ఆస్తుల్లో ఉల్లిపాయ‌లను ప్ర‌క‌టించ‌ని లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ రాజ‌కీయాల్లో పార‌ద‌ర్శ‌క‌త కోసం ప్ర‌తి ఏడాది ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తుంటారు.

ఐదేళ్లు అధికారాన్ని అనుభ‌వించి, ప్ర‌జాతీర్పుతో గ‌ద్దె దిగిన త‌ర్వాత...మొట్ట‌మొద‌టిసారిగా ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించాల‌నుకున్నాడు. ఈ విష‌యమై మీడియాకు స‌మాచారం అందించాడు.

ఐదేళ్ల‌లో టీడీపీ నేత‌లు ఏకంగా ఇసుక‌, మ‌ట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించిన నేప‌థ్యంలో లోకేశ్ ఆస్తుల ప్ర‌క‌ట‌న‌కు ప్రాధాన్యం సంత‌రించుకొంది. చెప్పిన ప్ర‌కారం లోకేశ్ మీడియా ముందుకు వ‌చ్చాడు. పెద్ద ఎత్తున లోక‌ల్‌, నాన్ లోక‌ల్ మీడియా ప్ర‌తినిధులు రావ‌డంతో టీడీపీ కార్యాల‌యం కిక్కిరిసింది.

హెరిటేజ్‌లో భార్య బ్రాహ్మ‌ణి, కుమారుడు దేవాన్ష్‌, తల్లిదండ్రులు భువ‌నేశ్వ‌రి, చంద్ర‌బాబుల‌కు సంబంధించి షేర్లు, జూబ్లీహిల్స్‌లో ఇల్లు, నారావారిప‌ల్లెలో ఇంటి విలువ‌...ఇలా చెప్పుకుంటూ పోయి అంతిమంగా త‌మంద‌రి ఆస్తుల విలువ రూ.200 కోట్ల‌ని తేల్చి ప‌డేశాడు.

ఇక మీరు ఏవైనా అడ‌గాల్సిన‌వి ఉంటే అడ‌గండి అని లోకేశ్ అన్నాడు. "సార్ ఇటీవ‌ల మీ ఇంటికి ఓ లారీ లోడ్ వ‌చ్చింది. ఇంత‌కూ అందులో ఏమున్నాయ్" అని సాక్షి విలేక‌రి ప్ర‌శ్నించాడు.

"అయ్యా ఇంట్లోకి తిన‌డానికి తెచ్చుకునేవి కూడా చెప్పాలా" అని లోకేశ్ ఎదురు ప్ర‌శ్నించాడు.

"సార్ ఇంత‌కూ అవేంటో చెప్పండి" అని ఒక‌రికి ఇద్ద‌రు విలేకరులు తోడై ప్ర‌శ్నించారు.

"అయ్యా అవి ఉల్లిపాయ‌లు. మున్ముందు మ‌రింత‌గా రేటు పెరుగుతుంద‌నే భ‌యంతో ఓ లోడ్‌ను దింపించుకున్నాం. ఏం త‌ప్పా" అని సీరియ‌స్ అయ్యాడు.

"లోకేశ్ గారూ మీ ఆస్తుల విలువంతా ఒక లెక్క‌. ఉల్లిపాయ‌ల‌న్నీ మ‌రో లెక్క‌. మీ ఇంట్లో లారీ ఉల్లిపాయ‌లుంటే స‌మాజంలో మీ స్టేట‌స్ ఏంటో మీకే తెలియ‌డం లేదు" అని విలేక‌రులు అన్నారు.

"అందుకే క‌దయ్యా నేను వాటి వివ‌రాలు చెప్ప‌కుండా దాచింది. నేనేమైనా పిచ్చోడినా" అని విలేక‌రుల వైపు ఓ వెర్రి చూపు లోకేశ్ చూశాడు.

లోకేశా...నువ్వు మామూలోడివి కాద‌య్యా అనుకున్నారంతా.

Show comments