లోకేశం.. ఏమిటీ ఆవేశం.?

మాజీ మంత్రి నారా లోకేష్‌, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోందనీ, చంపేస్తోందనీ గగ్గోలు పెడుతున్నారు. విహార యాత్రలు మగించుకుని వచ్చిన చినబాబు, రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్‌ అయిపోదామనుకునే క్రమంలో.. ముందుగా 'రాజకీయ హత్యల' అంశాన్ని ఎజెండాగా చేసుకున్నట్టున్నారు. చాన్నాళ్ళ తర్వాత నారా లోకేష్‌ నోట చిలకపలుకులు వచ్చాయి.. అవి కూడా రాజకీయ హత్యల గురించి కావడం గమనార్హం. 

రాజకీయ హత్యల్ని ఎవరైనా ఖండించాల్సిందే. కానీ, ఆ రాజకీయ హత్యలకు ఫలానా పార్టీ కారణమంటూ అడ్డగోలు వాదనలు చేస్తే ఎలా.? చంద్రబాబు హయాలో జరిగినన్ని రాజకీయ హత్యలు బహుశా ఇంకెప్పుడూ జరిగి వుండవేమో. ఎన్నికల ముందర వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగితే.. ఆ హత్య వెనుకాల అప్పటి అధికార పక్షం హస్తం వుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లిస్ట్‌ చదవడం మొదలు పెడితే ఒక పట్టాన పూర్తయ్యే వ్యవహారం కాదది. అన్ని హత్యలు జరిగాయి గడచిన ఐదేళ్ళలో. అలాగని, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో రాజకీయ హత్యలు జరిగితే ఎవరైనా సమర్థిస్తారా? ఛాన్సే లేదు. అయితే, ఆ రాజకీయ హత్యల్ని పట్టుకుని రాజకీయం చేయాలనుకోవడమో హాస్యాస్పదమవుతోందిప్పుడు. 

'మేం సంయమనం పాటిస్తున్నాం.. మేం గనుక సంయమనం కోల్పోతే..' అంటూ నారా లోకేష్‌ తనకు అస్సలేమాత్రం చేతకాని ఆవేశానికి లోనయ్యారు. ఇకనేం, సోషల్‌ మీడియాకి ఆయన బోల్డంత స్టఫ్‌ ఇచ్చేశారు. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ, మరో విషయంలోనూ చినబాబు ట్వీట్లేసి అభాసుపాలైన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా రాజకీయ హత్యలపై మాట్లాడి, విపరీతమైన ట్రాలింగ్‌ని ఎదుర్కొంటున్నారాయన. 

విమర్శలు, చీవాట్ల సంగతి పక్కన పెడితే.. 'ఎందుకొచ్చిన రాజకీయం.? ఎంచక్కా రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు కదా..!' అంటూ చాలామంది లోకేష్‌ మీద జాలి చూపిస్తున్నారు.

Show comments