లోకేషూ.. 'నారా' ఆస్తుల కథా కమామిషు.!

చెప్పేవాడికి వినేవాడు లోకువన్నది ఉత్తమాట కాదు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌, ప్రకటించిన 'నారా వారి' ఆస్తుల ప్రసహనం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.! 'మేం ఏమన్నా వెర్రి వెంగళప్పలమా.?' అన్న అనుమానం కలుగుతుంటుంది నారా లోకేష్‌ కావొచ్చు, చంద్రబాబు కావొచ్చు తమ ఆస్తుల గురించి చెప్పినప్పుడు.

పదే పదే చంద్రబాబు చెబుతుంటారు, తన వేలికి ఉంగరం కూడా వుండదనీ.. తన జేబులో వందనోటు కూడా వుంచుకోనని. అంతటి పేదరికంలో చంద్రబాబు మగ్గిపోతున్నారని జనం అనుకోవాలి. నిజమేనా.? చంద్రబాబు ఎంత ఘనాపాటి అన్నది జనానికి తెలియకుండా వుంటుందా.?

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తూ, తననెవరూ చూడలేదనుకుంటుందట.. చంద్రబాబు చెప్పే చోద్యాలు, చేసే పనులు అలాగే వుంటాయ్‌ మరి. వరుసగా ఎనిమిదోసారి 'నారా వారి కుటుంబ ఆస్తుల ప్రకటన' అనే ప్రసహనం తెరపైకొచ్చింది.

షరామామూలుగానే నారా లోకేష్‌ తాము ఏం చెప్పదలచుకున్నదీ చెప్పేశారు. చంద్రబాబు ఆస్తుల కంటే లోకేష్‌ ఆస్తులు ఎక్కువ.. లోకేష్‌ కంటే, వాళ్ళ అమ్మగారి ఆస్తులు ఇంకా ఎక్కువ. చిత్రంగా లోకేష్‌ సతీమణి బ్రాహ్మణి ఆస్తులు కాస్త తక్కువగానే వున్నాయి.

అన్నట్టు, చంద్రబాబు మనవడి ఆస్తులు గట్టిగానే వున్నాయండోయ్‌. చంద్రబాబుకి 3 కోట్లు, బ్రాహ్మణికి 7 కోట్లు, దేవాన్ష్‌ (చంద్రబాబు మనవడు) 18.71 కోట్లు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు 31 కోట్లని నారా లోకేష్‌ వెల్లడించిన ఆస్తుల్ని బట్టి అర్థమవుతోంది.

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు 'డాష్‌.. డాష్‌..' అన్నట్టుంది వ్యవహారం. జనం నమ్ముతున్నారు కదా అని.. నారా వారు ఇలాంటి లెక్కలు చెబుతోంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. తమది క్లీన్‌ కుటుంబం అనీ, ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా ఆస్తుల ప్రకటన చేస్తున్నామనీ, ఇలా ఆస్తుల ప్రకటన చేసే సత్తా ఇంకెవరికీ లేదనీ నారా లోకేష్‌, తన తండ్రి చంద్రబాబులానే తన జబ్బలు తానే చరిచేసుకున్నారు.

జనం చెప్పాలి ఎవరెంత నిజాయితీపరులో. కానీ, ఆ ఛాన్స్‌ చంద్రబాబుకిగానీ, లోకేష్‌కిగానీ లేదు కదా.! అదే అసలు సమస్య.

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments