ముఖ్యమంత్రి యువనేస్తం అవసరమా..?

2014 ఎన్నికల్లో యువత ఓట్లు కొల్లగొట్టడానికి చంద్రబాబు వేసిన అతి భారీ ఎత్తుగడ నిరుద్యోగ భృతి. చదువుకున్నవాళ్లు, ప్రైవేట్ ఉద్యోగులు.. చాలామంది బాబుని గుడ్డిగా నమ్మి అప్పట్లో నిరుద్యోగ భృతి కోసం బోల్తాపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన నాలుగేళ్ల తర్వాత మొక్కుబడిగా ఈ పథకాన్ని పట్టాలెక్కించి మమ అనిపించారు బాబు. టీడీపీ కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నేతలు మినహా.. సామాన్యులెవరూ ఈ భృతి అందుకున్న పాపాన పోలేదు.

కాలం మారింది. జగన్ ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కారు. మిగతా పథకాల విషయంలో కాస్త క్లారిటీ ఉంది కానీ, నిరుద్యోగ భృతిపై మాత్రం ఇప్పటివరకూ సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో అసలు ఈ పథకం కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అయితే సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్లు, గ్రామ సచివాలయం వ్యవస్థతో.. నిరుద్యోగ భృతి పథకం దాదాపు లేనట్టే అనుకోవాలి.

ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో గత ప్రభుత్వం 5 లక్షల 2వేల 5వందల మందికి మొక్కుబడిగా ఆర్థికసాయం అందించింది. ఇప్పుడు జగన్ హయాంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయం పేరుతో దాదాపుగా 5లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒకరకంగా ఇక యువనేస్తం పథకం అవసరం ఉండదు. ఉద్యోగాలు వచ్చేవరకు వారికి ఆర్థిక ఆసరాగా ఉండటానికే యువనేస్తం పథకం రూపకల్పన చేశారు. స్థానికంగా ఉద్యోగాలు వస్తుంటే ఇక నిరుద్యోగ భృతి ఎందుకు?

నిరుద్యోగ భృతికి గ్రామ సచివాలయమే సరైన మందు అని భావిస్తున్నారు నిపుణులు. కేవలం భృతి ఇచ్చి చేతులు దులుపుకునేకంటే, ఏకంగా ఉపాధి అవకాశమే కల్పిస్తున్నప్పుడు నిరుద్యోగుల నుంచి ఎలాంటి సమస్య ఉండదని వాళ్లు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

పరిటాల శ్రీరామ్..చలో సింగపూర్ అంటారా?