీ చాలా కామన్‌ విషయాల్లా స్కూల్లో అందరూ మాట్లాడేసుకుంటూ వుంటారు. దర్శకుడి కన్వీనియన్స్‌ని బట్టి ఈ స్కూల్లో అప్పుడప్పుడూ టీచర్లు కనిపిస్తుంటారు. వాళ్లు కనిపించినపుడు వీళ్లు కనిపించకపోతేనే బాగుణ్ణు అన్నట్టు బిహేవ్‌ చేస్తుంటారు.
 
ప్లస్‌ వన్‌కి రావడం అంటే ప్రేమించడానికి అర్హత సాధించారన్నట్టు కనిపించే ప్రతి పిల్ల, పిల్లాడు ఎవరో ఒకరితో సెటిల్‌ అయిపోతూ వుంటారు. అసలు జంట ప్రియ, రోషన్‌లని తొలి సీన్‌లోనే ప్రేమలో పడిపోవడం వలన రొమాన్స్‌ బిల్డప్‌కి వాడుకునే సమయాన్ని వృధా చేసుకున్న దర్శకుడు ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్‌ చేయాలో తెలియక చచ్చు కామెడీ సీన్లని, ఇంటర్‌ పిల్లల వెకిలి వేషాల్ని చూపించి నవ్వుతారా, ఛస్తారా అన్నట్టు క్రియేటివ్‌ దండన విధిస్తాడు. ఇంటర్వెల్‌ టైమ్‌కి 'అరేయ్‌ ఏంట్రా ఇదీ' అంటూ ఒక్కో ప్రేక్షకుడి ముఖంపై ఆ పాపులర్‌ మీమ్‌ ఎక్స్‌ప్రెషన్‌ పలికేట్టు చేస్తాడు.
 
అటునుంచి కథ కన్వీనియంట్‌గా అడ్డదార్లు తొక్కుతూ పోతుంది. ఒకానొక పొరపాటు వల్ల అసలు జంట ప్రేమకి అంతరాయం ఏర్పడుతుంది. ఈలోగా అంతవరకు తనకి స్నేహితురాలయిన అమ్మాయిపైకి అబ్బాయి దృష్టి మరలుతుంది. కన్నుగీటిన దృశ్యంతో పాటు తన ముద్దు తుపాకీతో ఈ చిత్రానికి ఇంత పాపులారిటీ తెచ్చిన ప్రియ దర్శకుడి కన్వీనియన్స్‌ కోసం సైడ్‌ అవగా, మరో అమ్మాయి (నూరిన్‌ షెరీఫ్‌) ఫ్రంట్‌ సీట్‌ తీసుకుంటుంది. స్టోరీ డిమాండ్‌ చేయడం కంటే దర్శకుడి కన్వీనియన్స్‌కి తగ్గట్టు క్లయిమాక్స్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. సదరు సన్నివేశంతో కన్నీళ్లు పెట్టించాలని, గుర్తుండిపోయే లవ్‌స్టోరీ అవ్వాలనేది దర్శకుడి ఉద్ధేశం కావచ్చు. కానీ అది బలవంతపు ముగింపులానే వుంటుంది తప్ప ఆశించిన రెస్పాన్స్‌ రాబట్టుకోలేదు.
 
క్యాంపస్‌ రొమాన్స్‌ దాదాపు ఇరవయ్యేళ్ల క్రితమే పాపులర్‌ అయిన కాన్సెప్ట్‌. ఈ చిత్రం అప్పుడొచ్చిన సినిమాలనే తలపించింది తప్ప కొత్తగా ఏమీ చూపించలేదు. అంతా తెలిసిన సెటప్పే అయినా సన్నివేశాల బలం, వినోదాత్మక కథనం వుంటే ఎంజాయ్‌ చేయవచ్చు. కానీ లవర్స్‌ డే అంతా రాండమ్‌ సీన్స్‌ అండ్‌ సాంగ్స్‌ సమ్మేళనమే తప్ప సీరియస్‌నెస్‌ లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండూ లేవు. రెండు, మూడు పాటలు బాగున్నాయి. టీజర్‌లో వచ్చిన మోంటేజ్‌లలాంటివి ఆకట్టుకుంటాయి. అంతకుమించి ఈ లవర్స్‌ డేలో చూసేందుకు ఏమీలేదు.
 
'ఎలా కూర్చుంటారో చూద్దాం' అనే ఛాలెంజ్‌లా అనిపించే ఫస్ట్‌ హాఫ్‌ని దాటగలిగితే సెకండ్‌ హాఫ్‌లో ఒక దారీ తెన్నూ వుందనిపిస్తుంది కానీ టీజర్‌తో రాబట్టుకున్న అటెన్షన్‌లో కనీసం పదో వంతు అవుట్‌పుట్‌ని ఇవ్వడంలో ఈ టీమ్‌ దారుణంగా ఫెయిలయింది. ప్రియా ప్రకాష్‌కి ఆ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ మినహా పర్‌ఫార్మెన్స్‌ చేతకాలేదు. రోషన్‌, నూరిన్‌ ఇద్దరూ తమ పాత్రలని రక్తి కట్టించారు. నేపథ్య సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది.
 
దర్శకుడు ఒమర్‌ మరీ స్టాండర్డ్‌ టెంప్లేట్‌ తీసుకుని ఎలాగయినా ఈతరం ప్రేక్షకులని మెప్పించాలని చాలా హద్దులు దాటాడు. దాంతో ఈ క్యాంపస్‌ అట్మాస్ఫియర్‌ అంతా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. 'ఇలాంటి స్కూల్‌ వుంటే బాగుండేది' అని పిల్లలు అనుకోవచ్చేమో కానీ రియాలిటీలో మరీ ఇలాంటి స్కూల్స్‌ ఎక్కడా వుండవు కనుక పేరెంట్స్‌ కంగారు పడాల్సిన పనిలేదు.
 
బాటమ్‌ లైన్‌: మేటర్‌ నిల్‌!

Show comments