అదిగో తోక.. ఇదిగో పులి అంటున్న లోకేష్

ముప్పు ముంచుకొచ్చేసింది. శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడింది. తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే ఏపీకి తీవ్రనష్టం.. ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వార్తలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ అభిప్రాయం అంటూ ఈ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

డ్యామ్ ఫౌండేషన్లో గ్యాప్ ఉందని, ఆ విషయం తాను 2008లో చెబితే ఎవరూ పట్టించుకోలేదని అన్నారట వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్. అయితే ఈ మాటల తర్వాత తెలంగాణ ఇరిగేషన్ రిటైర్డ్ చీఫ్ సాంబయ్య అనుకూలంగా పల్లవి అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే కమిటీ వేయాలని, డ్యామ్ మొదటి గేట్, చివరి గేట్ దగ్గర సపోర్ట్ గా గోడలు నిర్మించాలని తేల్చిచెప్పారాయన. శ్రీశైలం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని కూడా హెచ్చరించారు.

అసలింతకీ శ్రీశైలం డ్యామ్ కి వచ్చిన కష్టమేంటి, ఏపీకి వచ్చిన నష్టమేంటి? వాటర్ మ్యాన్ మాటల్ని పరిగణలోకి తీసుకుంటే 2008 తర్వాత శ్రీశైలం డ్యామ్ పదిసార్లకు పైగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. డ్యామ్ కి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ పుకార్ల తర్వాత ఏపీ ప్రభుత్వం తక్షణమే సర్వే చేయించింది. డ్యాంకు ఎలాంటి పగుళ్లు రాలేదు, ఎప్పటికప్పుడు గ్యాలరీ ద్వారా ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

అయితే ఈ విషయాన్ని త్వరగా క్యాచ్ చేశాననుకున్నాడో ఏమో నారా లోకేష్ రంగంలోకి వచ్చారు. వాటర్ మ్యాన్ మాటల్ని సీరియస్ గా తీసుకోవాలని సెలవిచ్చారు. తాము కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా తగుదునమ్మా అంటూ ఈ తతంగంలో తానూ ఉన్నానంటూ కెలుక్కున్నారు.

అంతా బాగానే ఉంది కానీ మరి టీడీపీ ప్రభుత్వంలో తమరు ఎందుకు ఈ చొరవ చూపలేదయ్యా అంటే లోకేశం దగ్గర సమాధానం లేదు. అన్నీ ఇప్పుడే బైటపడ్డట్టు, ఉపద్రవమేదో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ముంచుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారు చినబాబు. ఎద్దు ఈనిందంటే ముందూ వెనకా ఆలోచించకుండా దూడను కట్టేయమని చెబుతున్నారు.

ఇప్పటికైనా ఇలాంటి అవగాహన లేని విమర్శలు చేయడం లోకేష్ తగ్గించుకొని.. తనపాటికి తాను ట్విట్టర్ లో జయంతులు, వర్థంతులకు మెసేజ్ లు పెట్టుకోవడం మంచిది. 

Show comments