లోకేష్ కామెడీ చూసి చాన్నాళ్లయింది మరి!

నారా లోకేష్ బాబు .. ఎన్నికల తర్వాత.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల సమయంలో అయితే.. లోకేష్ బాబు ప్రతిరోజూ ప్రజల్లో తిరిగేవారు. ప్రతిరోజూ కామెడీ పండేది.. ప్రజలు ఎంచక్కా.. కడుపుబ్బా నవ్వుకుంటుండే వాళ్లు. ఎన్నికల్లో పాపం ఎన్ని కోట్లు కుమ్మరించినా.. మంగళగిరి ప్రజలు ఆయన ఛీకొట్టి పంపించారు.

చివరికి.. తమ నియోజకవర్గం నుంచి పోటీచేసి.. రాష్ట్ర ప్రజలందరికీ విపరీతంగా నవ్వులు పంచిపెట్టి.. కామెడీ పండించి తమ ఊరికి కీర్తి తెచ్చి పెట్టాడనే కృతజ్ఞత కూడా లేకుండా మంగళగిరి ప్రజలు ఓడించారు.

ఇప్పుడు మళ్లీ మంగళగిరి వచ్చాడు లోకేష్. అక్కడ పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడాడు. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా.. మంగళగిరి ప్రజలను తాను వదలిపోలేదని స్పష్టం చేశారు.

ప్రజలకు మళ్లీ తన మార్కు కామెడీని రుచిచూపించారు లోకేష్. శాసనమండలికి వచ్చే మంత్రులు అక్కడ తన పేరు ఎత్తడానికి కూడా భయపడిపోతున్నారంటూ.. లోకేష్ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. మండలికి వచ్చే మంత్రులు.. లోకేష్ పేరు ఎత్తకపోవచ్చు గాక... అసలు తాము పేరు ప్రస్తావించడానికి తగిన అర్హత లోకేష్ కు లేనేలేదని వారు భావించి ఉండవచ్చు.

అలా వాళ్లు ఈసడించి వదిలేస్తే.. లోకేష్ మాత్రం.. తనను చూసి భయపడే వాళ్లు తన పేరు ఎత్తడం లేదనడం చిత్రంగానే ఉంది. దారిలో పురుగు కనిపిస్తే.. పక్కకు తప్పుకుని వెళ్తాం.. అంతే తప్ప దానితో గొడవ పెట్టుకోం కదా.. అదే మాదిరిగా.. లోకేష్ సభలో ఉన్నంత మాత్రాన పట్టించుకోకుండా.. తమ పని తాము చేసుకుంటూ మంత్రులు ఉండొచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

లోకేష్ మరో కీలకమైన మాట కూడా చెప్పారు. నేను చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకం కాదు... నాన్న గెలిచిన చోటే గెలవాలనుకోలేదు..అని లోకేష్ అన్నారు. అది నూరుశాతం నిజం. నిజానికి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేది ఆయన తండ్రి చంద్రబాబునాయుడు.చూడబోతే.. లోకేష్ ఆ విషయాన్నే ఇండైరక్టుగా చెప్పినట్టుంది.

ఎన్ టి రామారావు పేరు చెప్పి తాను సీఎం కావాలనుకున్నది చంద్రబాబే.లోకేష్ ఆయన కొడుకు మాత్రమే. కాయపేరు చెప్పి.. పిందెలు కూడా అమ్మేయాలని అనుకునే రకం లోకేష్. కాబట్టే కాయవంటి చంద్రబాబు కొడుకుగా పిందె వంటి తాను ఎమ్మెల్యేగా గెలవాలని అనుకున్నాడు. ఏ అర్హతా లేకుండా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని కూడా అనుభవించాడు. అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

నాన్న పోటీచేసిన చోట తాను పోటీచేయలేదు అంటున్నాడు గానీ.. నిజానికి ఆ చోటు ఖాళీ చేసి కొడుక్కి ఇస్తే , రాష్ట్రంలో మరో చోట నుంచి తాను కూడా గెలవనని నాన్నకు కూడా భయం ఉన్నట్లుంది.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Show comments